KTR On Revanth Reddy : 70 ఏళ్ల కేసీఆర్ ఎండలో తిరుగుతుంటే, రేవంత్ రెడ్డి క్రికెట్ చూస్తుండు- కేటీఆర్
KTR On Revanth Reddy : కాంగ్రెస్ ఎన్నికల హామీలైన రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 పంట బోసస్ తక్షణమే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి నిలదీస్తామన్నారు.
KTR On Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ(farmers loan Waiver) చేసి, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. రైతు దీక్ష ఆరంభం మాత్రమేనని బీఆర్ఎస్ (BRS)జెండాలతో రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి బోనస్ పై నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ధర్నాలు(Protest) రాస్తారోకోలు ఉంటాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. సిరిసిల్లలో జరిగిన రైతు దీక్ష(BRS Rythu Deeksha)లో కేటీఆర్ పాల్గొనగా కరీంనగర్ లో కలెక్టరేట్ వద్ద పోలీసులు అనుమతి నిరాకరించడంతో మాజీమంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద రైతు నిరసన దీక్ష చేశారు. హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పెద్దపల్లిలో జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రైతు దీక్ష చేశారు.
కాలం తెచ్చిన కరువుకాదు... కాంగ్రెస్ తెచ్చిన కరువు
సిరిసిల్లలో రైతు నిరసన దీక్షలో ఎండిపోయిన వరి కంకులు ప్రదర్శిస్తూ పాల్గొన్న కేటీఆర్(KTR), కాలం తెచ్చిన కరువుకాదు... కాంగ్రెస్ తెచ్చిన కరువేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ను బద్నాం చేయాలని, బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకే కాళేశ్వరం(Kaleshwaram) ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపివేశారని ఆరోపించారు. నీళ్లు.. పైసలు ఇచ్చే ముఖంలేని సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ చూస్తుండని విమర్శించారు. 70 ఏళ్ల వయస్సులో కేసీఆర్ ఎండలో తిరుగుతూ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ జెండా పట్టుకుని కొనుగోలు కేంద్రాలకు వెళ్లి, ఎంత ధాన్యం కొన్నారో దానికి క్వింటిల్ కు 500 రూపాయల బోనస్ గురించి నిలదీస్తామన్నారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్న రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అన్నట్లుందని, ఆయనేం మొగోడని ప్రశ్నించారు. నేతన్నల కోసం దీక్షలు చేపడుతాం... ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్(Congress) వందరోజుల పాలన ఏవిధంగా ఉందో తెలుస్తది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఓటు ద్వారానే తెలిసేటట్లు చేయాలన్నారు కేటీఆర్.
ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలి- గంగుల
సాగునీరు సకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఇవ్వకపోవడంతోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కాంగ్రెస్ వందరోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రావలసిన పెట్టుబడి రూ.రెండు లక్షల రుణమాఫీని తక్షణమే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వం మెడలు వంచి రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లలో కేటీఆర్ రైతు దీక్ష చేస్తున్న సమయంలో రాజీవ్ నగర్ కు చెందిన నేత కార్మికుడు సిరిపురం లక్ష్మీనారాయణ(60) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీక్ష విరమించిన అనంతరం కేటీఆర్, లక్ష్మినారాయణ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీసి ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని సర్కార్ పై పోరాడి సమస్యలు పరిష్కరించుకుందామని నేత కార్మిక కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న లక్ష్మినారాయణ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం కేటీఆర్(KTR) అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అనురాగ్ జయంత్ తో ఫోన్లో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని, నేతన్న బీమా త్వరగా అందేలా చూడాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నేత కార్మికులకు ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించి, కొత్త ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయ పోరాటం చేయక తప్పదన్నారు.
HT Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం