Aroori Ramesh : 15 రోజుల ఉత్కంఠకు తెర - బీఆర్ఎస్ పార్టీకి అరూరి రమేశ్ రాజీనామా, బీజేపీలో చేరే ఛాన్స్!
Ex MLA Aroori Ramesh Resigned: బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ రాజీనామా చేశారు. ఇవాళ ఆయన.. బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉంది.
Ex MLA Aroori Ramesh Resigned: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి(BRS) రాజీనామా చేశాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్ రిలీజ్ చేశారు. గత పది హేను రోజులుగా ఆయన పార్టీ మారుతున్న విషయం తీవ్ర చర్చనీయాంశం కాగా.. బీఆర్ఎస్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన మాత్రం ఓ వైపు బీఆర్ఎస్ నేతలతో కాంప్రమైజ్ అవుతూనే మరోవైపు తన ప్రయత్నాలు తాను చేశారు. కాగా శనివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అరూరి ఆదివారం అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.
15 రోజుల ఉత్కంఠకు తెర!
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్(Ex MLA Aroori Ramesh).. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. వాస్తవానికి 2014, 2018 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందిన ఆయన ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఆరాట పడ్డారు. కానీ వ్యక్తిగతంగా ఆయన క్యాడర్ పై ఉన్న వ్యతిరేకతతో పాటు పార్టీపై పెరిగిన నెగటివిటి వల్ల ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో హ్యాట్రిక్ కొడుదామని అనుకున్న అరూరి రమేశ్ కు నిరాశ ఎదురైంది. మొత్తంగా 19,458 ఓట్ల తేడాతో అరూరి రమేశ్ కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత అరూరి రమేశ్ ఎంపీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో పాటు కిందిస్థాయి నేతలపై పెరిగిన వ్యతిరేకత వల్ల ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతోనే ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు అడుగులు వేశారు. బీఆర్ఎస్ టికెట్ ఇస్తానని పార్టీ అధిష్ఠానం మాటిచ్చినా.. దానిని వదులుకుని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో తెలంగాణకు వచ్చిన ప్రధాన మంత్రి మోదీ సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. కానీ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో పార్టీ మారే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత నాలుగైదు రోజుల కిందట కూడా మళ్లీ కమలం పార్టీలో చేరేందుకు రెడీ కాగా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అరూరి రమేశ్ ను హైజాక్ చేసి, హైదరాబాద్ తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి అరూరి రమేశ్ పయనమెటు అనే విషయంపై తీవ్ర చర్చ జరిగింది. చివరకు శనివారం సాయంత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు. పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు కు ధన్యవాదాలు తెలుపుతూ తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాల్లూ తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆయన పార్టీ మారడం పక్కాననే విషయం స్పష్టం కాగా.. దాదాపు 15 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడినట్లయ్యింది.
నేడు కాషాయ కండువా కప్పుకోనున్న అరూరి
బీజేపీ ఎంపీ టికెట్ హామీ మేరకు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే రెండు సార్లు ఆయన బీజేపీలో చేరే కార్యక్రమం బీఆర్ఎస్ నేతల బుజ్జగింపుల వల్ల వాయిదా పడగా.. ఆదివారం ఆయన కాషాయా కండువా కప్పుకోనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగానైనా అరూరి రమేశ్ కమలం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన క్యాడర్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.
ఎంపీగా బరిలో ఆయనే..
కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్య రామ మందిరం నేపథ్యంలో బీజేపీకి క్షేత్రస్థాయిలో మంచి ఫాలోయింగ్ పెరిగింది. అదే విశ్వాసంతో అన్ని రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలు కొల్లగొట్టేందుకు కాషాయ పార్టీ రెడీ అయ్యింది. తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఎంపీ బరిలో నిలిచేందుకు అరూరి రమేశ్ ఆసక్తి చూపారు. ఆయన కొడుకు అరూరి విశాల్ కూడా బీజేపీలో చేరాలనే పట్టుబట్టడంతో అరూరి రమేశ్ బీజేపీ కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ కు మహబూబాబాద్ ఎంపీ టికెట్ కన్ఫామ్ చేసిన బీజేపీ అధిష్టానం, వరంగల్ ఎంపీ టికెట్ ను అరూరికే కట్టబెడుతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ మొన్నటికిమొన్న రెండు సార్లు పార్టీ మారే విషయంలో అరూరి రమేశ్ డబుల్ గేమ్ ఆడటంతో, పార్టీలో చేరినా ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరించినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ అరూరి రమేశ్ తనవంతుగా ప్రయత్నాలు చేసి, ఎంపీ టికెట్ హామీ మేరకే పార్టీలో మారుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులందరినీ ఫైనల్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మరి టికెట్ సాధించడంతో పాటు ఉద్యమాల ఖిల్లాగా పేరున్న వరంగల్ పార్లమెంట్ స్థానంలో అరూరి రమేశ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.