తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Issues With Loneliness: ఒంటరితనంతో 5 తీవ్ర అనారోగ్యాలు

Health issues with loneliness: ఒంటరితనంతో 5 తీవ్ర అనారోగ్యాలు

HT Telugu Desk HT Telugu

21 March 2023, 17:38 IST

  • Health issues with loneliness: ఒంటరితనం కారణంగా 5 తీవ్రమైన అనారోగ్యాల ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒంటరి తనం వల్ల పలు వ్యాధుల ముప్పు ఉందని నిపుణుల హెచ్చరిక
ఒంటరి తనం వల్ల పలు వ్యాధుల ముప్పు ఉందని నిపుణుల హెచ్చరిక (Unsplash)

ఒంటరి తనం వల్ల పలు వ్యాధుల ముప్పు ఉందని నిపుణుల హెచ్చరిక

సామాజికంగా విడిగా ఉండడం లేదా ఒంటరితనం పలు వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం పరస్పర అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం ఒంటరి తనం అకాల మరణానికి దారితీస్తుంది. ఒంటరి తనం వల్ల స్మోకింగ్ బారిన పడడం, ఒబెసిటీ, శారీరకంగా చురుకుదనం లేకపోవడం వంటి ముప్పు ఉందని తేలింది. అంటే మీరు ఒంటరిగా ఉంటే గుండె జబ్బులు, డిప్రెషన్, యాంగ్జైటీ, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు తేల్చాయి.

వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒంటరి తనం రావడం సహజం. కానీ నేటి తరం యువత కూడా సామాజిక బంధాలు లేకపోవడం, ఇంట్రోవర్ట్ కావడం వల్ల సామాజికంగా విడిగా ఉంటూ ఒంటరి తనం అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని వ్యాధుల కారణంగానూ యువత సామాజికంగా విడిగా ఉంటూ ఒంటరితనానికి లోనవుతోంది. చాలా మంది ఫ్రెండ్స్ ఉండడాన్ని ఇష్టపడని వారు సైతం ఒంటరితనాన్ని అధిగమించడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. అర్థవంతమైన పనుల్లో నిమగ్నం కావడం, లేదా హాబీ అలవరుచుకోవడం, ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. స్వచ్ఛంద సేవ చేయడం, ఏదైనా క్లబ్‌ గానీ, గ్రూప్‌లో గానీ చేరడం ద్వారా సామాజిక బంధాలను పెంచుకోవచ్చు. లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండడం ద్వారా ఒంటరి తనం దూరం చేసుకోవచ్చు. తమపై తాము దృష్టిపెట్టడం, అవసరమైతే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం వల్ల కూడా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

‘అనేక వ్యాధులకు ఈ ఒంటరి తనం కారణం కావొచ్చు. లేదా పలు వ్యాధులకు ఇది ఒక లక్షణం కావొచ్చు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకే నాణేనికి రెండు ముఖాలు. చాలా మంది మానసిక సమస్యలతో వైద్య నిపుణులను సంప్రదిస్తుంటారు. ఒంటరి తనం నాలుగు కారణాల వల్ల కలుగుతుంది. సామాజిక, భావోద్వేగ, సందర్భ సంబంధిత, దీర్ఘకాలిక అంశాలు ఇందుకు కారణమవుతాయి..’ అని సైకాలజిస్ట్ డాక్టర్ రుచా శ్రీఖండే తెలిపారు.

ఆర్థిక సమస్యలు, ప్రియమైన వారు దూరమవడం, దగ్గరి వాళ్లు చనిపోవడం, వైఫల్యాలు, ఎందుకూ పనిరానన్న ఫీలింగ్, పెరిగే సమయంలో ఒంటరి జీవితం వంటి అనేక అంశాలు ఈ ఒంటరి తనానికి సాధారణ కారణాలు అని డాక్టర్ శ్రీఖండే వివరించారు.

ఒంటరి తనం వల్ల వచ్చే 5 ఆరోగ్య సమస్యలు ఇవే..

1. డిస్టిమియా లేదా డిప్రెషన్

ఒంటరితనం వల్ల వచ్చే ప్రధాన రుగ్మతలలో ఇది ఒకటి. దీనితో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు. అయితే ఇది శారీరక వ్యాధి కాదు. డిస్టిమియా అనేది దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య స్థితి. క్రమంగా వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.

2. సామాజిక ఒంటరితనం లేదా ఆందోళన రుగ్మత

సామాజిక ఆందోళన రుగ్మత ఉన్న వ్యక్తులు ఇతరులతో సంభాషించడంలో ఇబ్బంది పడవచ్చు. అహేతుకమైన ఆందోళన, భయం ఈ ఇబ్బందికి కారణం కావచ్చు. అటువంటి సందర్భంలో వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా ఉండిపోతారు.

3. దీర్ఘకాలిక వ్యాధులు

అధిక రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం సంబంధిత శారీరక సమస్యలు సాధారణంగా సామాజికంగా ఒంటరిగా ఉండే వ్యక్తులలో కనిపిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు కూడా పెరుగుతుందని పరిశోధనలు గుర్తించాయి.

4. క్యాన్సర్

ఒంటరితనం యొక్క భావాలు ఒత్తిడి కారణంగా హార్మోన్ల మార్పుల విడుదలను ప్రేరేపిస్తాయని జీవశాస్త్రజ్ఞులు చూపించారు. దీనివల్ల తక్కువ రోగ నిరోధకత ఉంటుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

5. డయాబెటిస్

టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం అధిక బరువు ఉన్నవారికి లేదా కదలిక లేని జీవనశైలి ఉన్న వారికి ఉంటుంది. ఒత్తిడి, ఒంటరితనం డయాబెటిస్ ముప్పును మరింత తీవ్రతరం చేస్తాయి.

టాపిక్