Mekapati Family Issue : మేకపాటి ఇంట్లో వారసత్వ రచ్చ….-woman and her son claims they are wife and son of udayagiri mla mekapati chandra sekhar reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mekapati Family Issue : మేకపాటి ఇంట్లో వారసత్వ రచ్చ….

Mekapati Family Issue : మేకపాటి ఇంట్లో వారసత్వ రచ్చ….

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 12:13 PM IST

Mekapati Family Issue నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి కేంద్రంగా వారసత్వ రగడ మొదలైంది. తనను కుమారుడిగా అంగీకరించాలంటూ మేకపాటి శివచరణ్‌ రెడ్డి లేఖను విడుదల చేయడంతో రగడ మొదలైంది. తమను ఒంటరిని చేశారంటూ చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించడంతో రగడ మొదలైంది. మేకపాటిని టార్గెట్ చేస్తూ తల్లి కుమారులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మేకపాటి నివాసంలో వారసత్వ రగడ
మేకపాటి నివాసంలో వారసత్వ రగడ

Mekapati Family Issue నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. మేకపాటి కుమారుడినంటూ ఓ యువకుడి వీడియోలు, లేఖలు విడుదల చేయడంతో తనకు కొడుకులు లేరని చంద్రశేఖర్‌ రెడ్డి ప్రకటించారు. ఆయన కుమారుడిగా చెబుతున్న యువకుడి తల్లి తెరపైకి వచ్చారు. మేకపాటి తనతో 18ఏళ్లు కాపురం చేసి రోడ్డున పాడేశారంటూ బాంబు పేల్చారు.

మేకపాటి శివచరణ్‌ రెడ్డి అనే యువకుడు రెండ్రోజుల క్రితం పత్రికలకు వీడియోలు, లేఖను విడుదల చేయడంతో కలకలం రేగింది. నాన్నా నిన్ను మిస్ అవుతున్నా, చిన్నతనం నుంచి నన్ను నిర్లక్ష్యం చేశావు, ఇది నీకు తగునా అంటూ మేకపాటి శివ చరణ్ రెడ్డి పేరుతో లేఖలు విడుదల చేశారు.

"ప్రియమైన నాన్న ఇన్ని రోజులు నేను మీ మాట విన్నాను, ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వండిఅంటూమొదలు పెట్టి చిన్నతనం నుంచి తండ్రి ఎలా మిస్ అయ్యాడో వివరించారు. 14ఏళ్ల వయసులో తమను విడిచిపెట్టారని, తర్వాత మీ హృదయంలో స్థానం ఏమిటో తమకు తెలిసిందని, మీ సంపద, రాజకీయ వారసత్వం వెనుక తాను లేనని,తనను కుమారుడిగా గుర్తించాలని, ఇది చేయగలిగిన పనే అంటూ వేడుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తనకు మగ పిల్లలు లేరని చెప్పడం చూసి బయటకు వస్తున్నానని, తాను ఎవరో చెప్పాలని, తనను కొడుకుగా గుర్తించాలని, మగపిల్లలు లేరనే వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పారు. చిన్నతనంలో చంద్రశేఖర్‌ రెడ్డి, తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను విడుదల చేశారు.

కొడుకులు లేరంటున్న చంద్రశేఖర్‌ రెడ్డి…..

మరో వైపు తన కు కుమారులు లేరని, కూతుళ్లే రాజకీయ వారసులని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప కుమారులెవరూ లేరని నెల్లూరు జిల్లా ఉదయగిరి వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

తనను కుమారుడిగా అంగీకరించాలంటూ చంద్రశేఖర్‌రెడ్డికి మేకపాటి శివచరణ్‌ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడంతో మేకపాటి స్పందించారు. తనకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారని, కుమారులెవరూ లేరని ప్రకటించారు. నా భార్యలైన తులసమ్మ, శాంతమ్మలకు పుట్టిన బిడ్డలు రచనా రెడ్డి, సాయి ప్రేమికా రెడ్డిలే రాజకీయ వారసులని చెప్పారు. డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేరుగా రావాలని, వ్యక్తిగత జీవితంపై బురద జల్లాలని చూస్తే భగవంతుడు క్షమించడని అని వీడియో సందేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

తనను కుమారుడిగా అంగీకరించాలంటూ.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి మేకపాటి శివచరణ్‌ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. లేఖతోపాటు పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 'మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నా తండ్రి. పద్దెనిమిదేళ్లు నా తల్లితో కాపురం చేసి వదిలిపెట్టారు. ఇన్నాల్లు మమ్మల్ని రహస్యంగా ఉంచారని, మమ్మల్ని ఎప్పుడూ బయటకు రావద్దని కోరారు. అందుకే ఇన్నాళ్లూ ఆయనను ఇబ్బంది పెట్టలేదని అని లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కుమారుడు లేరని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పడం తీవ్రంగా కలచివేయడంతోనే బయటకు వచ్చానని మేకపాటి చెబుతున్నారు. మేకపాటికి కుమారుడు లేకపోతే.. తానెవర్ని అని ఏ ప్రజల ముందు తనకు కుమారులు లేరని చెప్పారో, వారి ముందే నన్ను పుత్రుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.తా ను 8వ తరగతిలో ఉన్నప్పుడు మమ్మల్ని పూర్తిగా వదిలేశారని, కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధం' అని శివచరణ్ రెడ్డి చెప్పారు.

ఇంటి చుట్టూ ఎందుకు తిరిగారన్న శివచరణ్ తల్లి….

తనకు కుమారులు లేరని మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ప్రకటించడంతో శివచరణ్‌ రెడ్డి తల్లి వీడియోను రిలీజ్ చేశారు. తనకు పదిహేనేళ్ల వయసులోనే కొండారెడ్డితో వివాహమైందని, పెళ్లైన రెండేళ్లకే వదిలేసి వెళ్లిపోవడంతో పిన్ని ఇంటి దగ్గర ఉండే సమయంలో చంద్రశేఖర్‌ రెడ్డి పరిచయమైనట్లు తెలిపారు. తన మామ, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుకుంటున్న సమయంలో తన ప్రస్తావన రావడంతో పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టారని ఆరోపించారు.

తన ఇంట్లో వారు ఒప్పుకోకున్నా, రెండేళ్ల పాటు తమ ఇంటి చుట్టూ తిరిగారని ఆరోపించారు. ఇప్పుడు డబ్బుల కోసం వచ్చామని ఆరోపిస్తూ, అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తనను బెంగుళూరు తీసుకెళ్లి కాపురం పెట్టారని, దాదాపు 18ఏళ్లు తమతో కలిసి ఉన్నారని చెప్పారు. తమ కొడుకును బాగా చూసుకునే వారని, చంద్రశేఖర్‌ రెడ్డితో ప్రస్తుతం ఉంటున్న శాంత కుమారి పరిచయం అయిన తర్వాత తమ దగ్గరకు రావడం మానేశారని చెప్పారు.

ఇంటికి రావడం లేదని నిలదీయడంతో తమతో మాట్లాడటం మానేశారని లక్ష్మీదేవి ఆరోపించారు. తనను ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి బజారులో వదిలేసినా ఏనాడు ఒక్క మాట అడగలేదన్నారు. మీ అంతట మీరే వచ్చారని, మీరే వెళ్లిపోయారని, చంద్రశేఖర్‌ రెడ్డి మాటలతో అవమానం భరించలేక బయటకు వచ్చామన్నారు.డబ్బు కోసం వచ్చామని మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Whats_app_banner