Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ అరెస్ట్…-cbi arrests hyderabad based chartered accountant in delhi excise policy case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cbi Arrests Hyderabad-based Chartered Accountant In Delhi Excise Policy Case

Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ అరెస్ట్…

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 09:43 AM IST

Delhi liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన పలువురిని సిబిఐ అరెస్ట్‌ చేయగా తాజాగా నగరానికి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. బుచ్చిబాబు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితక వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేశారు. ఈ కేసులో కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం‌ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు (ఫైల్‌)
ఢిల్లీ లిక్కర్‌ స్కాం‌ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు (ఫైల్‌) (ANI)

Delhi liquor Scam ఢిల్లీలిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన మరొకరిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరబిందో శరత్ చంద్రా రెడ్డితో పాటు రామచంద్ర పిళ్లై, సమీర్ మహింద్రు వంటి వారిని ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చి బాబును సిబిఐ అదుపులోకి తీసుకుంది.

గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది.

లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో పలుమార్లు సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐలు గోరంట్ల బుచ్చిబాబును కూడా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రముఖులకు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్న బుచ్చిబాబును ప్రశ్నించిన సమయంలోనే అతని నివాసం నుంచి హార్డ్‌ డిస్క్‌లతో పాటు కీలక సమాచారాన్ని సిబిఐ సేకరించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేసినట్లు సిబిఐ బుధవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అనుమానిస్తోంది. కేసు విచారణలో భాగంగా బుచ్చిబాబును ఢిల్లీ పిలిపించిన సిబిఐ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. విచారణ సందర్భంగా బుచ్చిబాబు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారని, ఉద్దేశపూర్వకంగా నిజాలను దాచి పెడుతున్నారని సిబిఐ అనుమానిస్తోంది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంతో పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సిబిఐ భావిస్తోంది.

2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం బుచ్చిబాబు పనిచేశారని సిబిఐ అనుమానిస్తోంది. పాలసీ తయారు చేయడంతో పాటు మద్యం దుకాణాల కేటాయింపు, వేలంలో వ్యాపారాలను దక్కించుకోవడంలో అతను కీలకంగా వ్యవహరించినట్లు సిబిఐ భావిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్‌ మద్యం వ్యాపారులు, లైసెన్సుదారులకు అక్రమంగా భారీగా లబ్ది చేకూర్చడంలో బుచ్చిబాబు పాత్ర ఉందని చెబుతున్నారు.

బుచ్చిబాబును గురువారం కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తెను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక తనను టార్గెట్ చేశారని చెబుతున్నారు. తాజాగా బుచ్చిబాబును అరెస్ట్‌ చేయడంతో ఈ కేసులో నెక్స్ట్ టార్గెట్ ఎవరనే చర్చ మొదలైంది.

IPL_Entry_Point