తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst Revenues Rise: ఏపీ కంటే తెలంగాణలో రూ. 1100 కోట్లు ఎక్కువగా జీఎస్టీ వసూలు

GST revenues rise: ఏపీ కంటే తెలంగాణలో రూ. 1100 కోట్లు ఎక్కువగా జీఎస్టీ వసూలు

HT Telugu Desk HT Telugu

01 December 2022, 16:36 IST

    • GST revenues rise: ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ అదనంగా రూ. 1100 కోట్ల మేర వసూలైంది.
నవంబరులో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి
నవంబరులో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి (MINT_PRINT)

నవంబరులో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి

న్యూఢిల్లీ: 2022 నవంబర్‌లో జీఎస్టీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.1.46 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి వసూళ్లు రూ. 1.40 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉండటం ఇది వరుసగా తొమ్మిదో నెల అని తెలిపింది.

నవంబర్ 2022 నెలలో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,45,867 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 25,681 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 32,651 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 77,103 కోట్లు (దిగుమతులపై రూ. 38,635 కోట్లతో కలిపి), సెస్ రూ. 10,433 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ. 817 కోట్లతో కలిపి)గా ఉన్నాయి.

‘నవంబర్ 2022లో జీఎస్టీ ఆదాయం గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ ఆదాయం కంటే 11 శాతం ఎక్కువ..’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

నవంబరు నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 20 శాతం ఎక్కువగా ఉంది. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 8 శాతం ఎక్కువగా ఉన్నాయి.

ఏప్రిల్‌లో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు రూ. 1.68 లక్షల కోట్లకు చేరుకుంది. అక్టోబర్‌లో అత్యధికంగా రూ. 1.52 లక్షల కోట్లు వసూలు చేసి రెండో అతిపెద్ద వసూలుగా నిలిచింది.

కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో నవంబరు నెలలో జీఎస్టీ 14 శాతం పెరగగా, హైదరాబాద్‌లో కేవలం 8 శాతం పెరుగుదల నమోదైంది. ఏపీలో గత ఏడాది నవంబరులో రూ. 2,750 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది నవంబరులో రూ. 3,134 కోట్లు వసూలైంది.

ఇక తెలంగాణలో గత ఏడాది నవంబరులో రూ. 3,931 కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది నవంబరులో కేవలం 8 శాతం వృద్ధితో రూ. 4,228 కోట్లుగా నమోదైంది. అయినప్పటికీ తెలంగాణ జీఎస్టీ వసూళ్లు ఏపీతో పోలిస్తే సుమారు రూ. 1100 కోట్లు ఎక్కువగా ఉన్నాయి.

జీఎస్టీ అధికంగా లభించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర (రూ. 21,611 కోట్లు), కర్ణాటక (రూ. 10,238 కోట్లు), గుజరాత్ (రూ. 9,331 కోట్లు), తమిళనాడు (రూ. 8,551 కోట్లు), యూపీ రూ. 7,254 కోట్లు, హర్యానా (రూ. 6,769 కోట్లు) ఉన్నాయి.