Iranian Omelette । రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ చేయాలా? ఇరానియన్ ఆమ్లెట్ ట్రై చేయండి!
అల్పాహారం సిద్ధం చేసేందుకు సమయం చిక్కడం లేదా? కేవలం 10-15 నిమిషాలు చాలు ఇరానియన్ స్టైల్ ఆమ్లెట్ చేయటానికి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేయచ్చు, మధ్యాహ్నం భోజనంలో తినొచ్చు.
ఆదివారం గడిచి సోమవారం వచ్చేసింది, ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం లేవగానే అన్ని పనులు త్వరగా చేసుకోవాల్సి వస్తుంది. వేగంగా అల్పాహారం చేయటానికి అందుబాటులో ఉండే ఆప్షన్లలో గుడ్డుతో చేసే రెసిపీలు ఎన్నో ఉన్నాయి. బ్రేక్ ఫాస్ట్ కోసం ఈజీగా ఆమ్లెట్ చేసుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అందరూ సాధారణంగా వండుకునే వంటకాలలో ఆమ్లెట్ ఒకటి. అల్పాహారంగా తినవచ్చు, మధ్యాహ్నం భోజనంలో చేర్చుకోవచ్చు, రాత్రి డిన్నర్ కోసం ఉపయోగపడుతుంది. గుడ్లతో అనేక రకాల వంటకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఆమ్లెట్ అనేది బ్యాచిలర్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా సులభంగా చేసుకునే వంటకం.
అయితే ఎప్పుడూ ఒకే రకమైన ఆమ్లెట్ తిని విసిగిపోతే కొన్ని టొమాటోలు కలిపి ఇరానియన్ శైలిలో వండుకోవచ్చు. దీనిని ఇరానియన్ ఆమ్లెట్ అనే పిలుస్తారు. ఈ ఇరానియన్ ఆమ్లెట్ మీరు చాలా సార్లే చేసుకొని ఉంటారు. అయినప్పటికీ మరోసారి, మరింత రుచికరంగా ఎలా చేసుకోవాలో రెసిపీని ఇక్కడ అందజేస్తున్నాం. కేవలం 15 నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ కింద చూసేయండి.
ఇరానియన్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
2-3 గుడ్లు
2-3 టమోటాలు
1 ఉల్లిపాయ
2-3 నల్ల మిరియాలు
1 టీస్పూన్ కారం
1/2 tsp దాల్చిన చెక్క
1 టీస్పూన్ వెల్లుల్లి
2-3 టీస్పూన్ల నూనె
రుచి ప్రకారం ఉప్పు
బ్రెడ్
తయారీ విధానం
ఇది గుడ్డు ఫ్రై చేసుకున్నట్లుగా ఉంటుంది. అయితే విధానంలో కొద్దిగా మార్పు ఉంటుంది.
1. ముందుగా పాన్‌ను వేడి చేసి, అందులో నూనె వేడి చేసి దాల్చినచెక్క, మిరియాలు, వెల్లుల్లి ముక్కలు వేయించాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి కరకరలాడేలా వేయించాలి.
2.తరువాత తరిగిన టొమాటో ముక్కలు వేసి, ఆపై కారం, ఉప్పు వేసి ఉడికించాలి.
3. టొమాటో కర్రీలాగా ఉడికిన తర్వాత దానిపై గుడ్లను పగలగొట్టండి. కలపవద్దు అలాగే మూతపెట్టి ఉడికించండి.
4. ఈ సమయంలో ఫ్లేవర్ కోసం పావు టీస్పూన్ ధనియా పౌడర్, అలాగే తాజా కొత్తిమీర చల్లుకోవచ్చు.
5. ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత గుడ్లు హాఫ్ బాయిల్డ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసేయాలి.
అంతే, ఇరానియన్ స్టైల్ ఆమ్లెట్ సిద్ధంగా ఉంది. దీనిని ముక్కలుగా కట్ చేసి బ్రెడ్‌తో కలిపి సర్వ్ చేయండి, ఈ రుచిని ఆస్వాదించండి.
దీనిని అన్నంతో కలిపి తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది.
సంబంధిత కథనం