Khammam Floods : భారీ వరదలతో ఖమ్మం ఉక్కిరిబిక్కిరి.. ప్రధానమైన 10 సంఘటనలు ఇవీ..!
Khammam Floods : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు మున్నేరు వాగు మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఖమ్మం వాసులు భయాందోళనలో ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఓవైపు వర్షం.. మరోవైపు అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఖమ్మం ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. భారీ వర్షాల కారణంగా.. ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రకాష్ నగర్‌లో 9 మంది వరదల్లో చిక్కుకున్నారు. అటు మన్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదని ఖమ్మం వాసులు వాపోతున్నారు.
1.ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంపై వరుణుడు పంజా విసిరాడు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో వరదల్లో చిక్కుకొని మహిళ మృతి చెందింది. మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన పద్మావతి (34) అనే మహిళ మృతి చెందింది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపడితే.. పద్మావతి బతికేదని స్థానికులు చెబుతున్నారు.
3.ఖమ్మం పట్టణంలో కరుణగిరి సాయికృష్ణ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఓ కుటుంబం వరదల్లో చిక్కుకుంది. వారిలో ఐదుగురు పిల్లలు, ఒక వికలాంగుడు, ఐదుగురు పెద్దవాళ్లు ఉన్నారు. వరద నీరు మొదటి ఫ్లోర్ నిండి సెకండ్ ఫ్లోర్ సగానికి వచ్చాయి. నీళ్లు రెండో ఫ్లోర్ వరకు రావడంతో స్లాబ్ ఎక్కి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
4.మంత్రి తుమ్మలకు చెదు అనుభవం ఎదురైంది. ప్రకాష్ నగర్ వద్ద చిక్కుకున్న 9 మందిని రక్షించకపోవడంతో.. తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
5.వరదల్లో ఉన్నవారిని కాపాడలేదు అంటూ.. ఖమ్మం మంత్రులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నా.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా.. మంత్రులు ఎక్కడ ఉన్నారని నిలదీశారు.
6.ప్రకాష్ నగర్‌లో చిక్కుకున్న వరద బాధితులు ఎట్టకేలకు బయటకు వచ్చారు. వారి బంధువులు డబ్బులు వెచ్చించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. తమను కాపాడిన బంధులకు బాధితులు కృతజ్ఞతలు చెప్పారు.
7.ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై విమర్శలు పెరిగాయి. తమ కుటుంబానికి చెందిన వారు వరదల్లో చిక్కుకుంటే ఇలాగే వదిలేస్తారా అని వరద బాధితుల బంధువు ప్రశ్నించారు. రెండ్రోజులుగా కరెంటు లేదని.. తాము ఎలా ఉండాలని ప్రశ్నించారు.
8.పాలేరు వరదల్లో చిక్కుకున్న వారికి కాపాడలేకపోతున్నా.. ఆ భగవంతుడే వాళ్లని కాపాడాలి అంటూ మంత్రి పొంగులేటి కంటతడి పెట్టుకున్నారు. తన నియోజకవర్గం పాలేరులో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం.. వరదలో కొట్టుకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు.
9.ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. అనేక తండాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్నో ఊర్లలో కరెంటు పోయింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు ఉన్నారు.
10.ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లలోకి వరద నీరు వచ్చింది. ఇక బస్సులు నడిచే పరిస్థితి లేదు. వరదలతో.. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని అనేక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.