తెలుగు న్యూస్  /  Lifestyle  /  Celebrate Like Never Before, These Are The Best Places To Witness The Sankranti Entertainment In India

Sankranti Tour । అసలైన సంక్రాంతి వినోదాన్ని ఆస్వాదించాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లండి!

HT Telugu Desk HT Telugu

12 January 2023, 16:29 IST

    • Sankranti Tour:  సంక్రాంతి వేడుకలలో పాల్గొనాలనుకుంటున్నారా? భారతదేశంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగే అద్భుత ప్రదేశాలు ఇక్కడ తెలుసుకోండి.
Sankranti Tour
Sankranti Tour (Getty Images)

Sankranti Tour

Sankranti Tour: భారతదేశం అంతటా ఘనంగా, వైభవంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలలో ఈ పండగను పొంగల్ లేదా మకర సంక్రాంతి పేర్లతో నాలుగు రోజుల పండుగగా జరుపుకుంటారు. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో దీనిని ఉత్తరాయణం అని పిలుస్తారు. మకర సంక్రాంతి పండగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఈ మార్పు పంటకాలం ముగిసిన తర్వాత మరొక ఆరోగ్యకరమైన కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఈ పండగల సమయంలో పిల్లలకు సెలవులు దొరుకుతాయి. సాధారణం పండగ రోజుల్లో అందరూ సొంతూళ్లకు వెళ్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో సొంతూళ్లకు కాకుండా, వేరే చోటుకు వెళ్లి వేడుక చేసుకోవడం ద్వారా కూడా అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతకు మించిన పండగ వినోదం కూడా దొరుకుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి వేడుకలు అసాధారణ రీతిలో జరుగుతాయి. అక్కడి ఉత్సవాలు, ఆటల పోటీల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అక్కడికి వెళ్లి ఆ వినోదాన్ని ఆస్వాదిస్తే, జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు. మరి ఎక్కడ సంక్రాంతి వేడుకలు గొప్పగా జరుగుతాయో తెలుసుకుందామా?

ఉభయ గోదావరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వారికి 'మకర సంక్రాంతి' అతిపెద్ద పండగ. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు చాలా ఘనంగా పండగను జరుపుకుంటారు. ఏడాదంతా వెలవెలబోయే పల్లెటూర్లన్నీ సొంతవారి రాకతో మళ్లీ నిండుగా కళకళలాడుతాయి. కుటుంబ సభ్యులు, బంధువులంతా ఒక్కచోట చేరి ఆనందంగా పండగ జరుపుకుంటారు, పిండి వంటలు చేసుకొని తింటారు, విందులు వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ముగ్గులు, గొబ్బెమ్మలతో వాకిళ్లను సింగారిస్తారు, ఇళ్లను అలంకరిస్తారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, సంక్రాంతి సందర్భంగా జరిగే కోడిపందాలు. ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు ఉన్నప్పటికీ కోస్తాంధ్రలో జోరుగా కోడిపందాలు జరుగుతాయి. ఈ కోడిపందాలను చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు. ఇవే కాకుండా పురాణ పాత్రలతో నాటకాలు, ఆటల పోటీలను నిర్వహిస్తారు. సంక్రాంతి వేడుకలను చూడటానికి ఏపిలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాలను తప్పకుండా చుట్టి రావాలి.

తెలంగాణ రాష్ట్రంలోనూ సంక్రాంతి రెండో అతిపెద్ద పండగ, ఇక్కడ మూడు రోజుల పాటు సంక్రాంతి జరుపుకుంటారు. ఇక్కడ ఊర్లల్లో గాలిపటాలు ఎగరేస్తూ పోటీలు పెట్టుకుంటారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి.

మధురై, తమిళనాడు

మకర సంక్రాంతిని జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాల గురించి చర్చించేటప్పుడు, తమిళనాడు రాష్ట్రంలోని మదురై జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. మీనాక్షి అమన్ ఆలయానికి ప్రసిద్ధి చెందిన పురాతన మదురైలో స్థానికంగా పొంగల్ వేడుకలుగా ఘనంగా జరుగుతాయి. పండుగ సమయంలో ఇక్కడ ప్రధాన ఆకర్షణలలో ఒకటి సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు. ఎద్దును మచ్చిక చేసుకునే ఈ సంప్రదాయ క్రీడలో ప్రమాదాలు జరుగుతాయి. అయితే తమిళులకు, ఇది కేవలం క్రీడ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. గాయాలు అయినా, ప్రాణాలు పోయినా జల్లికట్టును మాత్రం వదలరు. తమిళ ఆచారాలలో ఈ క్రీడకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి జల్లికట్టును చూడటానికి రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు.

అహ్మదాబాద్, గుజరాత్

గుజరాత్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. పండగ రోజున నగరం మొత్తం పండగ శోభతో ఆహ్లాదకరంగాఅ ఉంటుంది. అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్ వేడుకలకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది , మీ జీవితకాలంలో ఒక్కసారైనా చూడాలి. ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు, విభిన్న ఆకారాలు, వివిధ పరిమాణాలతో పతంగులు ఆకట్టుకుంటాయి. అహ్మదాబాద్ మకర సంక్రాంతికి భారతదేశంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ సీజన్‌లో దుంపలు, బీన్స్, కూరగాయలతో తయారుచేసిన ఉండీయో వంటి స్థానిక రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు.

గౌహతి, అస్సాం

గౌహతిలో మకర సంక్రాంతిని మాగ్ బిహుగా జరుపుకుంటారు. భోగాలీ బిహు అని కూడా పిలుస్తారు, ఇది అస్సామీ పంటల పండుగ, ఇది మాఘ మాసంలో పంట కాలం ముగింపును సూచిస్తుంది. పండుగలో భాగంగా విందులు, వినోదాలు ఉంటాయి. భోగి మంటలు నిర్వహిస్తారు. యువకులు వెదురు, ఆకులు, గడ్డితో మెజీ అని పిలిచే గృహాలను నిర్మిస్తారు, ఆ మరుసటి రోజు ఉదయం ఆ గుడిసెలను కాల్చేసే వేడుకలు జరుగుతాయి. టేకేలి భోంగా (కుండ పగలగొట్టడం) , గేదెల పోరు వంటి సాంప్రదాయ అస్సామీ క్రీడలు కూడా ఉత్సవాల్లో భాగంగా ఉన్నాయి. బిహు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతికి గౌహతికి వెళ్తే ఇవన్నీ చూడొచ్చు.

కోణార్క్, ఒడిషా

సంక్రాంతి సూర్య భగవానుడికి అంకితం ఇచ్చే పండగ. ఒడిషాలోని విశాలమైన కోణార్క్ సూర్య దేవాలయం ఎంతో ప్రసిద్ధి. సూర్యుడు తన ఉత్తరం వైపుకు సంక్రమణ ప్రారంభించినపుడు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించే పూజలు పురాతన శాస్త్రాల పరంగా ఎంతో ప్రాముఖ్యమైనదిగా భక్తులు భావిస్తారు. అంతేకాకుండా ఒడిషాలోని మయూర్‌భంజ్, సుందర్‌ఘర్, కియోంజర్ జిల్లాలలో 40% మంది ఆదివాసీలే ఉంటారు, సంక్రాంతి సీజన్ సందర్భంగా వీరంతా ఒక వారం పాటు పాడతారు, నృత్యం చేస్తారు, మరెన్నో జానపద కార్యకలాపాలు నిర్వహిస్తారు.