MP Ranjith Reddy Quits BRS Party: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు…. పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇటీవలే పలువురు ఎంపీలు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరగా…. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి(MP Ranjith Reddy) కూడా పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను విడుదల చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన రంజిత్ రెడ్డి(Chevella MP G Ranjith Reddy)…. కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు హస్తం పార్టీల పెద్దల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆయన చేవెళ్ల నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు ఆయనకు టికెట్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది.
2014లో బీఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల వేళ ఆయన పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున రంజిత్ రెడ్డి బలిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై 14,317 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి కూడా రంజిత్ రెడ్డినే అభ్యర్థిగా దించాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. టికెట్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ తరపున బరిలో ఉండేందుకు రంజిత్ రెడ్డి ఆసక్తిని కనబర్చలేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడారు. మొదట్లో బీజేపీలోకి వెళ్తారనే వార్తలు వచ్చినప్పటికీ… చేరలేదు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారని సమాచారం.
ఇదిలా ఉంటే నిన్న వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పసునూరి దయాకర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 23 ఏళ్ల పాటు కార్యకర్తగా పని చేశానని, ఉద్యమంలో తన వంతుగా పాత్ర పోషించానన్నారు. కానీ రానురాను ఉద్యమంలో మార్పు జరిగిందని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు.
ఇటీవలే బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, పోతుగంటి రాములు కూడా పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో చేరారు. ఇక పెద్దపల్లి నుంచి గెలిచిన వెంకటేశ్ నేత… కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
ఇక వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు.