KotamreddyProtest: ప్లకార్డుతో పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లిన కోటంరెడ్డి
Kotamreddy Protest: నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో సమస్యల పరిష్కారంతో పాటు, అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. కాలి నడకన ప్లకార్డును ప్రదర్శిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు.
Kotamreddy Protest: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు.
అసెంబ్లీ బయట ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్రకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానని, వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానని కోటంరెడ్డి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతోందని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు పోరాటం చేసి గళం వినిపిస్తున్నానని చెప్పిన కోటంరెడ్డి మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్లకార్డ్ ప్రదర్శిస్తూ నిలబడే ఉంటానని తేల్చి చెప్పారు.
నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా, సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని కోటంరెడ్డి ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లోనే తాను నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. రూరల్ నియోజక వర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, జగనన్న కాలనీలో కనీస వసతులు, ఇరిగేషన్ కాల్వలకు మరమ్మతులు, ముస్లిం గురుకుల పాఠశాల, బారాసాహెబ్ దర్గా సమస్యలపై గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రికే నేరుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు.
ప్లకార్డులు ప్రదర్శించడం సభ్యుడిగా తనకు ఉన్న హక్కని కోటంరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ పాదయాత్రగా అసెంబ్లీకి తరలి వచ్చారు. నియోజక వర్గంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని, పొట్టేపాలెం, ములుముడి కాలువల మీద వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు.
ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో గణేష్ ఘాట్‌ను అభివృద్ధి చేయాలని, నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బారాషాహీద్ దర్గా అభివృద్ధితో పాటు మసీదు నిర్మాణం పూర్తి చేయాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన షాదీమంజిల్ పనులు పూర్తి చేయాలని కోరారు. ఆమంచర్ల పెద్ద పారిశ్రామిక వాడ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కొమ్మరపూడి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నియోజక వర్గంలో అంబేడ్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ నిర్మించాలని, బిసి భవన్, కాపు భవన్ నిర్మాణాలను పూర్తి చేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, డొంకాని గ్రామాల్లో ఇరిగేషన్ లిఫ్ట్ పథకాలను పూర్తి చేయాలన్నారు. వేలాల వ్యవసాయభూములకు సాగునీటి కోసం అమంచర్ల డీప్‌కట్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు, దళితులకు గురు కుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు కల్పించాలంటూ కోటంరెడ్డి ప్లకార్డును ప్రదర్శించారు.
సంబంధిత కథనం