Poha Idli Breakfast | పోహా ఇడ్లీతో కొకనట్ మింట్ చట్నీ.. కడుపు చల్లగా, ఎంతో తేలిక
26 October 2022, 8:11 IST
- కడుపు హెవీగా ఉండి బ్రేక్‌ఫాస్ట్ మానేయాలనుకుంటున్నారా? అస్సలు వద్దు మీకు చాలా తేలికగా అనిపించే Poha Idli Recipe ని ఇక్కడ అందిస్తున్నాం. ఇది తయారు చేయటం తేలిక, తింటే కూడా లైట్‌గా ఉంటుంది.
Poha Idli Recipe
దీపావళి కోసం చేసిన ప్రత్యేకమైన పిండి వంటలు, స్వీట్లు తిని తిని మీ కడుపు వారం రోజులకు సరిపడా నిండిపోయి ఉండవచ్చు. మరి ఇప్పుడు ఎలా, తినకుండా ఉండాలా? అనుకుంటున్నారా? అవసరం ఏం లేదు, తేలికగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాంటి ఒక రెసిపీని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. అదేమిటంటే పోహా ఇడ్లీ.
మీరు చాలా సార్లు ఇడ్లీ తిని ఉంటారు, పోహా తిని ఉంటారు. రెండింటి కలయికతో వచ్చిన ఈ రెసిపీ, కడుపులో చాలా తేలికగా ఉంటుంది. అదే దీనిని కొకనట్ మింట్ చట్నీతో కలుపుకొని తింటే ఎంతో రుచిగానూ ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. అంటే ఇది ఒక రొంభనల్ల డిటాక్స్ ఇడ్లీ అన్నమాట.
ఇక, ఈ పోహా ఇడ్లీ చేసుకోటానికి పెద్దగా శ్రమ ఏమి ఉండదు. దీనిని అప్పటికప్పుడే ఇన్‌స్టంట్‌గా సిద్ధం చేసుకోవచ్చు. ఈ రెసిపీకి అవసరమయ్యే పదార్థాలు కూడా చాలా తక్కువే. మరి పోహా ఇడ్లీకి కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూసేయండి.
Poha Idli Recipe కోసం కావలసినవి
- 1 కప్పు మందపాటి అటుకులు
- 1 కప్పు ఇడ్లీ రవ్వ
- 1 కప్పు పెరుగు
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా లేదా ఈనో
- నీరు సరిపడినంత
కొకనట్ మింట్ చట్నీ కోసం కావలసినవి
- 1 కపు తాజా కొబ్బరి తురుము
- 2 టీస్పూన్ల పుట్నాలు
- అరకప్పు కొత్తిమీర
- పావు కప్పు పుదీనా
- 2-3 పచ్చిమిర్చి
- 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 1 కప్పు నీరు
పోహా ఇడ్లీ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా అటుకులను పొడిగా, మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి.
- అటుకుల పొడిలో పెరుగు వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసి, కొన్ని నీళ్లు పోసి అన్నీ కలిసిపోయేలా మెత్తగా చేయాలి. దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కనబెట్టండి.
- 15 నిమిషాల అనంతరం మరికొన్ని నీళ్లు బేకింగ్ సోడా, లేదా ఈనో కలుపుకోవాలి.
- పిండి ఇడ్లీలు చేసేందుకు వీలుగా సరిపడా నీరు కలుపుతూ బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి.
- ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీలు వేసి, 15 నిమిషాలు ఆవిరిలో ఉడికిస్తే వేడివేడి పోహా ఇడ్లీ రెడీ.
- కొకనట్ మింట్ చట్నీ కోసం పైన పేర్కొన్న పదార్థాలన్నీ జార్ లో వేసి మిక్సీలో రుబ్బుకుంటే చట్నీ రెడీ.
ఇప్పుడు మీరు తినడానికి రెడీ. పోహా ఇడ్లీలో, చట్నీ కలుపుకొని తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది.