AP Mlc Election Updates: ఎమ్మెల్యే కోటా MLC ఫలితాల్లో సంచలన పరిణామం-andhra pradesh mla quota mlc elections telugu live news updates 23 march 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mlc Election Updates: ఎమ్మెల్యే కోటా Mlc ఫలితాల్లో సంచలన పరిణామం

ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిఎం జగన్

AP Mlc Election Updates: ఎమ్మెల్యే కోటా MLC ఫలితాల్లో సంచలన పరిణామం

03:31 PM ISTMar 23, 2023 09:00 PM HT Telugu Desk
  • Share on Facebook
03:31 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు  ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది టీడీపీ. ఆ పార్టీ తరపున బరిలో ఉన్న పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. 

Thu, 23 Mar 202303:30 PM IST

తుది ఫలితాలు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ-1, వైసీపీ-5 స్థానాల్లో గెలుపు సాధించాయి. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో గెలిచారు. పోతుల సునీతకు 22 ఓట్లు.. యేసురత్నంకు 22 ఓట్లు.. ఇజ్రాయెల్‌కు 22 ఓట్లు.. మర్రి రాజశేఖర్‌కు 22 ఓట్లు.. సూర్యనారాయణరాజుకు 22 ఓట్లు వచ్చాయి.

Thu, 23 Mar 202301:42 PM IST

వైసీపీకి షాక్

ఇక వైసీపీ నుంచి బరిలో ఉన్న మర్రి రాజశేఖర్, పెనుమత్స సత్యనారాయణ రాజు తో పాటు మరో ముగ్గురు విజయం సాధించారు. జయ మంగళ వెంకట రమణ, కోలా గురువులు విషయంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఒక్కరిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Thu, 23 Mar 202301:10 PM IST

గెలుపు

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య గెలిచారు.

Thu, 23 Mar 202312:03 PM IST

కౌంటింగ్ షురూ 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది.  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మర్రి రాజశేఖర్‌, ఇజ్రాయిల్‌, పోతుల సునీత, జయ మంగళ వెంకట రమణ, కోలా గురువులు, పెనుమత్స సూర్యనారాయణ రాజు, చంద్రగిరి ఏసురత్నం ఉన్నారు.

Thu, 23 Mar 202309:35 AM IST

పోలింగ్ ప్రక్రియ పూర్తి 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Thu, 23 Mar 202307:45 AM IST

ఇంకా  ఓటు వేయని వైసీపీ ఎమ్మెల్యే…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఓటు వేయలేదు. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కుమారుడి వివాహం ఉండటంతో పోలింగ్‌కు రాలేకపోయారు. దీంతో అప్పలనాయుడు కోసం వైసీపీ ప్రత్యేక విమానాన్ని  పంపినట్లు తెలుస్తోంది.  శాసన సభ ఆవరణలో 174మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఓటు వేశారు. కుమారుడి వివాహం కోసం విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే అసెంబ్లీకి రాలేకపోయారు. దీంతో అప్పలనాయుడు కోసం  వైసీపీ నాయకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

Thu, 23 Mar 202306:38 AM IST

మరో నాలుగు ఓట్లు….

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావొచ్చింది. టీడీపీ సభ్యులు కూడా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. 175మంది ఎమ్మెల్యేలలో 171మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేయాల్సి ఉంది. 

Thu, 23 Mar 202306:31 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న 167మంది ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన మూడు గంటల్లోనే దాదాపు 167మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. 

Thu, 23 Mar 202306:20 AM IST

ఓటు వేసిన 149మంది ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వేయడం దాదాపు పూర్తైంది. 149మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ఐదుగురు మాత్రమే ఓటు వేయాల్సి ఉంది.  మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అనివార్యమని  ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. 

Thu, 23 Mar 202306:18 AM IST

పోలింగ్‌కు బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  నివాసం నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు.  తెలుగుదేశం అభ్యర్థుల సంఖ్య 23అని గ్రహించకుండా వైకాపా నేతలు పిచ్చిపెట్టినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేవారు. పార్టీకి దూరమైన నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేశామనే భావనలో ఉన్నారని,  పార్టీ వీడి తప్పు చేశామని మాతో చెప్తున్నారన్నారు.  వారు అంతరాత్మ ప్రభోదానుసారావు ఓటు వేస్తారని నమ్ముతున్నామన్నారు. 

Thu, 23 Mar 202305:48 AM IST

వైసీపీ మైండ్‌ గేమ్‌పై  గంటా విమర్శలు

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ అమోదం అంటూ జరిగిన ప్రచారాన్ని గంటా ఖండించారు. తాను ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఆమోదం అంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రాజీనామాను ఆమోదించారని ప్రచారం పెట్టారని ఆఱోపించారు.  టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే ఫీలింగ్ కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.   వైసీపీ అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది వైసీపీ ఆలోచనగా వివరించారు.  టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం తానే చేసినట్లు గుర్తు చేశారు. ఓటర్ల లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదన్నారు. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్టేనని, రెండేళ్లల్లో రాజీనామా ఆమోదించకుండా కనీసం నన్ను పిలవకుండా ఇప్పుడు రాజీనామాను ఆమోదించడం సాంకేతికంగా కూడా కుదరదన్నారు. 

Thu, 23 Mar 202305:44 AM IST

పూర్తి కావొస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల ఓటింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోవడం పూర్తి కావొచ్చింది. ఉదయం 11.20కల్లా 145మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలతో కలిసి వైసీపీకి 154 మంది సభ్యుల బలం ఉంది. ఏడు స్థానాలను గెలవడానికి తగిన సంఖ్యా బలం తమకు ఉందని వైసీపీ చెబుతోంది. 

Thu, 23 Mar 202305:43 AM IST

చంద్రబాబు నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ‌్యంలో చంద్రబాబు నివాసంలో  ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీపీకి ప్రస్తుతం చంద్రబాబుతో కలిపి 19మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో జోగేశ్వరరావు మినహా మిగిలిన వారంతా చంద్రబాబు నివాసంలో మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. జోగేశ్వరరావు కూడా ఆలశ్యం కావడంతో నేరుగా అసెంబ్లీ వస్తానంటూ పార్టీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్‌ మీదే టీడీపీ గంపెడాశలు పెట్టుకుంది. 

Thu, 23 Mar 202305:41 AM IST

ఓటు వేసిన కొటంరెడ్డి

అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు హక్కు వేశానని ఓటు వేసినట్లు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన కోటంరెడ్డి గతంలో చెప్పిన విధంగానే ఓటు వేశానని చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేశాననేది తాను చెప్పలేనన్నారు. 

Thu, 23 Mar 202305:40 AM IST

ఓటు హక్కు వినియోగించుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ  ఎన్నికలు ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటివరకు 130 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేచి ఉన్నారు. 

Thu, 23 Mar 202304:38 AM IST

ఓటు వేసిన  మంత్రులు, ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ రాష్ట్ర మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Thu, 23 Mar 202304:11 AM IST

తొలి గంటలో 35మంది ఓట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో  175 ఎమ్మెల్యేలకు గాను తొలి గంటలో 35 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి ఓటు వేసిన తర్వాత డిప్యూటీ సిఎం  నారాయణస్వామి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Thu, 23 Mar 202304:09 AM IST

ఎమ్మెల్యేలు జారిపోకుండా ఏర్పాట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేయి దాటిపోకుండా వైసీపీ ఏర్పాట్లు చేసింది. ప్రతి టీమ్‌లో ఓ మంత్రిని ఉంచేలా బృందాలుగా ఏర్పాటు చేసింది. ఏడు స్థానాల్లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి ఆదేశించినా అనూహ్య పరిణామాలు జరిగితే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. 

Thu, 23 Mar 202304:08 AM IST

టీడీపీ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరిస్తారా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ జారీ చేయడంతో టీడీపీ నుంచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.  వైసీపీ ఏడు స్థానాల్లో అభ్యర్థులను పోటీలో దింపింది. మొత్తం 154మంది ఎమ్మెల్యేల ఓట్లు గెలుపుకు అవసరం అవుతాయి. ఒక్కో ఎమ్మెల్యేకు 22ఓట్లు చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించారు.  అనూహ్యంగా ఎవరైనా తమ ఓటును చెల్లుబాటు  కాని విధంగా వేస్తే టీడీపీ అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. టీడీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతిస్తారనేది కూడా కీలకం కానుంది. విప్‌ను ధిక్కరించి ఓటు వేస్తారో లేదో తేలాల్సి ఉంది. 

Thu, 23 Mar 202304:06 AM IST

ఆ ఒక్క ఓటు దక్కేనా…?

టీడీపీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ మాజీ మేయర్, టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ నామినేషన్ వేశారు. ప్రస్తుతం టీడీపీకి 19మంది సభ్యుల బలం ఉంది. గెలుపుకు మరో మూడు ఓట్లు అవసరం అవుతాయి. వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి, ఆనంతో పాటు మరో ఓటు వైసీపీకి అవసరం అవుతుంది. ఒక్క ఓటుపైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. 

Thu, 23 Mar 202304:04 AM IST

ఆ ఎమ్మెల్యేల ఓటు ఎటువైపు…?

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు విప్ జారీ చేశాయి. టీడీపీ నుంచి గెలిచిన  వంశీ, కరణంబలరాం, గణేష్‌, మద్దాలి గిరి ఎవరికి ఓటు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్, ఆనం రాం నారాయణ రెడ్డి అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేస్తామని ప్రకటించారు. 

Thu, 23 Mar 202304:03 AM IST

ఏడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల  పోటీ

శాసన మండలిలో ఏడు స్థానాలను దక్కించుకోడానికి అధికార వైఎస్సార్సీపీ  ప్రయత్నిస్తోంది. అసెంబ్లీలో వైసీపీకి ప్రస్తుతం 151మంది ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు, జనసేన ఎమ్మెల్యేతో కలిసి 156  మంది ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు.

Thu, 23 Mar 202304:01 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభం

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలుపుపై వైసీపీ, టీడీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కో అభ్యర్థి గెలుపుకు 22మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానున్నాయి. 

Thu, 23 Mar 202303:59 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన సిఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏపీ అసెంబ్లీ ఆవరణలో ప్రారంభం అయ్యింది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.