Analysis: ఈశాన్యంలో బలపడిన బీజేపీ-how bjp won in northeast political analysis from peoples pulse analyst murali krishna sharma ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Analysis: ఈశాన్యంలో బలపడిన బీజేపీ

Analysis: ఈశాన్యంలో బలపడిన బీజేపీ

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 01:02 PM IST

‘త్రిపురలో బీజేపీ 2018 ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. అది బలం కాదని వాపు లాంటిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ వాదన కొంతమేర తప్పని ఆ పార్టీ ఇప్పుడు రుజువు చేసుకోగలిగింది..’ అని అంటున్నారు పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ. ఈశాన్యంలో కమల వికాసంపై ఆయన విశ్లేషణ

మూడు ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపు అనంతరం ప్రధానిని సన్మానిస్తున్న అమిత్ షా, జేపీ నడ్డా
మూడు ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపు అనంతరం ప్రధానిని సన్మానిస్తున్న అమిత్ షా, జేపీ నడ్డా (JP Nadda Twitter)

భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ దళం వృక్షం వేళ్లు బలపడుతున్నాయి. గురువారం వెలువడిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి విజయ ఢంకా మోగించింది. మేఘాలయాలో రెండు స్థానాలు సాధించింది. ఈ ఫలితాల్లో త్రిపుర రాష్ట్రంలో బీజేపీ విజయం ప్రత్యేకం. 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికే లేని బీజేపీ అస్సాం తర్వాత ఇప్పుడు త్రిపురలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది.

సైద్ధాంతికంగా వైరుధ్యమైన వామపక్షాల చేతిలో పాతిక సంవత్సరాలు ఉన్న త్రిపురలో బీజేపీ 2018 ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం బలం కాదని వాపు లాంటిదని ఆ పార్టీతో విభేదించే చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఆ వాదన కొంతమేర తప్పని ఆ పార్టీ ఇప్పుడు రుజువు చేసుకోగలిగిందని చెప్పవచ్చు.

పీపుల్స్ పల్స్ అంచనాలు నిజమయ్యాయి..

ఎన్నికల ముందు ఈ మూడు రాష్ట్రాల్లో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెలువడిన అంచనాలే ఫలితాల్లో కూడా ప్రస్పుటమయ్యాయి. త్రిపురలో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి అధికారానికి చేరువవుతుందని సంస్థ సర్వేలో తేలింది. సంస్థ అంచనాకు దగ్గరగానే బీజేపీ మెజార్జీ కంటే కేవలం రెండు స్థానాలు అధికంగా పొంది గట్టెక్కింది. ఇక్కడ మరో విశేషం కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని జాతీయ చానళ్ల సర్వేలో తేలితే పీపుల్స్‌ పల్స్‌ ముందే చెప్పినట్టు కాంగ్రెస్‌ మూడు స్థానాలు సాధించింది. సీపీఎం 11 స్థానాలు, తిప్రా మోతా పార్టీ 19.7 శాతం ఓట్లతో 13 స్థానాలు సాధించడం కూడా పీపుల్స్‌ పల్స్‌ అంచనాలకు దగ్గరగానే ఉన్నాయి.

గత ఎన్నికల్లో బీజేపీ, ఐపిఎఫ్‌టి కూటమి 43 స్థానాల్లో గెలవగా వాటిలో బీజేపీ 43.95 శాతం ఓట్లతో 36 స్థానాలు పొందింది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ 38.97 శాతం ఓట్లతో 32 స్థానాలు గెలవగా ఐపిఎఫ్‌టి ఒక స్థానానికే పరిమితమైంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజీపీ నాలుగు స్థానాలు కోల్పోగా, ఐపిఎఫ్‌టి మాత్రం ఆరు స్థానాలను నష్టపోయింది. బీజేపీ కూటమిని భారీగా దెబ్బతీసింది తిప్రా మోతా పార్టీ. గిరిజనులతో కూడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్‌తో ఏర్పడిన తిప్రా మోతా ట్రైబల్‌ ప్రాంతాలలో పట్టు నిలుపుకుంది.

35 సంవత్సరాలు రాజ్యమేలిన సీపీఎం వరుసగా రెండో సారి చతికిలపడింది. గత ఎన్నికల్లో సీపీఎం 42.22 శాతం ఓట్లతో 16 స్థానాలు సాధించగా, ఇప్పుడు కేవలం 24.6 శాతం ఓట్లతో 11 స్థానాలకు తగ్గిపోయింది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన అస్సాంలో ఇదివరకే పట్టు నిలపుకున్న బీజేపీ ఇప్పుడు త్రిపురలో కూడా రెండోసారి అందలమెక్కడం వెనుక అనేక బలమైన కారణాలున్నాయి. త్రిపురలో 2018లో మొదటి సారి అధికారం చేపట్టిన బీజేపీ 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో, 2021 స్థానిక ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకుంటూ 2023 ఎన్నికల్లో కూడా విజయపరంపర కొనసాగించింది.

ఎన్నికల ముందు బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ నేతృత్వంలో శాంతి భద్రతలు క్షీణించడం, ఆయచ చేసే వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీలో అనైక్యత వంటి ప్రతికూలతలను గుర్తించిన బీజేపీ ముందుగానే జాగ్రత్తపడి కుమార్‌దేబ్‌ స్థానంలో వివాదరహితుడైన మాణిక్‌ సాహాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే ఎన్నికలను ఎదుర్కోవడం మాణిక్‌ సాహాకు సవాలుగా మారింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడడం, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవడం ఆయనకు క్లిష్టంగానే మారింది. వీటికి తోడు నూతనంగా ఆవిర్భవించిన గిరిజన పార్టీ తిప్రా మోతా నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది.

ఇదే సమయంలో బీజేపీ మిత్రపక్షమైన గిరిజన పార్టీ ఐపిఎఫ్‌టి బలహీనపడింది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడ్డ సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా బెంగాలీ ఓటర్లున్న ప్రాంతాలలో ప్రభుత్వ వ్యతిరేకతపై పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అన్నివైపుల నుండి ఒత్తిడులను ఎదుర్కొన్న బీజేపీ స్థానికంగా ఎక్కడికక్కడ ప్రత్యేక వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగడంతో వరుసగా రెండోసారి రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేసింది. పీపుల్స్‌ పల్స్‌ క్షేత్రస్థాయి అధ్యయనంలోని పలు అంశాలను పరిశీలిస్తే ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించడం కనిపిస్తుంది.

వీటిని పరిశీలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయాలు కొత్త పుంథాను తొక్కుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడి యువత ప్రధాన జీవన స్రవంతిని కోరుకుంటూ, వారు దేశంలోని ఇతర ప్రాంతాలతో సమ ప్రాధాన్యతను కోరుకుంటున్నారని పీపుల్స్‌పల్స్‌ పరిశీలనలో తెలింది. ఈశాన్య భాగం కూడా దేశంలో ఒక ప్రధాన భాగం కావాలని వారు ఆరాటపడుతున్నారు. వీరి ఆశయాలకు బీజేపీ ఒక ఆశాజనకంగా కనిపించడం ఆ పార్టీ విజయానికి తోడ్పడింది.

ఆర్థికంగా బలపడాలనే ఆకాంక్షతో పాటు సాంస్కృతిక పరిరక్షణ తపన కూడా ప్రజల్లో కనిపించింది. రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో ఒక సమూలమైన మార్పును వారు కోరుకుంటున్నట్టు అది బీజేపీతో సాధ్యమవుతుందని వారు భావిస్తున్నట్టు పీపుల్స్‌పల్స్‌ పరిశీలనలో తేలింది. గతంలో వామపక్షాల పాలనలో నాయకుల ఒంటెత్తు పోకడలను ప్రజలు ఇంకా మర్చేపోలేదు. సీపీఎం పార్టీ వారి కార్యక్రమాల్లో పాల్గొనడం, చందాలు ఇవ్వడం తప్పనిసరిగా ఉండేది. బీజేపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ఈ ఇబ్బందుల నుండి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. వారి ఈ నిర్బంధాలు కూడా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను కనిపించకుండా చేశాయి.

మహారాజా ప్రద్యోత్‌ మాణిక్య దేబ్‌ బర్మ సారథ్యంలో ఆవిర్భవించిన తిప్రా మోతా ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ఏర్పాటుతో పోటీ చేసిన ఈ పార్టీ ఆ ప్రాంతాలలో తన పట్టు నిలబెట్టుకుంది. గిరిజనుల ప్రాంతాలలో శాంతిభద్రతల సమస్యలొస్తాయని భయపడినా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. పాలకపార్టీ బీజేపీకి భవిష్యత్తులో వీరి నుండి పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

సీపీఎంకు కోలుకోలేని దెబ్బ

ప్రభుత్వ వ్యవతిరేకతను తమను అందలమెక్కిస్తుందని ఆశించిన సీపీఎంకు ఓటమి కోలుకోలేని దెబ్బే. రెండు ఎన్నికల్లో వరుసగా ఓటమితో కామ్రెడ్‌లు నిరుత్సాహానికి లోనయ్యారు. సైద్ధాంతిక వైరుధ్యమున్న సీపీఎంను రాష్ట్రంలో ఇప్పటికే బలహీనపరిచిన బీజేపీ ఇకపై కూడా ఆ పార్టీని తొక్కేయడానికి ఎంతకైనా ముందుకెళ్తుంది. పీపుల్స్‌ పల్స్‌ తన సర్వేలో అంచనా వేసినట్టే కాంగ్రెస్‌తో జతకట్టినా సీపీఎంకు భంగపాటు తప్పలేదు.

రెండో మారు అధికారం కోల్పోయిన సీపీఎం మళ్లీ కోలుకోవాలంటే మూలాల నుండి కష్టపడాల్సిందే. నూతన తరంతో కలిసేపోయే విధంగా, వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా పార్టీలో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. 2016 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ చేతిలో పరాజయం పొందిన సీపీఎం-కాంగ్రెస్‌ కూటమి మరోమారు ఇక్కడ చతికిలపడడంతో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వీరి పొత్తుపై నీలినీడలు కమ్ముకుంటాయి. ఇక కాంగ్రెస్‌ విషయానికొస్తే ఈ ఓటమి ఆ పార్టీకి త్రిపురతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కోలుకోలేని దెబ్బే. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రభావం ఈ మూడు రాష్ట్రాల్లో శూన్యం. కాంగ్రెస్‌ను పాత తరం పార్టీగా భావిస్తున్న యువ కార్యకర్తలు నూతన పార్టీలవైపు చూస్తునట్టు పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో, ఫలితాల్లో ప్రస్పుటమయ్యింది.

దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని కంకణం కట్టుకున్న కాషాయ పార్టీ పాచికలు పారి ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఫలప్రదం అవుతున్నాయని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ఒరవడిని పరిశీలిస్తే అక్కడి ప్రజలు నూతన జీవన స్రవంతిని కోరుకుంటున్నట్టు సూచిస్తున్నాయి. ప్రజల నాడిని పట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ లక్ష్యాలను ఛేదిస్తుందనేని త్రిపుర ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ

(ఇక్కడి విశ్లేషణ, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం..)

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్