తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?

Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టుపై.. రాజకీయ పార్టీలు ఎందుకు భిన్నంగా స్పందించాయి?

14 December 2024, 6:06 IST

google News
    • Allu Arjun Arrest Politics : అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బన్నీ అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, నేతలు స్పందించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి స్పందన రాలేదు. అల్లు అర్జున్‌కు రాజకీయాలకు సంబంధం ఏంటీ?
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్

అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అరెస్టు చేయడానికి కారణాలు ఏమున్నా.. జాతీయ మీడియా నుంచి లోకల్ ఛానెల్స్ వరకూ అన్నింటి ఫోకస్ ఈ ఇష్యూ పైనే పెట్టాయి. అటు రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఈ అరెస్టుపై స్పందించారు. అయితే.. పార్టీలు, నేతలు భిన్నంగా స్పందించడం గమనార్హం.

వ్యతిరేకించిన బీఆర్ఎస్..

అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఆ తర్వాత బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు స్పందించి.. అరెస్టును తప్పుబట్టారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీరు బన్నీకి మద్దతు ఇచ్చారనే టాక్ నడుస్తోంది.

సమర్థించిన కాంగ్రెస్..

ఇదే సమయంలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వరకూ ఈ అరెస్టుపై స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అరెస్టును సమర్థించారు. అయితే.. అదే పార్టీలోని కొందరు నేతలు మాత్రం అరెస్టును తప్పుబట్టినట్టు వార్తలు వచ్చాయి.

ఏపీలో హాట్ టాపిక్‌గా..

తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఈ వ్యవహారంలో ఏపీ రాజకీయ పార్టీల స్టాండ్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ఆయన మినహా.. పేరున్న లీడర్, పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు జనసేన పార్టీ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు స్పందించి, అరెస్టును ఖండించారు.

నీ కోసం నిలబడతాం..

ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ తీరు ఆసక్తికరంగా ఉంది. వైసీపీ చీఫ్ జగన్ మొదలు.. సాధారణ కార్యకర్త వరకూ బన్నీఅరెస్టుపై స్పందించారు. అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందుకేసి.. అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు కూడా ఉన్నారని వైసీపీ ఆరోపించింది. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సపోర్ట్ పోస్టింగ్‌ పెట్టింది. 'నువ్ మా కోసం నిలబడ్డావ్.. మేము నీ కోసం నిలబడతాం' అంటూ వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అటు బన్నీ కేసులో హైకోర్టులో వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈ ఇష్యూను వైసీపీ ఓన్ చేసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రకరకాల ఊహాగానాలు..

బన్నీ అరెస్టు వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల పుష్ప-2 సక్సెస్ మీట్ జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని.. అందుకే కక్షగట్టి అరెస్టు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో కామనే అయినా.. 'మరోసారి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోరు' అంటూ పెడుతున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి అల్లు వారి అబ్బాయి అరెస్టు.. అటు రాజకీయ, ఇటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయంపై చర్చ జరుగుతోంది. ఒకేరోజులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం కామన్. కానీ.. ఒకే రోజులో అరెస్టు చేసి, రిమాండ్ విధించి జైలుకు తరలించి, ఆ వెంటనే బెయిల్ మంజూరు అవ్వడం అరుదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. (హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బెయిల్ వచ్చింది.)

తదుపరి వ్యాసం