CM Chandrababu On Amaravati : ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం- సీఎం చంద్రబాబు-cm chandrababu released white paper on amaravati built capital every telugu man proud ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu On Amaravati : ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం- సీఎం చంద్రబాబు

CM Chandrababu On Amaravati : ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం- సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu
Jul 03, 2024 05:02 PM IST

CM Chandrababu On Amaravati : ప్రతి తెలుగు వాడు గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చి దిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ విధ్వంస కారుడని చంద్రబాబు విమర్శించారు.

ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం- సీఎం చంద్రబాబు
ప్రతి తెలుగువాడు గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం- సీఎం చంద్రబాబు

CM Chandrababu On Amaravati : రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో పూజలు చూసి, అన్ని గ్రామాల నుంచి నీరు, మట్టి తెచ్చి, అమరావతి రాజధానికి భూమి పూజ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ఎన్ని కుట్రలు చేసిన అమరావతిని కదిలించలేకపోయిందంటే ఆ మట్టికి ఉండే విశిష్టత అంతటిదని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం సచివాలయంలో అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు, మధ్యలో సమదూరం ఉండి, అందుబాటులో ఉండే ప్రాంతం అమరావతి అన్నారు. దీని కంటే సైంటిఫిక్ బేసిస్ ఇంకా ఏమి కావాలన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరూ రాజధానిని అడ్డుకోరని విమర్శించారు. కులం, మతం, ప్రాంతంతో రెచ్చగొట్టే వాళ్లని ఏమనాలో కూడా అర్ధం కావటం లేదన్నారు.

ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయం

రాజధాని కోసం భూములిచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని కోసం 53,748 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అన్నారు. మొత్తం 8278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామన్నారు. అమరావతికి చారిత్రక విశిష్టత ఉందన్నారు. రాష్ట్ర విభజన జరుగుతుందని అసలు ఎవరూ ఊహించలేదన్నారు. విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. ప్రతి గ్రామం నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతిలో ఉంచామన్నారు. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారని గుర్తుచేశారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చామన్నారు.

అమరావతికి ఆ ప్రత్యేకత

రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే వాళ్లు ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ సూచించిందన్నారు. 9 ఏళ్లలో సైబరాబాద్ ను అభివృద్ధి చేశామన్న చంద్రబాబు... కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు అందించామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 29 వేలమంది రైతులు 34,400 ఎకరాలు కోసం ఇచ్చారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఏటా పరిహారం ఇచ్చామన్నారు. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సేకరించామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని అంగీకరించిన జగన్.. అధికారంలోకి వచ్చాక విధ్వంసం చేశారన్నారు. దేశంలో ఏ నగరానికి లేనివిధంగా కిలోమీటర్ల మేర నదీ తీరం అమరావతి ఉందని చంద్రబాబు అన్నారు. ఒక వైపు గోదావరి, మరో వైపు కృష్ణా రెండు నదుల అనుసంధానంతో అమరావతికి ఎప్పుడూ నీటి కొరత ఉండదన్నారు.

ప్రతి తెలుగువాడు గర్వించే రాజధాని అమరావతి

"ప్రతి తెలుగు వాడు గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చి దిద్ది, నా రాజధాని అమరావతి అని ప్రతి తెలుగు వాడు చెప్పుకునే విధంగా చేస్తాం. అది మా ప్రభుత్వ కమిట్మెంట్. జగన్ వస్తూనే, ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి నాశనానికి అడుగులు వేశాడు. 3 రాజధానులు అంటూ జగన్ రాష్ట్ర పరువు తీశారు. 1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని, ఎన్ని రకాలుగా హింస పెట్టొచ్చో, అన్ని రకాలుగా వాళ్లని వైసీపీ ప్రభుత్వం హింసించింది. ఒక వ్యక్తి మూర్ఖత్వం, ఒక వ్యక్తి కక్ష, ఒక వ్యక్తి నిర్ణయాలు, 5 కోట్ల మంది ఆంధ్రులకు శాపాలు అయ్యాయి. రాజధాని నిర్మాణం మధ్యలో ఆపేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. తలుచుకుంటే బాధ.. చేసిన కష్టం మొత్తం వృథా అయ్యే పరిస్థితి.. జాతి ద్రోహం ఇది" - సీఎం చంద్రబాబు

పెట్టుబడిదారుల్లో అభద్రత

జగన్ విధ్వంస కారుడని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ సృష్టించిన భయోత్పాతం పెట్టుబడిదారులలో అభద్రత ఏర్పడిందన్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా నాశనం చేశారన్నారు. మాజీ జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చి వేసి విధ్వంసం మొదలుపెట్టారన్నారు. . మూడు రాజధానులు పేరుతో విన్యాసాలు చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం