ED Summons To Kavitha: నాడు 2జీ.. నేడు లిక్కర్ స్కామ్...! తెలంగాణలో బీజేపీకి సరికొత్త ఆయుధం దొరికిందా..?-what is going to happen finally in the delhi liquor scam over ed notices to mlc kavitha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Is Going To Happen Finally In The Delhi Liquor Scam Over Ed Notices To Mlc Kavitha

ED Summons To Kavitha: నాడు 2జీ.. నేడు లిక్కర్ స్కామ్...! తెలంగాణలో బీజేపీకి సరికొత్త ఆయుధం దొరికిందా..?

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 05:00 AM IST

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నోటీసులు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మార్చి 10వ తేదీన నిరాహార దీక్ష చేయనున్న ఆమెకు ఈ పరిణామం షాక్ ఇచ్చినట్లు అయింది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తప్పదా..?అన్నది టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారిపోయింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Analysis On Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్.... గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్..! ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంతో పాటు పలువురిని అరెస్ట్ కూడా చేసింది ఈడీ. గతేడాది నుంచి దూకుడు పెంచుకుంటూ వస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.... అదే స్పీడ్ ను కంటిన్యూ చేసే పనిలో పడింది. ఇదే కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా నోటీసులు అందుకున్నారు. ఇప్పటికే సీబీఐ ఓ దఫా విచారించింది. ఇప్పుడు ఈడీ వంతు వచ్చింది. ఢిల్లీకి విచారణకు రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ వేదికగా మహిళా బిల్లు అంశంపై దీక్షకు సిద్ధమవుతున్న కవితకు నోటీసులు రావటంతో షాక్ తిన్నట్లు అయింది. మార్చి 10న దీక్ష ఉండగా... 9వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపటంతో... కవిత అరెస్ట్ తప్పదా అన్న చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది..? ఈ స్కామ్ వెనక పొలిటికల్ మైలేజీ వ్యూహాలు ఉన్నాయా..? ఎదురులేదని భావిస్తున్న కేసీఆర్ కు కళ్లెం వేసే ప్రయత్నాలు షురూ అయ్యాయా..? విచారణ సంస్థలతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని అంటున్న బీఆర్ఎస్ ఏం చేయబోతుంది..? ఇది మరో 2జీ స్కాంగా మిగలబోతుందా..? ఫైనల్ గా అసలేం జరగబోతుంది..? అన్న ప్రశ్నలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఓవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మరోవైపు లిక్కర్ కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు..! ఈ రెండు వేర్వురు వార్తలు అయినప్పటికీ... మహిళా దినోత్సవం వేళ కవితకు ఈడీ పంపిన స్పెషల్ గిఫ్ట్ ఏమో అన్నట్లు ఉంది. అసలు విషయానికొస్తే లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు మార్చి 8వ తేదీన ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ అయ్యారు. విచారణలో భాగంగా ఆయన... కవిత పేరు చెప్పటంతోనే ఆమెను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

ఇక కవితకు మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో... బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ షురూ అయింది. ఓ రేంజ్ లో నేతలు మాటల తుటాలు పేల్చుతున్నారు. ఇదీ కాస్త రాష్ట్ర రాజకీయాలను తెగ హీట్ ఎక్కించే దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ చర్యలు అప్రజాస్వామికమని... బీజేపీ చేస్తున్న ప్రతీకార చర్యలుగా ఆరోపిస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూపుతున్న వివక్షతను ప్రశ్నిస్తున్నందుకే ఈ తరహా చర్యలకు బీజేపీ దిగిందని. అంటోంది. ఇందుకోసం దర్యాప్తు సంస్థలను వాడుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎదుగుదలను ఎదుర్కొలేకనే ఇలాంటి చర్యలకు దిగుతోందని దుయ్యబడుతోంది భారత రాష్ట్ర సమితి.

ఇక్కడ పలు విషయాలను కాస్త లోపలికి వెళ్లి చూస్తే... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నట్లు సీన్ క్రియేట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇది బీజేపీ పన్నిన వ్యూహామని సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే.... తెలంగాణలో కేసీఆర్ బలమైన నేతగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో... తామే కేసీఆర్ కు అల్టర్నేట్ అని చెబుతోంది కాషాయ పార్టీ. కానీ గ్రౌండ్ లో చూస్తే ఆ పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న బలమైన పార్టీ తమదే అన్నట్లుగా స్పీడ్ పెంచుతోంది. ముఖ్యంగా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేయటం, లిక్కర్ కేసులో కవితను టార్గెట్ చేయటం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించేలా చూస్తోంది. ఈ క్రమంలో దూకుడుగా ముందుకెళ్లే ప్లాన్ ను బీజేపీ అమలు చేస్తున్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతోంది.

మరోసారి అదే పంథానా..?

ఇక అసలు విషయానికొస్తే... 2014 కంటే ముందు తనదైన వ్యూహాలతో కాంగ్రెస్ ను బోల్తా కొట్టించింది బీజేపీ. అందులో ముఖ్యంగా అవినీతి ఆరోపణలు సింపుల్ గా చెప్పొచ్చు. ఓ దశలో యూపీఏ సర్కార్ అంటేనే అవినీతి... అవినీతి అంటేనే యూపీఏ సర్కార్ అనే స్థాయిలో బీజేపీ ప్రచారం చేయగల్గింది. ఈ విషయంలో భారీగా సక్సెస్ అయింది. ఇందులో ముఖ్యంగా 2జీ స్కామ్...! వీటితో పాటు మరికొన్ని కుంభకోణాలను ఆయుధాలుగా మార్చుకొని... ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే..! సీన్ కట్ చేస్తే... సరిగ్గా ఈ స్ఫూర్తితోనే తెలంగాణలో కూడా ఇదే స్కెచ్ ను అమలు చేయాలని కమలనాథులు చూస్తున్నట్లు తాజా పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓ రేంజ్ లో కల్వకుంట్ల కుటుంబంపై అవినీతి ఆరోపణల దాడిని పెంచి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేలా వ్యూహాలను కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇక్కడే వారికి కవిత కేసు ప్రధాన ఆయుధంగా మారినట్లు అయిందని చెప్పొచ్చు. లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ ను నడిపించినట్లు కవితపై వస్తున్న ఆరోపణల ద్వారా.... కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులపై అవినీతి ముద్ర వేసేందుకు మరింత లైన్ క్లియర్ అయిందన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు మోదీకి ఉన్న క్లీన్ ఇమేజ్ ను కూడా కంపేర్ చేస్తూ... కేసీఆర్ ను టార్గెట్ చేసే దిశగా భారీ మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వటంతో... బీజేపీ మరింత దూకుడును పెంచేందుకు సిద్ధమైంది. ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని ప్రజల్లో రగిల్చేలా వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగానే లిక్కర్ స్కామ్ పై ఓ రేంజ్ లో చర్చ జరిగేలా చూస్తోంది. 2014 ఎన్నికల కంటే ముందు ఏ స్థాయిలో 2జీ స్ప్రెక్టమ్ అవినీతిపై చర్చ జరిగిందో... ఆ స్థాయిలో డిస్కషన్ జరిగేలా కసరత్తు చేస్తోంది. నిజానికి తెలంగాణలో చూస్తే... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తర్వాతే బీజేపీ అన్నట్లు పరిస్థితి ఉంది. పైగా ఆ పార్టీకి బలమైన నేతలు లేరు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 5 నుంచి 8 వరకు మాత్రమే ఓట్ల శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతం ఉన్నట్లు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇదే కాకుండా... ప్రజాక్షేత్రంలో కేసీఆర్ కు ధీటుగా నిలబడే నాయకుడు ఆ పార్టీ నుంచి లేకపోవటం కూడా అతిపెద్ద లోటు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను రాజకీయంగా కొట్టాలంటే బీజేపీకి ఓ మాస్టర్ ప్లాన్ అవసరం..! ఇందులో భాగంగానే కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు, ప్రజల్లో చర్చకు దారి తీసేలా చేయటం ద్వారా... అసలు కథను షురూ చేయాలని కాషాదయదళం భావిస్తోంది.

హిందుత్వ క్యాంపెయిన్ ద్వారా.. రాజకీయంగా కేసీఆర్ ను ఢీకొట్టాలంటే చాలా సమయం పడుతుందని బీజేపీకి కూడా అర్థమైంది. ఇదే సమయంలో అల్టర్నేట్ గా మరో వ్యూహాంతో కేసీఆర్ ను ఢీకొట్టాలని చూసింది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందన్న అంశాన్ని ఆధారంగా చేసుకోని అనుకున్న ప్లాన్ ను అమలు చేయాలని భావిస్తోంది. గతంలో యూపీఏ ప్రభుత్వంపై కూడా ఇలాంటి స్టాండ్ తీసుకొనే విక్టరీ కొట్టగల్గింది. అదే స్ట్రాటజీని కేసీఆర్ విషయంలో కూడా అమలు చేయాలని కమలదళం భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఛాన్స్ లేకపోలేదు…!

ఇక్కడ ఓసారి 2జీ స్పెక్ట్రమ్ కేసు చూస్తే... నాడు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఈ కుంభకోణాన్ని బీజేపీ ఎలా ఉపయోగించుకుందో గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2014 ఎన్నికలను రాజకీయంగా ఈ కేసు చాలా ప్రభావితం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత... ఈ కుంభకోణం విషయం మెల్లగా లైన్ తప్పిపోయింది. అయితే నాడు బలహీనమైన నేతగా ఉన్న మన్మోహన్ సింగ్ ను పడగొట్టేందుకు పని చేసిన ఇలాంటి అవీనితి అంశాలు... ... ఇప్పుడు తెలంగాణలో బలమైన నేతగా పేరున్న కేసీఆర్ ను ఢీకొట్టగలవా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. నిజం చెప్పాలంటే 2జీ స్కామ్ తీరుగానే... లిక్కర్ స్కామ్ ద్వారా తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు మారే అవకాశం లేకపోలేదు. ఇది ఓ వైపు ఇలా ఉంటే... మరోవైపు ఈ అంశం మొత్తం కూడా కోర్టుల వద్ద ఏదో ఒక రూపంలో క్లోజ్ అవుతుంది. అయితే అప్పటికే రాజకీయంగా జరగాల్సింది చాలా జరిగిపోతుంది. అందుకు 2జీ స్కామే పెద్ద ఎగ్జాంపుల్..! 2జీ స్కామ్ చూస్తే చివరికి ఏం జరిగిందో తెలుసు... ఎలాంటి స్కామ్ లేదు... అందరూ నిర్దోషులే అని న్యాయస్థానమే సంచలన తీర్పు ఇచ్చింది. రేపటిరోజు లిక్కర్ కేసులోనూ ఇదే జరగొచ్చు.. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం... బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం పుష్కలంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. అంతేకాదు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లబ్ధి చేకూరే ఛాన్స్ లేకపోలేదు. నాడు 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ ద్వారా బీజేపీ ఎలా లబ్ధి పొందిందో...అదే మాదిరిగా లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ద్వారా కేసీఆర్ పై రాజకీయంగా పైచేయి సాధించవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

2014 సాధారణ ఎన్నికల్లో 2జీ స్కామ్ బీజేపీకి బలమైన ఆయుధంగా మారిన సంగతి తెలిసిందే. కానీ ఎన్నికలు జరిగిన ఆరేళ్ల తర్వాత... ఎలాంటి స్కామ్ జరగలేదని తేలిపోయింది. నిజానికి ఈ కుంభకోణం ఫలితంగా 15.03 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లడమే కాదు... దేశ రాజకీయ వ్యవస్థలో అతిపెద్ద ప్రకంపనలను సృష్టించింది. యూపీఏ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతియడమే కాకుండా... తమిళనాడులోని డీఎంకే సర్కార్ కు కూడా మచ్చగా మారింది. ఈ కేసులో ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీకి కలిసొచ్చాయి. మీడియా సంస్థల సహకారంతో అతి పెద్ద మైలేజీని సొంతం చేసుకోగల్గింది కాషాయపార్టీ.

ప్రస్తుతం ఇదే పరిస్థితి ఢిల్లీ లిక్కర్ కేసులో జరుగుతుందా..? అన్న చర్చ కూడా మొదలైంది. ఈ ఆరోపణలతో ఓ రేంజ్ లో ప్రచారానికి తెరలేపటం ద్వారా... తెలంగాణలో రాజకీయంగా అవకాశాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవటంతో కేసీఆర్ చాలా సులువుగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన కుమార్తెకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాస్త టఫ్ పరిస్థితులనే ఫేస్ చేయాల్సి వస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2జీ స్కామ్ లో కాంగ్రెస్ ను దెబ్బతీసినట్లే... లిక్కర్ కేసులో కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయాలని కమలనాథులు చూస్తున్నట్లు తాజా పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది. ఏదిఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ప్రభావం పక్కగా ఉంటుందన్న చర్చ కూడా ఓ సైడ్ నుంచి వినిపిస్తోంది...!

అయితే మొత్తం పరిస్థితులను చూస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయంగా భారీ యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలను కాస్త కార్నర్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కే ఛాన్స్ కూడా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచే వేళ... కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయన్న డిస్కషన్ వినిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలపై లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనుకున్నట్లే బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? మరో 2జీ స్కామ్ మాదిరిగా మారిపోతుందా..? ఈ పరిస్థితులను అధిగమించి మరోసారి కేసీఆర్ ప్రజామోదం పొందుతారా..?లేదా...? అనేది తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే…..!

IPL_Entry_Point

సంబంధిత కథనం