BRS MLC Candidates : దేశపతి శ్రీనివాస్ కి ఎమ్మెల్సీగా అవకాశం.. మరో ఇద్దరి పేర్లు ప్రకటించిన బీఆర్ఎస్-cm kcr announces brs candidates for mla quota mlc elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Announces Brs Candidates For Mla Quota Mlc Elections

BRS MLC Candidates : దేశపతి శ్రీనివాస్ కి ఎమ్మెల్సీగా అవకాశం.. మరో ఇద్దరి పేర్లు ప్రకటించిన బీఆర్ఎస్

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 05:13 PM IST

BRS MLC Candidates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

BRS MLC Candidates : రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.. బీఆర్ఎస్ పార్టీ. ఈ కోటాలో ఖాళీ అవుతోన్న 3 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డిలను ఖరారు చేశారు. మార్చి 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు

ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం పూర్తవనుంది. ఈ స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు.. ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 13 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 14న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఇచ్చారు. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి లెక్కించి... విజేతను ప్రకటిస్తారు. మార్చి 25 లోగా ఎన్నికలను పూర్తి చేస్తారు.

ఈ నేపథ్యంలోనే... ఖాళీ అవుతోన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్. నవీన్ కుమార్ కి మరోసారి అవకాశం కల్పించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. దేశపతి శ్రీనివాస్ కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన నాయకుడు... కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డికి అవకాశం కల్పించారు. గతేడాది డిసెంబర్ లో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా.. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక.... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు. మార్చి 9న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనున్న విషయం తెలిసిందే.

IPL_Entry_Point