ED Notices to Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు-ed summons telangana cm kcr s daughter k kavitha in delhi excise policy case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Summons Telangana Cm Kcr's Daughter K Kavitha In Delhi Excise Policy Case

ED Notices to Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 11:02 AM IST

ED Notices to Kavitha ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలో విచారనకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం రామచంద్ర పిళ్ళై అరెస్ట్ కాగా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు.

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు  ఈడీ నోటీసులు
బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు (Mohammed Aleemuddin )

ED Notices to Kavitha ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది మార్చి 9 గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో మంగళవారం అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ సందర్భంగా కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

లిక్కర్ స్కామ్‍లో 11 మంది అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ కవితకు పిళ్లై బినామీ అని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. పిళ్లై తాను కవిత ప్రతినిధినని దర్యాప్తులో వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కవిత ఆదేశాల మేరకే పిళ్లై పనిచేశాడని ఈడీ రిపోర్ట్‌లో పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన పిళ్లై, ఇండోస్పిరిట్ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు.

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. గురువారం విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది.

మద్యం వ్యాపారాల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌‌లో కవిత పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో కవిత తరపున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులోనే గతేడాది డిసెంబర్‌ 11న కవితను ఆమె ఇంటివద్దే సీబీఐ అధికారులు విచారించారు. దాదాపు ఏడున్నర గంటలపాటు వివిధ అంశాలపై కవితను ప్రశ్నించారు. తాజా ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

సౌత్‌గ్రూప్‌లో కవిత కూడా భాగస్వామి…

వ్యాపారవేత్త పిళ్లైకి సంబంధించి, కవిత, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ఉన్న 'సౌత్ గ్రూప్కు అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి మరియు బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని ఈడీ అభియోగాల్లో పేర్కొంది. పిళ్లైతో పాటు ఇతర వ్యక్తులతో కుట్ర పన్నారని పాలసీలో కీలకమైన కార్టెల్ ఏర్పాటులో చురుకుగా సహకరించాడని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్‌ నుండి ఆమ్‌ ఆద్మీకి 100 కోట్ల వరకు లంచాలు చెల్లించారని ఆరోపించారు. ఈ గ్రూప్‌ ద్వారా కనీసం రూ.296.2 కోట్ల రుపాయల అక్రమ వ్యాపారాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది.

ఇండో స్పిరిట్స్, దాని వ్యాపార భాగస్వామ్య సంస్థ, అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్, ఇండోస్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నాయని, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు రాఘవ మాగుంట ల బినామీ పెట్టుబడులకు అరుణ్ పిళ్లై మరియు ప్రేమ్ రాహుల్ ప్రాతినిధ్యం వహించారని ఈడీ అభియోగాల్లో పేర్కొంది.

ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని, లైసెన్సు ఫీజును మినహాయించడం, తగ్గించడం చేశారని, ఎల్-1 లైసెన్స్‌ను సంబంధిత అధికారి అనుమతి లేకుండా పొడిగించారని ఈడీ, సిబిఐలు ఆరోపించాయి. దీని వల్ల "అక్రమ" లాభాలను పొందడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు చెల్లించారని పేర్కొంది.

సమయం కోరిన ఎమ్మెల్సీ కవిత…

మరోవైపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత గడువు కోరినట్లు తెలుస్తోంది. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున మార్చి 9న విచారణకు హాజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. 33% మహిళా రిజర్వేషన్ల కోసం ఈనెల 10న ఢిల్లీలో కవిత ధర్నా చేపట్టనున్నారు. - ధర్నా కార్యక్రమం తర్వాత విచారణకు హాజరవుతారని ఈడీ అధికారులకు కవిత చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసులపై ట్విట్టర్‌ వేదికగా కవిత స్పందించారు. ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చిందని, చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటానని వివరించారు. - ప్రజా వ్యతిరేకత, అణచివేత చర్యలకు తెలంగాణ ఎప్పుడూ తలవంచదని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

IPL_Entry_Point