T BJP With Amit Shah : అమిత్ షా, నడ్డాతో టీ బీజేపీ భేటీ.. ఏ అంశాలపై చర్చించారంటే ?-telangana bjp leaders meet amit shah and jp nadda in delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Bjp Leaders Meet Amit Shah And Jp Nadda In Delhi

T BJP With Amit Shah : అమిత్ షా, నడ్డాతో టీ బీజేపీ భేటీ.. ఏ అంశాలపై చర్చించారంటే ?

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 05:22 PM IST

T BJP With Amit Shah : తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమత్ షా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలతో చర్చించారు. ప్రజా తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేశారు.

అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు
అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు

T BJP With Amit Shah : కేంద్ర మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో... మంగళవారం (ఫిబ్రవరి 28) హస్తినకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు.. ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా, నడ్డాతో చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా... రాష్ట్రంలో పార్టీ ఆధ్వర్యంలో చేపడుతోన్న కార్యక్రమాలు, ప్రజల స్పందనపై అమిత్ షా ఆరా తీశారు. టీ బీజేపీ నేతల అభిప్రాయాలు తెలుకున్న షా.. రాబోయే ఎన్నికలకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు.

కేవలం బీజేపీ వ్యవహారాలకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు కావడం... ఈ కేసులో తర్వాత అరెస్టు అయ్యేది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.... షా, నడ్డాలతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బండి సంజయ్, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, విజయ శాంతి సహా పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్... రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో తాము చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. 119 నియోజకర్గాల్లో ప్రజా గోస కార్యక్రమాలు నిర్వహించామని.. రాష్ట్రంలో త్వరలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. బహిరంగ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. ఈ సందర్భంగా... ఢిల్లీ లిక్కర్ కేసుపై స్పందించిన బండి సంజయ్... ఈ కేసుకి, బీజేపీ సంబంధం లేదని అన్నారు. మద్యం కుంభకోణం కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోందని... దోషులను తేల్చుతుందని పేర్కొన్నారు. ఈ కేసు ఛార్జిషీట్‌లో కవిత పేరును సీబీఐ 4 సార్లు పేర్కొందన్న ఆయన... పేరు ప్రస్తావించినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టుకి... తెలంగాణ బీజేపీ రాజకీయాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులు లేరన్నది బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారమన్నారు బండి సంజయ్. తమ పార్టీకి 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రజలు భావిస్తున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఫలితాలే ప్రజల ఆలోచనకు నిదర్శనమని వివరించారు. రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 300 సీట్లు దాటిందని చెప్పుకొచ్చారు.

IPL_Entry_Point