Green Shakshuka । స్ప్రింగ్ ఆనియన్, గుడ్లను కలిపి చేసే శాక్షుక.. బ్రేక్‌ఫాస్ట్ చేసేయండి భేషుగ్గా!
06 November 2022, 8:05 IST
- Green Shakshuka Recipe: పాలకూర, స్ప్రింగ్ ఆనియన్, కోడిగుడ్లు కలిపి ఈజిప్షియన్ తరహాలో గ్రీన్ శాక్షుక చేసుకొని రోటీతో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Green Shakshuka Recipe:
వీకెండ్ వచ్చేసింది. ఆలస్యంగా నిద్రలేచి, ఓపికగా బ్రేక్‌ఫాస్ట్ చేసి.. రిలాక్స్‌గా ఉండే సమయం ఇది. రోజూ హడావిడిగా సరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే పనులకు వెళ్లిపోతారు కాబట్టి, ఈరోజు ప్రత్యేకంగా తినాల్సిన సమయం. అందుకే మీకు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. దీని పేరు శాక్షుక. ఎప్పుడూ విననట్లు ఉంది అనిపిస్తుంది కదా. కానీ ఇది మనకు కొద్దిగా తెలిసిన రుచే.
శాక్షుక అనేది ఒక క్లాసిక్ నార్త్ ఆఫ్రికన్, మిడిల్ ఈస్టర్న్ వంటకం. దీనిని ఎక్కువగా ఈజిప్టు దేశంలో అల్పాహారంగా లేదా రోజులో మరేదైనా సమయంలో భోజనం కలుపుకొని తింటారు. ఇది గుడ్డును గిలకొట్టి చేసే వంటకం. మనం సాధారణంగా కొన్ని టొమాటోలు, గుడ్లను కలిపి చేసే ఇరానియన్ ఆమ్లెట్ లాగా ఉంటుంది. టొమాటోలు శాక్షుక, పాలకూర శాక్షుక, ఆరెంజ్ శాక్షుక, స్ప్రింగ్ ఆనియన్ శాక్షుక ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. దీనిని చపాతీ లేదా పరాఠాలతో అద్దుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
టొమాటో ఎగ్ ఎప్పుడూ చేసుకునేదే కాబట్టి, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ శాక్షుక రెసిపీని తెలుసుకుందాం. దీనిని గ్రీన్ శాక్షుక అని కూడా పిలుస్తారు. గ్రీన్ శాక్షుక తయారీ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఈ కింద చూడండి.
Green Shakshuka Recipe కోసం కావలసినవి
- 3 గుడ్లు
- 2 స్ప్రింగ్ ఆనియన్
- 1 ఉల్లిపాయ
- 3 వెల్లుల్లి రెబ్బలు
- 1 కప్పు పాలకూర
- 4-5 బ్రస్సెల్ (క్యాబేజీ) మొలకలు
- 1 స్పూన్ కారం
- 1/2 స్పూన్ మిరియాల పొడి
- 1/2 స్పూన్ ఉప్పు
- 2-3 స్పూన్ ఆలివ్ నూనె
గ్రీన్ శాక్షుక రెసిపీ- తయారీ విధానం
- ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె పోసి వేడి చేయండి, ఆపై తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిని వేసి వేయించండి.
- ఇప్పుడు పాలకూర, బ్రస్సెల్ మొలకలు వేసి కలపాలి. ఆపై కారం, ఉప్పు, మిరియాలు చల్లుకొని, అన్నీ బాగా కలపండి.
- ఇప్పుడు మంట తగ్గించి గుడ్లను పైనుంచి పగలగొట్టి వేయాలి, పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ చల్లుకోవాలి.
- ఇప్పుడు ఏమి కలపకుండా మూతపెట్టి అలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి.
- టేస్ట్ కోసం పైనుంచి అక్కడక్కడ ఉప్పు చల్లుకోండి.
అంతే గ్రీన్ శాక్షుక రెడీ అయినట్లే. దీనిని రోటీ, పరోఠా లేదా బ్రెడ్ ఎలా అయినా తినొచ్చు. అన్నంతో కలుపుకొని తిన్నా కూడా అదిరిపోతుంది.