Hyderabad Floods: దటీజ్ హైదరాబాదీ.. కారు వరదల్లో కొట్టుకుపోకుండా తాడుతో కట్టేశాడు!
Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హైదరాబాదీ వీధులు కాల్వలను తలపిస్తున్నాయి. కూడళ్లు చెరువులు, కుంటలుగా మారాయి. చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఆ వరదలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఆ వరదల నుంచి తన కారును కాపాడుకోవడానికి ఓ వ్యక్తి తాడుతో కట్టేశాడు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్.. వర్షంలో తడిసి ముద్దవుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి భాగ్యనగరం జలమయం అయ్యింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరదల్లో వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో కార్లు గల్లంతయ్యాయి. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో వాహనాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ వాహనాలను కాపాడుకోవడం ఛాలెంజ్‌గా మారిందని హైదరాబాదీలు వాపోతున్నారు.
తాడుతో కారును కట్టేసి..
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో తన కారు కొట్టుకుపోతుండా తాడుతో కట్టేశాడు. వెనక డోర్ అద్దం నుంచి ముందు డోర్‌కు తాడు కట్టి.. దాన్ని తన ఇంటికి గట్టిగా కట్టాడు. దీంతో వరదలో తన కారు కొట్టుకుపోలేదు. కానీ.. వరద నీటిలో మునిగిపోయింది. రిపేర్ ఖర్చులు ఎంత అవుతాయో తెలియదు కానీ.. కనీసం కారు అయినా మిగిలిందని సదరు వ్యక్తి సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుంది.
వరదలో కొట్టుకుపోయి..
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి.. ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకోని ఉన్న గోడ కూలడంతో.. అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి వద్ద విషాదం జరిగింది. విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు.
జల దిగ్భంధంలో పార్శిగుట్ట..
భారీ వర్షాలకు రాంనగర్‌లో వరదలు వచ్చాయి. ఈ వరదలో ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన స్థానిక యువకులు కోట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. మరోవాపు సికింద్రాబాద్ పార్శిగుట్ట ఏరియాను వరద నీరు ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లలోని వరద నీరు చేరింది. దీంతో పార్శిగుట్టు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ బృందం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
అప్రమత్తమైన జలమండలి..
భాగ్యనరగంలో భారీ వర్షాల నేపథ్యంలో.. జల మండలి అప్రమత్తమైంది. సంస్థ ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ..ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని.. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సీవరేజి ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి ఫోన్ చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.