Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. విచారణకు హాజరైన ఆయనను ఆదివారం అదుపులోకి తీసుకుంది.
Manish Sisodia Arrested - Delhi Liquor Policy Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన నేత మనీశ్ సిసోడియా(Manish Sisodia)ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో విచారణకు ఆదివారం (ఫిబ్రవరి 26) ఉదయం సీబీఐ ముందు హాజరయ్యారు సిసోడియా. సుమారు 8 గంటలకుపైగా విచారించిన తర్వాత ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 అమలులో జరిగిన అవినీతిలో సిసోడియాకు సంబంధం ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఆ మద్యం పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే ఆ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై కొన్ని నెలలుగా సీబీఐ విచారణ చేస్తోంది. ఇప్పటి వరకు కొందరిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అదుపులోకి తీసుకుంది. రేపు (సోమవారం) ఉదయం కోర్టు ముందు ఆయనను హాజరుపరచనుంది.
విచారణకు వెళ్లే ముందే.. తాను అరెస్ట్ అవుతానంటూ నేటి ఉదయం సిసోడియా చెప్పారు. తాను కొన్ని నెలలు జైలులో ఉండాల్సి వస్తుందని అన్నారు. జైలుకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీని కోరారు.
డర్టీ పాలిటిక్స్ ఇవి..
Manish Sisodia Arrested: మనీశ్ సిసోడియా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఆయన అమాయకుడని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. “మనీశ్ సిసోడియా.. అమాయకుడు. నీచ రాజకీయాల్లో (డర్టీ పాలిటిక్స్) భాగమే ఆయన అరెస్టు. ఆయన అరెస్టు కారణంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతీ ఒక్కరు దీన్ని చూస్తున్నారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. దీనికి వారు ప్రతిస్పందిస్తారు. మా స్ఫూర్తిని ఇది మరింత పెంచుతుంది. మా పోరాటం మరింత పటిష్టమవుతుంది” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన రెండో మంత్రి సిసోడియా. ఇప్పటికే ఈ కేసులో ఆమ్ఆద్మీ మంత్రి సత్యేంద్ర జైన్ గతేడాది అరెస్ట్ అయ్యారు.
ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: ఆమ్ఆద్మీ
Manish Sisodia Arrested: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టుపై ఆమ్ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్ డే అని పేర్కొంది. “ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్ డే. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ప్రపంచ అత్యున్నత విద్యా మంత్రి సిసోడియాను ఫేక్ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. రాజకీయ శత్రుత్వంతో బీజేపీ ఈ అరెస్టుకు పాల్పడింది” అని ఆమ్ఆద్మీ పేర్కొంది.
పటిష్టమైన భద్రత
సిసోడియా అరెస్టుతో ఆమ్ఆద్మీ పార్టీ నిరసనలు చేసే అవకాశం ఉందన్న అంచనాలతో ఢిల్లీలో పోలీసులు, కేంద్ర బలగాలతో కేంద్రం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. ఉదయం సీబీఐ కార్యాలయానికి సిసోడియా ర్యాలీగా వెళ్లిన సమయంలోనే ఆమ్ఆద్మీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, ఇప్పటికే కొందరు ఆప్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరిన్ని రాష్ట్రాల లింకులను కూడా సీబీఐ బయటపెట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను కూడా సీబీఐ గతంలో ప్రశ్నించింది. తెలంగాణలోనూ ఈ కేసు రాజకీయ దుమారం రేపుతోంది.
సంబంధిత కథనం