తెలుగు న్యూస్  /  Lifestyle  /  Add These 5 Amazing Seeds In Your Diet To Control Your Blood Sugar Levels

World Diabetes Day 2022: ఈ 5 రకాల గింజలతో మీ డయాబెటిస్‌కు చెక్ పెట్టండి

HT Telugu Desk HT Telugu

14 November 2022, 12:46 IST

    • World Diabetes Day 2022: డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు 5 రకాల గింజలను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
5 రకాల గింజల్లో డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గుణాలు
5 రకాల గింజల్లో డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గుణాలు (Unsplash)

5 రకాల గింజల్లో డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గుణాలు

డయాబెటిస్‌ను అదుపులో పెట్టడానికి తక్కువ గ్లూకోజ్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు తరచుగా చెబుతుంటారు. రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా ఉండేందుకు ఈ సలహా పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా పిండి పదార్థాలు అధికంగా లేని బ్రకోలి, క్యారట్లు వంటి కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచిస్తారు. అలాగే కమలా పండ్లు(సంత్రాలు), ఆపిల్, బెర్రీస్ వంటి పండ్లు కూడా తినాలి. గింజ ధాన్యాలు, ప్రోటీన్ కలిగిన ఆహారం కూడా డయాబెటిస్ డైట్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వీటికి రక్తంలో గ్లూకోజు స్థాయిని నియంత్రించే శక్తి ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారం ఏ రూపంలో ఉంది? ఎలా వండుతున్నామన్న అంశాన్ని బట్టి పోషక విలువలు మారుతుంటాయి.

మెంతులు, వాము (ఓమ) గింజలు కార్బొహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఆ కారణంగా రక్తంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగదు. వీటితో పాటు కొన్ని తృణ ధాన్యాలు, స్మూతీ, స్నాక్స్ కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్యకరమైన ఆహారం జోలికి పోకుండా కాపాడుకోవచ్చు.

డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకునేందుకు 5 రకాల గింజలు తప్పనిసరిగా తీసుకోవాలని హార్మోనల్ హెల్త్ స్పెషలిస్ట్, ఇంటిగ్రేటివ్ హెల్త్ కోచ్, న్యూట్రీషనిస్టు ఊర్వశి అగర్వాల్ చెబుతున్నారు.

1. Methi Seeds (Fenugreek Seeds): మెంతులు

కరిగే గుణమున్న ఫైబర్ ఈ మెంతి గింజల్లో ఉంటుంది. దీనిని గాలక్టోమనన్ అంటారు. ఇది కార్బొహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. తద్వారా డయాబెటిస్ పేషెంట్లలో ఇది రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తుంది. గ్లూకోజ్ సహనశీలతను పెంచుతుంది.

2. Ajwain Seeds (Carom Seeds): వాము (ఓమ) గింజలు

వాము గింజలు డయాబెటిస్‌ను మేనేజ్ చేయడంలో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ డయాబెటిస్‌ను అదుపులో ఉంచేలా చేస్తుంది. దీనికి తోడు ఈ వాము గింజలు యాంటీఆక్సిడాంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి మెటబాలిజమ్‌ను మెరుగుపరుస్తాయి. మెటబాలిజమ్ మెరుగైతే బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. తద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచడం సులువవుతుంది.

3. Sabja Seeds (Basil Seeds): సబ్జ గింజలు

సబ్జ గింజల్లో అధిక ఫైబర్ ఉంటుంది. భోజనానికి ముందు డయాబెటిస్‌ పేషెంట్లకు సబ్జ గింజలు ఇచ్చినప్పుడు అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా నిరోధించాయని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ పేషెంట్లలో రక్తంలో గ్లూకోజు స్థాయి పెరగకుండా ఈ సబ్జ గింజలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది.

4. Flax Seeds: అవిసె గింజలు

అవిసె గింజలతో మనకు చాలా మేలు జరుగుతుంది. వీటిలో కరగని గుణం ఉన్న ఫైబర్ నిల్వలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడమే కాకుండా మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండేలా కాపాడుతుంది. అవిసె గింజలు టైప్-1, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించే గుణం కలిగి ఉన్నాయని ఇటీవలి ఒక అధ్యయనం తెలిపింది. వీటిలో ఉండే లిగ్నాన్ పదార్థం ఇందుకు దోహదపడుతుందని ఆ అధ్యయనం తెలిపింది.

5. Kaddu Seeds (Pumpkin Seeds): గుమ్మడి గింజలు

ట్రైగానెలిన్ (టీఆర్‌జీ), నికోటినిక్ యాసిడ్(ఎన్‌ఏ), డీ-చిరో-ఐనాసిటాల్ (డీసీఐ) వంటి పదార్థాలు ఈ గుమ్మడి గింజల్లో ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. ఇవి ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఒమెగా-6 కొవ్వులు, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రించడంలో తోడ్పడుతాయి.

ఈ ఐదు రకాల గింజలను మీ డైట్‌లో చేర్చుకుని డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోండి. ఒత్తిడి లేని జీవితాన్ని అనుభవించండి.

టాపిక్