BRS to Congress : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ పసునూరి - బీఆర్​ఎస్​ ను భ్రష్టు పట్టించింది ఆ ఇద్దరే అంటూ కామెంట్స్​-brs warangal mp pasunoori dayakar joined the congress ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Brs Warangal Mp Pasunoori Dayakar Joined The Congress

BRS to Congress : కాంగ్రెస్ లో చేరిన ఎంపీ పసునూరి - బీఆర్​ఎస్​ ను భ్రష్టు పట్టించింది ఆ ఇద్దరే అంటూ కామెంట్స్​

HT Telugu Desk HT Telugu
Mar 17, 2024 06:33 AM IST

BRS Warangal MP Pasunoori Dayakar: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్… కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ఎర్రబెల్లి దయాకర్, కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ లో చేరిన పసునూరి
కాంగ్రెస్ లో చేరిన పసునూరి

Warangal MP Pasunoori Dayakar : వరంగల్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్​ఎస్​ పార్టీ భ్రష్టు పట్టించారని ఎంపీ పసునూరి దయాకర్(MP Pasunoori Dayakar)​ అన్నారు. వరంగల్ బీఆర్​ఎస్​ ఎంపీ టికెట్ ఆశించిన ఆయన, టికెట్​ దక్కకపోవడంతో పార్టీ తీరుపై అసంతృప్తి చెందారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్​ రెడ్డిని క​లిశారు. శనివారం టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​, మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. కాంగ్రెస్​ పార్టీలో చేరిన అనంతరం పసునూరి దయాకర్​ మీడియాతో మాట్లాడారు. టీఆర్​ఎస్​ పార్టీ ఏర్పడినప్పటి నుంచి దాదాపు 23 ఏళ్ల పాటు కార్యకర్తగా పని చేశానని, ఉద్యమంలో తన వంతుగా పాత్ర పోషించానన్నారు. కానీ రానురాను ఉద్యమంలో మార్పు జరిగిందని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర్​ రావు, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్​ఎస్​ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

కావ్యకు ఉద్యమంతో సంబంధం ఉందా..?

బీఆర్​ఎస్​ లో ఎంతోకాలంగా పని చేసిన తనకు కాకుండా, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కడియం శ్రీహరి కూతురు డాక్టర్​ కడియం కావ్యకు కేసీఆర్​ ఎంపీ టికెట్​ కేటాయించారని పసునూరి దయాకర్​ అసహనం వ్యక్తం చేశారు. ఒక ఎంపీగా తనకు ఎప్పుడూ ప్రొటోకాల్ కూడా ఇవ్వలేదని, అందరు ఎంపీలకు ప్రొటోకాల్​ ఇచ్చి తనను మాత్రం అవమానించారని దయాకర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నియోజకవర్గాల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఇబ్బందులు ఎదురయ్యేవని, వరంగల్​ లో ఏ కార్యక్రమాలకు పోవాలన్నా అనుమతి తీసుకోవాలా అని ప్రవ్నించారు. తనకు సమాచారం లేకుండానే పార్టీ మీటింగులు నిర్వహించేవారని, తనకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా ఎంతో ప్రజల ఆదరణ ఉన్న తనపై బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు వివక్ష చూపించారని దయాకర్​ చెప్పుకొచ్చారు.

ప్రజలు కాంగ్రెస్​ నే నమ్ముతున్నారు

కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని ఎంపీ పసునూరి దయాకర్​ అన్నారు. కాంగ్రెస్​ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితుడినయ్యానని, అందుకే కాంగ్రెస్​ లో చేరానని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ పార్టీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth REddy) తనకు 30 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. రేవంత్​ రెడ్డి సీఎం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్​ పార్టీపై నమ్మకం పెరిగిందని, హస్తం పార్టీలో స్వేచ్ఛ కలిగిన కార్యకర్తగా పని చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్​ ఛార్జ్​ దీపాదాస్​ మున్షీని పసునూరి దయాకర్​, ఆయన అనుచరులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. వారి వెంట ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నేతలు ఉన్నారు.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel