Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఏంటి..? అనుమతి ఉంటుందా, చట్టాలు ఏం చెబుతున్నాయి..?-what is phone tapping who has the right to do the tapping know the complete details in this article ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఏంటి..? అనుమతి ఉంటుందా, చట్టాలు ఏం చెబుతున్నాయి..?

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఏంటి..? అనుమతి ఉంటుందా, చట్టాలు ఏం చెబుతున్నాయి..?

Phone Tapping Cases : గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం(Phone Tapping) దుమారం రేగుతోంది. పోలీస్ శాఖలో పని చేస్తున్న పలువురు అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు. అసలు ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చా..? చేస్తే ఎవరివి చేస్తారు..? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? వంటి అంశాలను ఇక్కడ చూద్దాం...

ఫోన్ ట్యాపింగ్

Phone Tapping Contraversory in Telangana : ఫోన్ ట్యాపింగ్... కొద్దిరోజులుగా తెలంగాణలో తెగ చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం... ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన సిట్.... కూపీ లాగే పనిలో పడింది. ఇందులో భాగంగా... పలువురు కీలక అధికారులను అరెస్ట్ చేసింది. వారిని కస్టడీకి తీసుకొని కీలక విషయాలను రాబట్టే పనిలో పడింది. విధ్వంసమైన ఆధారాలను కూడా రికవరీ చేసి... అసలేం జరిగిందన్న విషయాలను బయటపెట్టాలని చూస్తోంది. దీంతో ఈ కేసు వ్యవహారం జాతీయ స్థాయిలోనూ అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కేవలం ప్రతిపక్ష పార్టీల నేతలే కాకుండా... పలువురు ప్రముఖుల సమాచారాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) తో సేకరించారనే వార్తలు వస్తున్నాయి.

Whats is Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ అంటే..?

ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) అంటే సదరు వ్యక్తి అనుమతి లేకుండా మరొకరి సంభాషణ వినడం లేదా చదివటం వంటివి చేస్తే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. దీనినే వైర్ ట్యాపింగ్ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు.. మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేస్తే లేదా చదివినట్లయితే ట్యాపింగ్ చేయటం అని అర్థం చేసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం. ఇది అన్ని సందర్భాల్లో కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు ఉండాల్సిందే…! ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ట్యాపింగ్ చేసేందుకు వీలు ఉంటుంది. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్... ఈ అవకాశాన్ని కల్పిస్తారు. దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వ‌హ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, లేదా కేంద్ర ప్ర‌భుత్వం…. కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయవచ్చు. ఈ స‌మాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూట‌ర్‌లో కూడా స్టోర్ చేస్తారు.

ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు..?

రాష్ట్రాల పరిధిలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇక కేంద్రం పరిధిలో చూస్తే... ఇంటెలిజెన్స్ బ్యూరో(IB), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), రీసెర్చ్ అండ్ అనాల‌సిస్ వింగ్ (ఆర్ఏడ‌బ్ల్యూ), డైరెక్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ ఉన్నాయి.

చట్టాలు ఏం చెబుతున్నాయి…?

ఫోన్ ట్యాపింగ్ గురించి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ - 1885(Indian Telegraph Act, 1885) చెబుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ - 5(2) ప్రకారం... దేశ సార్వ‌భౌమ‌త్వం, స‌మ‌గ్ర‌త, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాల్లో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర హోంశాఖ పాత్ర కీలకంగా ఉంటుంది.  ఐటీ చట్టంలోని-2000లోని సెక్ష‌న్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. ఇక కాల్స్‌ను రికార్డు చేయ‌డానికి లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ విష‌యంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యంలో రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 26 (బి) ప్ర‌కారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు. ఇలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించటం కిందకు వస్తుంది. 

తెలంగాణలో వెలుగచూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులోని అన్ని విషయాలను బయటపెట్టాలని కోరుతున్నాయి. అయితే గత పదేళ్ల నుంచి మాత్రమే కాకుండా… 2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యహారాలని బయపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కేవలం అరెస్టులపై మాత్రం పలు ప్రకటనలు విడుదల కాగా… ఏం జరిగిందనే దానిపై అధికారికంగా ప్రకటనలు రాలేదు.