Uttarandhra Failure: వైసీపీ కుమ్ములాటలే కొంప ముంచాయా..?
Uttarandhra Failure: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఓటమి వైసీపీకి మింగుడు పడటం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నికల్ని లెక్కల్లోకే తీసుకోవట్లేదని చెబుతున్నా లోలోన మాత్రం కుమిలిపోతున్నారు.ఉత్తరాంధ్ర ఓటమికి నాయకులు కాడి దించేయడమే ప్రధాన కారణమని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Uttarandhra Failure: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలపై పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సీతంరాజు సుధాకర్ ఓడిపోవడానికి కారకులు ఎవరనే దానిపై అన్ని వేళ్లు ముఖ్య నాయకులనే చూపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర బాధ్యుడిని మార్చిన తర్వాత పరిస్థితుల్ని అంచనా వేసుకోకపోవడమే పొరపాటైందని చెబుతున్నారు.
ఉత్తరాంధ్రకు వైసీపీ అత్యధిక ప్రాధాన్యమిస్తుండటంతో ఎన్నికల్లో తిరుగుండదని భావించిన పార్టీకి ఓటర్లు గట్టి దెబ్బే వేశారు. ఏపీ రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చి దిద్దుతామని చేసిన ప్రకటనలు, ముఖ్యమంత్రి విశాఖ వచ్చేస్తారనే హామీల నడుమ ఎన్నికల్లో ఓటర్లు బ్రహ్మరథం పడతారనుకుంటే ఊహించని విధంగా ఫలితాలు తారుమారయ్యాయి.
ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి గెలుపు, ఆ పార్టీ సొంతం కాదనే వాదన కూడా వైసీపీ వర్గాలు తెరపైకి తెచ్చాయి. సుదీర్ఘ కాలం అధ్యాపక వృత్తిలో ఉండటం, విశాఖలో సివిల్స్ కోచింగ్‌తో గుర్తింపు తెచ్చుకోవడంతో పట్టభద్రుల్లో ఉన్న గుర్తింపు టీడీపీ అభ్యర్థి గెలుపుకు దోహదపడ్డాయని సర్ది చెప్పుకుంటున్నారు.
టీడీపీ అభ్యర్ధి విజయావకాశాలను మెరుగు పరచడంలో ఆయన వ్యక్తిగత ప్రొఫైల్ పనికొచ్చినా, ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయడంలో వైసీపీ ఎందుకు వెనుకబడిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. దాదాపు మూడున్నరేళ్లుగా విజయసాయి రెడ్డి ఆశీస్సులతో విశాఖలో చక్రం తిప్పిన సుధాకర్ పరిస్థితి, సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి తప్పించాక ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడారు. పార్టీలో సహకారం అంతంత మాత్రంగానే అందడంతో ఓటమిని ముందే ఊహించారు.
ఎవరిని ఎవరు ఓడించారు…
ఉత్తరాంధ్రలో ఎవరు ఎవరిని ఓడించారనే చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది. వైసీపీ తరపున పోటీ చేసిన సీతంరాజు సుధాకర్ ముఖ్యమంత్రికి సన్నిహితుడైన జేజేరెడ్డికి దగ్గరి మనిషిగా గుర్తింపు ఉంది. దీంతో పార్టీలో తనకు తిరుగులేదన్నట్లు సుధాకర్ వ్యవహరించారు. దీనికి తోడు సాయిరెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పార్టీలో మిగిలిన నాయకులతో పని లేదన్నట్లు తలబిరుసుగా వ్యవహరించారు.
2024 ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేయాలని భావించారు. విశాఖ సౌత్‌లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతిచ్చిన వాసుపల్లి గణేష్‌ను మార్చే పరిస్థితి లేకపోవడంతో సుధాకర్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. విశాఖ పాత నగరంలో బలమైన బ్రహ్మణ సామాజిక వర్గం కావడంలో సులువుగా గెలవొచ్చని భావించారు.
స్థానిక సంస్థ ఎన్నికల సమయంలో చూపిన శ్రద్ధ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపలేదనే విమర్శ కూడా వైసీపీపై ఉంది. గెలుపుపై మితిమీరిన విశ్వాసం, మంత్రులు పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం, అభ్యర్థుల మీదే గెలుపు భారాన్ని వదిలేయడంతో టీడీపీకి కలిసొచ్చింది. దీనికి తోడు సుధాకర్‌ను గెలిపించే బాధ్యతను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.
సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్ధి సుధాకర్, ఆయన సాయాన్ని కోరలేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో సుబ్బారెడ్డి కూడా సుధాకర్ గెలుపును పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని చెబుతున్నారు. దీనికి తోడు సాయిరెడ్డి అనుచరుడిగానే పరిగణించడంతో వైసీపీకి మైనస్‌గా మారింది. ఇక ఉత్తరాంధ్రకు చెందిన బొత్స, ధర్మాన వంటి సీనియర్లతో పాటు కొత్తగా మంత్రులైన అమర్‌నాథ్, అప్పలరాజు వంటి వారు కూడా ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకోకపోవడం, పోల్ మేనేజ్మెంట్‌లో భాగం కాకపోవడంతో పట్టభద్రులు టీడీపీ అభ్యర్థికి జైకొట్టినట్టు తెలుస్తోంది. వైసీపీకి మునిగిపోయే వరకు సీన్ అర్థం కాలేదని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు.