తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu Delhi Tour : డిమాండ్ల చిట్టాతో దిల్లీకి సీఎం చంద్రబాబు, రేపు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రుల‌తో భేటీ

CM Chandrababu Delhi Tour : డిమాండ్ల చిట్టాతో దిల్లీకి సీఎం చంద్రబాబు, రేపు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రుల‌తో భేటీ

HT Telugu Desk HT Telugu

03 July 2024, 22:07 IST

google News
    • CM Chandrababu Delhi Tour : సీఎం చంద్రబాబు మూడ్రోజులు దిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం దిల్లీ చేరుకున్న చంద్రబాబు రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఈ భేటీల్లో చర్చించనున్నారు.
డిమాండ్ల చిట్టాతో దిల్లీకి సీఎం చంద్రబాబు, రేపు ప్రధాని మోదీతో భేటీ
డిమాండ్ల చిట్టాతో దిల్లీకి సీఎం చంద్రబాబు, రేపు ప్రధాని మోదీతో భేటీ

డిమాండ్ల చిట్టాతో దిల్లీకి సీఎం చంద్రబాబు, రేపు ప్రధాని మోదీతో భేటీ

CM Chandrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజ‌ధాని దిల్లీకి వెళ్తున్నారు. రేపు ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ల చిట్టాను కేంద్ర ప్రభుత్వం వ‌ద్ద పెట్టనున్నారు. పోల‌వ‌రం నిధులు, అలాగే వివిధ అంశాలతో కూడిన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచ‌నునున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీక‌రించిన త‌రువాత తొలిసారిగా సీఎం చంద్రబాబు దిల్లీ పర్యట‌న చేస్తున్నారు. రాత్రి ఎంపీల‌కు ఇచ్చి విందులో ఆయ‌న పాల్గొంటారు.

సీఎం చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు చేరుకున్న చంద్రబాబు... ఏపీ ఎన్డీఏ ఎంపీలతో విందు భేటీలో పాల్గోనున్నారు. మూడ్రోజులపాటు దిల్లీలో ఉండనున్న చంద్రబాబు ...రేపు ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. హోంశాఖ, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఎల్లుండి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే అవకాశం ఉంది.

చంద్రబాబు దిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్‌, కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌, కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రి నితిన్ గ‌డ్కరీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవ‌సాయ‌ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు మ‌రికొంత మంది కేంద్ర మంత్రుల‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల‌ను వారి వ‌ద్ద లేవ‌నెత్తనున్నారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం, పోల‌వ‌రానికి నిధులు, విశాఖ రైల్వే జోన్‌తో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టుల‌కు నిధులు విడుద‌ల, ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు స‌హ‌కారం, రోడ్లు మ‌ర‌మ్మత్తులు వంటి అంశాల‌ను లేవ‌నెత్తనున్నారు. ఈ అంశాల‌పై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల‌కు విజ్ఞప్తి చేయ‌నున్నారు. ఇప్పటికే ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను అధికారులు త‌యారు చేశారు. ఈ అంశాల‌తో కూడిన విన‌తిప‌త్రాల‌ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల‌కు స‌మ‌ర్పించ‌నున్నారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆశించ‌నంత‌గా లేక‌పోవ‌డంంతో దిల్లీ పెద్దల‌కు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి వివ‌రించి, నిధులు స‌మీక‌ర‌ణ చేయ‌నున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన రిప్రజెంటేషన్లు అధికారులు త‌యారు చేశారు. వాటిని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల‌కు స‌మ‌ర్పించి, నిధులు కోర‌నున్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. దీంతోపాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకు అంగీకరించింది. ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయి. అయితే పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.

2014 జూన్‌ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిన దానికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బ‌కాయిలు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సి ఉంది. దీనిపై 2014-19 మ‌ధ్య చంద్రబాబు, 2019-24 మ‌ధ్య జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లుసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోలేదు. అలాగే ఇటీవ‌లి వ‌చ్చిన వ‌ర్షాలు, గ‌తం నుంచి స‌రిగా మ‌ర‌మ్మత్తులు చేయ‌క‌పోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు బాగా ధ్వంసం అయ్యాయి. క‌నుక రోడ్ల నిర్మాణానికి కేంద్ర పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నిధులు కోర‌నున్నారు. ఇలా అనేక డిమాండ్లతో కేంద్ర మంత్రుల‌కు చంద్రబాబు విజ్ఞాప‌న ప‌త్రాలు అంద‌జేసి, జూన్ 5 (శుక్రవారం) సాయంత్రం దిల్లీ ప‌ర్యట‌న‌ను ముగించుకుని ఏపీకి తిరగి వ‌స్తారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం