Telangana Bandh : ఈనెల 9న తెలంగాణ బంద్.. పిలుపునిచ్చిన జగన్.. కారణం ఇదే
Telangana Bandh : ఈనెల 9న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ములుగు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్టు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. అలాగే చెల్పాక ఎన్‌కౌంటర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ములుగు జిల్లా చెల్పాక అడవుల్లోని పోకలమ్మ వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్‌కౌంటర్ జరగడానికి కారణం ఓ వ్యక్తి అని.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా.. జగన్ పేరుతో ఓ లేఖ విడుదలైంది.
'నవంబర్ 30న చెల్పాక పంచాయతీలోని ఓ వలస ఆదివాసీ గ్రామానికి చెందిన నమ్మిన ఓ వ్యక్తికి.. భోజనాలు ఏర్పాటు చేయమని దళం చెప్పింది. ఆ వ్యక్తి ముందుగానే పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి ఆహారంలో విషమిచ్చాడు. దళం సభ్యులు స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో గ్రేహౌండ్స్ పోలీసులు.. ఏడుగురు సాయుధులను అధీనంలోకి తీసుకున్నారు. అతి దగ్గరి నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారు' అని జగన్ తన లేఖలో ఆరోపించారు.
'శత్రువు మోసపూరిత కుట్రకు ఏడుగురు సభ్యులు అమరులయ్యారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చెల్పాక సమీపంలో జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.
హైకోర్టు కీలక నిర్ణయం..
ఇదే ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలన్న పిటిషనర్ అభ్యర్థనకు.. తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. పోస్టుమార్టం నివేదిక అందకుండా ఈ దశలో న్యాయ విచారణకు అనుమతించలేమని స్పష్టం చేసింది. మల్లయ్య మృతదేహాన్ని అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. మిగతా ఆరుగురి మృతదేహాలను అప్పగించామని, మల్లయ్య మృతదేహం ఒక్కటే ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించగా.. కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
పిటిషన్ ఎందుకు వేశారు..
పోకలమ్మ వాగు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఏడుగులు మావోయిస్టులు మృతిచెందారు. అయితే.. మల్లయ్య మృతిపై ఆయన భార్య కె.ఐలమ్మ అలియాస్ మీనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని కోర్టు మెట్లెక్కారు. మల్లయ్య మృతదేహంపై బుల్లెట్ గాయం ఒక్కటే ఉందని.. కానీ ఒంటిపై మరో 11 గాయాలున్నాయని కోర్టుకు వివరించారు. దంతాలు రాలిపోయాయని వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించాలని కోరారు.