Allu Arjun Arrest Episode : అల్లు అర్జున్ అరెస్టు నుంచి బెయిల్ వరకు.. ఫుల్ అండ్ ఫైనల్.. 10 ముఖ్యమైన అంశాలు
Allu Arjun Arrest Episode : హైదరాబాద్ నగరంలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం అలజడి. సీన్ కట్ చేస్తే.. అల్లు అర్జున్ అరెస్టు. ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అరెస్టు వార్తలు వచ్చినప్పుటి నుంచి అందరి ఫోకస్ బన్నీపైనే ఉంది. అసలు అరెస్టు తర్వాత ఏం జరిగింది.. బెయిల్ ఎలా వచ్చింది.. ఓసారి చూద్దాం.
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఇష్యూ.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన్ను అరెస్టు చేశారని తెలిసిన తర్వాత.. ఎప్పుడు ఏం జరగబోతోందని అందరూ ఉత్కఠంగా చూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీ అరెస్టుపై స్పందించారు. అతనికి మద్దతు తెలిపారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే.. అసలు అరెస్టు ఎప్పుడు, ఎందుకు జరిగింది.. బెయిల్ ఎలా వచ్చిందో చాలా మంది చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 10 అంశాలు ఇలా ఉన్నాయి.
1.పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతిచెందారు. ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చిన కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు. సంథ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.
2.అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఒక వేళ నేరం రుజువైతే.. అల్లు అర్జున్ కు 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంటుంది.
3.ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించి.. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు.
4.కేసుకు సంబంధించిన వివరాలను పీపీ న్యాయమూర్తికి వివరించారు. ఘటన జరిగిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు. అల్లు అర్జున్ కారణంగానే మహిళ చనిపోయిందన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ సహా.. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని న్యాయమూర్తికి వివరించారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.
5.కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అల్లు అర్జున్‌ను పోలీసులు జైలుకు తరలించారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాల సమయంలో పోలీస్ వాహనంలో జైలు లోపలికి తీసుకెళ్లారు.
6.అప్పటికే హైకోర్టు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి. ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున్ వాదనలు వినిపించారు.
7.అల్లు అర్జున్ తరఫు న్యాయవాది, ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలను విన్న హైకోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది.
8.సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌ను హైకోర్టు ఆదేశించింది. అర్ణబ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై పీపీ అభ్యంతరం చెప్పారు. క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
9.మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ అడ్వకేట్లు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తును అల్లు అర్జున్ సమర్పించారు. కానీ.. బెయిల్ ప్రాసెస్ పూర్తి కావడానికి సమయం పట్టింది. దీంతో బన్నీ విడుదల ఆలస్యం అయ్యింది.
10.శుక్రవారం 7 గంటల తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్‌పై సెంట్రల్ జోన్ డీసీపీ మాట్లాడారు. అల్లు అర్జున్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. దుస్తులు మార్చుకుంటానంటే సమయం ఇచ్చామని.. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా సమయం ఇచ్చామని చెప్పారు. అతను బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. అటు బన్నీ అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఆయనకు మద్దతు తెలిపారు.