Bandi Sanjay : శవాలను ఎత్తుకెళ్లే నీచమైన సర్కార్ కేసీఆర్ దే... బండి సంజయ్-no protection for women under cm kcr government says t bjp chief bandi sanjay ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  No Protection For Women Under Cm Kcr Government Says T Bjp Chief Bandi Sanjay

Bandi Sanjay : శవాలను ఎత్తుకెళ్లే నీచమైన సర్కార్ కేసీఆర్ దే... బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 05:20 PM IST

Bandi Sanjay : బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపపడ్డారు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శవాలను ఎత్తుకెళ్లే నీచమైన సర్కార్ కేసీఆర్ దే అని ఆరోపించిన ఆయన... ప్రీతి హత్య కేసుని ప్లాన్ ప్రకారం నీరుగారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని... యూపీ తరహా పాలన అందిస్తామన్న సంజయ్... మహిళలను వేధిస్తే బుల్డోజర్లతో బుద్ధి చెబుతామని అన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay : దేశంలో ఇప్పటి వరకు బంగారం, డబ్బు ఎత్తికెళ్లే దొంగలను చూశామని.... కానీ డెడ్ బాడీని ఎత్తికెళ్లే నీచమైన వాళ్లను కేసీఆర్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని... రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో మహిళలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, సీఎం బిడ్డ చేతికున్న వాచీకున్న విలువ మహిళలకు లేకుండా పోయిందన్నారు. సీఎం బిడ్డ చేతి వాచీ విలువ రూ. 20 లక్షలైతే... మెడికో విద్యార్థి ప్రీతి చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తాననడం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ‘‘నిరసన దీక్ష’’ చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జూబ్లిహిల్స్, నిర్మల్, మంథని సహా రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్. పూటకో అత్యాచారం...రోజుకో హత్య జరుగుతున్నా నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో కర్నాటకలో హిజాబ్ అంశం వస్తే మాట్లాడిన కేసీఆర్... తెలంగాణలో జరుగుతున్న ఘోరాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. యూపీలో మహిళల వైపు కన్నెత్తి చూస్తే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తారని... తెలంగాణలోనూ అదే పని చేస్తామని చెప్పారు. యూపీ తరహా పాలన తీసుకొస్తామని... మహిళల జోలికి వస్తే వాళ్ల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేశారు.

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ప్రీతి హత్య కేసును ప్రభుత్వం ప్లాన్ ప్రకారం నీరుగారుస్తోందని బండి సంజయ్ విమర్శించారు. నిందితుడిని హీరోగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశంపై అయినా ధైర్యంగా పోరాడే అమ్మాయి... రాత్రి పూట నవ్వుతూ మాట్లాడి... తెల్లవారగానే ఆత్మహత్య చేసుకుందంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రీతి చనిపోయాక డెడ్ బాడీ ఫింగర్ తో ఆమె మొబైల్ ను ఓపెన్ చేసి ఆధారాలన్నీ ధ్వంసం చేశారని ఆరోపించిన బండి సంజయ్.... ఈ రోజుకూ పీజీ వైద్య విద్యార్థిని ఎలా చనిపోయిందన్న అంశంలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు.

ప్రీతి ఎంజీఎంలోనే చనిపోయినప్పటికీ.... డెడ్ బాడీని నిమ్స్ కు తరలించి 4 రోజులపాటు ట్రీట్ మెంట్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాను వరంగల్ లో పర్యటిస్తున్నానని తెలిసి... డెడ్ బాడీని నిమ్స్ కు తరలించారని విమర్శించారు. ప్రీతి డెడ్ బాడీని తల్లిదండ్రులకు ఇవ్వలేదని... బంధువులు చివరి చూపు చూడకుండానే ఆదరబాదరాగా తీసుకెళ్లి ఖననం చేశారని విమర్శించారు. ఏ తప్పు లేకుంటే సిట్టింగ్ జడ్జితో కేసీఆర్ ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. సీఎం వ్యవహారం చూస్తుంటే... మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేసే వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.

మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా బీజేపీ పోరాడుతోందని... అండగా ఉంటూ భరోసా ఇస్తోందని బండి సంజయ్ చెప్పారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నామని... వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతోపాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని చెప్పుకొచ్చారు. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పాలని మహిళలు నిర్ణయించుకున్నారన్న ఆయన.... బీజేపీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మహిళలు ఉన్నరాని పేర్కొన్నారు. వాళ్లకు భరోసా ఇచ్చేందుకు ఈ నిరసన దీక్ష చేపట్టామని తెలిపారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్. విఠల్, ఎన్వీ సుభాష్, రాణి రుద్రమదేవి తదితరులు దీక్షకు హాజరై ప్రసంగించారు. వివిధ సంఘాల నేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. పలు విద్యార్థి, యువజన, మహిళా, ప్రజా, న్యాయ వాదుల సంఘాల నాయకులు బండి సంజయ్ ను కలిసి మద్దతు ప్రకటించారు.

WhatsApp channel