Amaravati : అమరావతిలో ప్రభుత్వ భవనాలకు 1575 ఎకరాలు నోటిఫై, సీఆర్డీఏ గెజిట్ జారీ
Amaravati : అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను సీఆర్డీఏ నోటిఫై చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సీఆర్డీఏ పరిధిలోని 1575 ఎకరాల ప్రాంతాన్ని ప్రభుత్వ భవనాల కోసం నోటిఫై చేశారు.
Amaravati : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు స్పీడందుకున్నాయి. తాజాగా అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సీఆర్డీఏ 1575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేసి బహిరంగ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ భవనాల కోసం రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఆర్డీఏ సమావేశంలో గందరగోళం
అమరావతి రాజధాని పనులు జోరందుకున్నాయి. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణకు రైతులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన సీఆర్డీఏ సమావేశంలో కొంత గందరగోళం నెలకొంది. ఈ సమావేశంపై చాలామందికి సమాచారం అందలేదని రైతులు ఆరోపించారు. భూసర్వేపై రైతులు రెండుగా చీలి అధికారులతో గొడవపడ్డారు. అలాగే భూములకు పరిహారం విషయంలో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సీఆర్డీఏ సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేసింది. కొంతమంది రైతులు గజానికి 50 వేలు పరిహారం అడుగుతుండగా, మరి కొంతమంది అభివృద్ధికి సహకరిస్తామని అంటున్నారు. పరిహారం కోరుతున్న రైతులు గత ఐదేళ్లుగా ఏంమాట్లాడకుండా ఇప్పుడు అడ్డుతగలడం సరికాదని మరికొంత మంది హితవు పలుకుతున్నారు. మళ్లీ పూర్తిస్థాయిలో భూముల సర్వే చేయాలని కొంత మంది రైతులు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మరోసారి సమాచారం ఇచ్చి సమావేశం నిర్వహిస్తామని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడు తెలిపారు. సీడ్ యాక్సెడ్ రోడ్డు విస్తరణకు సహకరిస్తే భూసమీకరణలో తీసుకుంటామని, లేకపోతే భూసేకరణ కింద పరిహారం చెల్లించి భూములు తీసుకుంటామని సీఆర్డీఏ అధికారులు చెప్పారు.
నూతన కమిషనర్
రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను మొదలుపెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు సీఆర్డీఏకు నూతన కమిషనర్‌ను నియమించింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్, ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్థసారథి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడీసీ సీఎండీగా విధులు నిర్వర్తించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై ఆమెకు అవగాహన ఉంది. దీంతో మరోసారి ఆమెను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్, ఎండీగా ప్రభుత్వం నియమించింది. అమరావతి నిర్మాణంలో లక్ష్మీ పార్థసారథి సేవల్ని వినియోగించుకునే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సంబంధిత కథనం