తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Mlas Suspended: వైసీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం.. నలుగురు ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్‌ వేటు

YCP MLAs Suspended: వైసీపీ హైకమాండ్ సంచలన నిర్ణయం.. నలుగురు ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్ష‌న్‌ వేటు

HT Telugu Desk HT Telugu

24 March 2023, 18:41 IST

google News
  • AP MLC Results 2023: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితాలపై వైసీపీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు భావిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

4 MLAs Suspended From YSRCP: వైసీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‍కు పాల్పడినందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ…. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపామన్నారు. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. తమకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వస్తోందని చెప్పారు. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్‌ చేశారని ఆరోపించారు.

ప్రస్తుతం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వాళ్లు సందర్బం చూసుకుని పార్టీకి వ్యతిరేకంగా నడుచుకున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలాంటి విషయాల్లో తమ పార్టీ సాగదీత ధోరణి అవలంభించవద్దని అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం జరిగింది అలా కాదన్నారు. పార్టీ మీద విశ్వాసం లేని వాళ్లు వెళ్లటంతో ఎలాంటి నష్టం లేదన్నారు సజ్జల. నలుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పూర్తి స్థాయిలో నమ్మిన తర్వాతే... నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ చంద్రబాబుకు అలవాటే అని దుయ్యబట్టారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని సదరు సభ్యులు ఖండించవచ్చు కానీ... వారు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పార్టీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని చెప్పారు.

ఆనం, కోటంరెడ్డి విషయంలో ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో మాత్రం అన్ని విచారించిన తర్వాతే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ అంశాన్ని వీరిద్దరూ ఖండించారు. ఎమ్మెల్యే శ్రీదేవి అయితే… ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణించారు. సీఎం జగన్ బాటలోనే నడుస్తానని… ఇలాంటి చర్యలకు దిగాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు. కానీ పార్టీ ప్రకటించిన జాబితాలో ఆమె పేరు కూడా ఉండటంతో ఆమె ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన… పార్టీ సస్పెన్షన్ నిర్ణయంతో చాలా రిలాక్స్ గా ఉన్నట్లు చెప్పారు. నాడు అధికారాన్ని వదలుకోని జగన్ కోసం పని చేస్తే… ఇవాళ మంచిగా మర్యాద ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన సరిగా లేదని చెప్పుకొచ్చారు. పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలకు గౌరవం లేదని.. చాలా మంది బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.

టీడీపీ విజయం.. వైసీపీలో ప్రకంపనలు..

గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గెలవటం కష్టం అనుకున్న సీటులో అభ్యర్థిని నిలబెట్టి ఎగరేసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నుంచి బరిలో ఉన్న అనురాధకు 19 ఓట్లే ఉంటే.. 23 ఓట్లు పడ్డాయి. ఇందులో రెండు ఓట్లు అధికార పార్టీ నుంచి వస్తాయని ముందే ఊహించినప్పటికీ... మరిన్ని ఓట్లు కూడా అనురాధకు పడటంతో వైసీపీ ఓ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఏడు స్థానాలే తమవే అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ... ఓ సీటు కోల్పోవటం సంచలన పరిణామంగా మారింది.

అయితే సొంత పార్టీ నేతలే పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థి ఓటమికి కారణం అవ్వడంతో వైసీపీ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అనురాధ విజయం ఖాయమవ్వడంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు. ఆయన గెలుపునకు 22 ఓట్లు కావాల్సి ఉండగా, 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయనతో పాటు జయమంగళం కు 21 ఓట్లే వచ్చినా.. రెండో ప్రాధాన్య ఓటుతో గెలుపొందారు. నిజానికి ఈ కొద్దిరోజుల కిందట జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వైసీపీ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఏకంగా మూడింటికి మూడు స్థానాల్లోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. నిజానికి ఆయా స్థానాల్లో తామే గెలుస్తామంటూ చెప్పుకొచ్చిన వైసీపీకి... చివర్లో ఓటమి తప్పలేదు. ఇంతలోనే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఊహించని ఫలితం రావటంతో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లు అయింది. ఓటమిపై సమీక్షించుకున్న హైకమాండ్… కారకులైన వారిపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగిన ఎమ్మెల్సీ స్థానాలు - 07

టీడీపీ గెలిచినవి - 01

వైసీపీ గెలిచినవి -06

పంచమర్తి అనురాధ 23 ఓట్లు

సూర్యనారాయణ రాజు 22 ఓట్లు

మర్రి రాజశేఖర్ 22 ఓట్లు

జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు

యేసు రత్నం 22 ఓట్లు

బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు

పోతుల సునీత 22 ఓట్లు

కోలా గురువులు 21 ఓట్లు

తదుపరి వ్యాసం