తెలుగు న్యూస్  /  Business  /  India Equity Benchmarks Nifty Sensex Hit Record Highs What Next

Nifty, Sensex Record Highs: కొత్త గరిష్టాలకు నిఫ్టీ, సెన్సెక్స్.. నెక్స్ట్ ఏంటి?

28 November 2022, 16:56 IST

    • Stock Markets: భారత ఈక్విటీ సూచీలు జోరు మీదున్నాయి. కొత్త గరిష్టాలను తాకాయి. నిఫ్టీ, సెన్సెక్స్ సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నా.. భారత మార్కెట్లు బలపడ్డాయి. ఇందుకు కారణం ఏంటి.. తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది?
Nifty, Sensex Record Highs: కొత్త గరిష్టాలకు నిఫ్టీ, సెన్సెక్స్.. నెక్ట్స్ ఏంటి?
Nifty, Sensex Record Highs: కొత్త గరిష్టాలకు నిఫ్టీ, సెన్సెక్స్.. నెక్ట్స్ ఏంటి?

Nifty, Sensex Record Highs: కొత్త గరిష్టాలకు నిఫ్టీ, సెన్సెక్స్.. నెక్ట్స్ ఏంటి?

Stock Markets: భారత స్టాక్ మార్కెట్‍ సూచీలు కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ (Nifty), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ (Sensex) రికార్డు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. వరుసగా ఐదో సెషన్‍లో లాభాలను చూశాయి. సోమవారం (నవంబర్ 28) నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 18,562.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 211.16 పాయింట్లు బలపడి 62,504.80 పాయింట్ల వద్ద స్థిరపడి కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడేలో ఓ దశలో నేడు నిఫ్టీ 18,614.25 పాయింట్లను, సెన్సెక్స్ 62,701.40 పాయింట్ల మార్కును తాకింది. ఆ తర్వాత కాస్త తగ్గినా.. రికార్డు గరిష్టాలతోనే ముగిశాయి. అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3.38శాతం పెరగడం కూడా సోమవారం అనుకూలమైన సెంటిమెంట్‍ను చూపించింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్‍లలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. భారత మార్కెట్లు జోష్‍ కనబరుస్తున్నాయి. అయితే.. నిఫ్టీ, సెన్సెక్స్ ఇక ముందు సెషన్లలో ఎలా ఉండే అవకాశం ఉంది.. ఏ అంశాలు ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటే..

ఆసియా మార్కెట్లు పడినా..

Stock Market News: చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు పోరాడుతున్నారు. నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో చైనాతో పాటు ఇతర ఆసియా మార్కెట్లు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అయితే భారత మార్కెట్లు మాత్రం జోరు మీదున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటం భారత్‍కు కలిసి వస్తోంది. అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఉంటున్నందున.. దాని ధరలు తగ్గడం ఇండియాకు సానుకూలంగా మారింది.

ఈ రెండు అంశాలను పరిశీలించాలి

Stock Markets: ఈ వారంలో అమెరికా జాబ్ డేటా (US Job Data) విడుదల కానుంది. షార్ట్ టర్మ్ కోసం ట్రేడర్లు ఈ విషయాన్ని గమనించాలి. వడ్డీ రేట్లపై ఫెడ్ ఎలా ముందుకు వెళుతుందన్న విషయం ఈ డేటాపై ఆధారపడి ఉంటుంది. అలాగే యూఎస్ ఫెడ్ (US Fed) బాస్ జెరోమ్ పోవెల్.. ఈ వారాంతంలో ఓ ఈవెంట్‍లో మాట్లాడనున్నారు. వడ్డీ రేట్ల సరళిపై ఆయన కామెంట్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వడ్డీ రేట్ల పెంపు ఎక్కువగా ఉండదనే సంకేతాలు వస్తే.. మార్కెట్లు మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచేలా ఉంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది.

“ప్రస్తుతం మార్కెట్ల ర్యాలీకి రెండు పాజిటివ్స్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పడిపోతున్నాయి. బ్రెండ్ క్రూడ్ ధర 82డాలర్ల కంటే తక్కువకు చేరింది. భారత మార్కెట్‍లో ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ (FPI) కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న ఫైన్షియల్స్, ఐటీ ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లను ఎఫ్‍పీఐలు అధికంగా కొంటున్నాయి. అయితే, ఈ సానుకూలతలు ఉన్నా ఫెడ్ చీఫ్ బుధవారం చేసే ప్రసంగం గురించే మార్కెట్లు ఎక్కువగా వేచిచూస్తున్నాయి. వడ్డీరేట్లపై పావెల్ కఠినంగా ప్రకటన చేస్తే.. మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తాయి. ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు 5శాతం వద్ద ఆగుతాయని మార్కెట్లు భావిస్తున్నాయి. అయితే, అధిక ఫ్యూచర్ ప్రీమియమ్స్.. మార్కెట్ బులిష్‍నెస్‍ను సూచిస్తున్నాయి” అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్టాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు భారత జీడీపీ డేటా కూడా బుధవారం వెల్లడి కానుంది. వార్షిక వృద్ధి రేటు 6.2 శాతంగానే ఉంటుందని రాయిటర్స్ పోల్ సూచిస్తోంది.

మరోవైపు విదేశీ మదుపరులను భారత మార్కెట్ ఆకర్షిస్తోందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారత ఈక్విటీ సూచీల్లో సానూకూలత కొనసాగుతుందని అంచనాలు వేస్తున్నారు.

టాపిక్