తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Polls 2024 : బీజేపీ దూకుడు, 'ఆపరేషన్ ఆకర్ష్' బాటలో కాంగ్రెస్ - ఆసక్తికరంగా 'గ్రేటర్' రాజకీయం

Lok Sabha Polls 2024 : బీజేపీ దూకుడు, 'ఆపరేషన్ ఆకర్ష్' బాటలో కాంగ్రెస్ - ఆసక్తికరంగా 'గ్రేటర్' రాజకీయం

HT Telugu Desk HT Telugu

10 April 2024, 13:02 IST

    • Greater Hyderabad Politics : లోక్ సభ ఎన్నికల వేళ గ్రేటర్ లో పాగా వేయాలని చూస్తున్నాయి ప్రధాన పార్టీలు. మోదీ మేనియాతో మెజార్టీ స్థానాల్లో గెలవాలని బీజేపీ చూస్తుంటే… సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. 
.గ్రేటర్ హైదరాబాద్ లో రసవత్తరంగా మారిన ఎన్నికల సమరం
.గ్రేటర్ హైదరాబాద్ లో రసవత్తరంగా మారిన ఎన్నికల సమరం

.గ్రేటర్ హైదరాబాద్ లో రసవత్తరంగా మారిన ఎన్నికల సమరం

Greater Hyderabad Politics : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Greater Hyderabad) నగరంలో ఎంఐఎం పార్టీ సంగతి పక్కన పెడితే మిగతా మూడు పార్టీల్లో మూడు విభిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఉత్సాహంలో ఉన్న బీజేపీ శ్రేణులు గ్రేటర్ ప్రచార పర్వంలోనూ దూసుకెళ్తు మిగతా వారి కంటే ముందంజలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల,సికింద్రబాద్,హైదరాబాద్ మరియు మల్కాజిగిరి లోక్ సభ స్థానాలకు అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు.ప్రజలకు అందరి కంటే ముందే దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న ప్రధాని మోడీ ప్రభను ప్రజలకు వివరిస్తూ దేశం కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెబుతున్నారు.ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి అమిత్ షా(Amith Sha) లు ఇప్పటికే ఓ రౌండ్ రాష్ట్రంలో పర్యటించగా......ఈనెల 13 తరువాత మరో దఫా పర్యటించనున్నారు. రాష్ట్రంలో డజన్ సీట్లు గెలుపు లక్ష్యంలో భాగంగా.....గ్రేటర్ పరిధిలోని ఆ నాలుగు సెగ్మెంట్లలో కనీసం మూడు స్థానాల్లో కాషాయ జెండా ఎగరు వేయాలని యోచిస్తోంది.

ముందంజలో బీజేపీ......

నియోజకవర్గాల వారీగా బీజేపీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకసారి నోటిఫికేషన్ వెలువడ్డకా.....బీజేపీ దుకూడు మరింత పెంచనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూటకపు గ్యారంటీ లంటూ అధికార కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక బిఆర్ఎస్ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) లను సైతం బీజేపీ అస్త్రంగా మలచుకొని గులాబీ నేతలు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.పాదయాత్రల తో ఇంటింటి ప్రచారం ఇప్పటికే ప్రారంభించింది.సాధారణ ప్రచారం కంటే సోషల్ మీడియా పవర్ ఎక్కువైనందున ప్రతి రోజూ తప్పనిసరిగా కొన్ని పోస్టులు ఉండేలా బీజేపీ సోషల్ మీడియా విభాగం చర్యలు తీసుకుంటుంది.

హైదరాబాద్ పార్లమెంట్ లో వరుసగా నెగ్గుతూ వస్తున్న మజ్లిస్ పై పోటీకి హిందూ ధర్మ సంరక్షణ,సంఘ నేపథ్యం కంపెల్లి మాధవి లత ను బీజేపీ నిలబెట్టింది. ఇటీవలే " అప్ కి అదాలత్ " ఇంటర్వ్యూ లో ఆమె ఇచ్చిన సమాధానాలు అసాధారణమైనవని,తర్కంతో మాట్లాడడమే కాక దృఢమైన అంశాలు ప్రస్తావించారని స్వాయన మోదీ (Modi)ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి నగర ప్రజల్లో పెరిగింది.వివిధ అంశాల్లో బీజేపీ మిగతా పార్టీల కంటే కాస్త ముందజలో ఉందని చెప్పాలి.

తగ్గిన కారు జోరు.......

పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం,పార్టీ దళపతి కేసిఆర్ కాలు విరగడం,ఎమ్మెల్సీ కవిత అరెస్ట్(Kavitha Arrest) అవడం మరియు సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్,నేతల జంపింగ్ తదితర అంశాలు పార్టీని పార్టీ శ్రేణులను,కార్యకర్తలను కోలుకోకుండా చేస్తున్నాయి. ఇవన్ని కుట్రలు అని,రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని కేటీఆర్ తిప్పి కొడుతున్న.....పార్టీ శ్రేణుల్లో మాత్రం నైరాశ్యం తగ్గడం లేదు.పార్టీ అభ్యర్థులను ఎంతో ముందస్తుగా ప్రకటించిన చరిత్ర ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం అభ్యర్థుల కరువుతో ఉంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నేతలు పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.పిలిచి టికెట్ ఇస్తామన్న నేతలు నిరకరిస్తున్నారట...! డబ్బు,ప్రచారం అంతా పార్టీనే చూసుకుంటుందని చెబుతున్నా నేతలు నో అంటే నో అంటున్నారట...! సికింద్రాబాద్ నుంచి పోటీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ససేమిరా అనడంతో పద్మారావు ను బరిలో దింపారు గులాబీ బాస్.ఇక చేవెళ్ల సిట్టింగ్ బిఆర్ఎస్ ఎంపిగా ఉన్న రంజిత్ రెడ్డి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి హస్తం గూటికి చేరుకున్నారు.దాంతో అక్కడ టీడీపీ వలస నేత కసాని జ్ఞానేశ్వర్ ను బరిలో దింపారు.ఇక మల్కాజిరి నుంచి మొదట మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్ర రెడ్డి పోటీలో ఉంటారని ప్రచారం జరిగినా.....ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.దీంతో రాగిడి లక్షమా రెడ్డి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు.వీటితో పాటు రాష్ట్రంలో ఆనేక స్థానాల్లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

‘ఆపరేషన్ ఆకర్ష్’ పై కాంగ్రెస్ ఫోకస్......

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే...గ్రేటర్ హైదరాబాద్(GHMC) లో ఏ మాత్రం పట్టులేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల తరువాత గ్రేటర్ పాలిటిక్స్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది.ఇప్పటికే మేయర్,మాజీ మేయర్,మాజీ మేయర్,మాజీ డిప్యూటీ మేయర్,సిట్టింగ్ ఎంపీ,సిట్టింగ్ ఎమ్మెల్యే సహా పలువురు కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నాలుగు స్థానాల్లో కనీసం మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఏమాత్రం పట్టు లేని హైదరాబాద్ పై కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫోకస్ పెట్టారు. ఇక రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినా మల్కాజిగిరి స్థానాన్ని మరోసారి భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలని భావుస్తున్నరు.ఇక సికింద్రబాద్ నుంచి ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్(Danam Nagender) టికెట్ దక్కించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం