TG Electric Buses: ఆగస్ట్‌ 18న రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు, కరీంనగర్‌‌ రీజియన్‌కు 70 బస్సులు-electric buses to hit the roads on august 18 70 buses for karimnagar region ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Electric Buses: ఆగస్ట్‌ 18న రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు, కరీంనగర్‌‌ రీజియన్‌కు 70 బస్సులు

TG Electric Buses: ఆగస్ట్‌ 18న రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు, కరీంనగర్‌‌ రీజియన్‌కు 70 బస్సులు

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 01:01 PM IST

TG Electric Buses: నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసి మార్పులు చేస్తూ ప్రయాణికుల సేవలో తరిస్తూ ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమైంది. ఇంధనం ఖర్చు తగ్గించుకుని ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యింది.

కరీంనగర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
కరీంనగర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు

TG Electric Buses: ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కరీంనగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు 70 బస్సుల్ని కేటాయించారు. అందులో తొలి విడతగా కరీంనగర్ -2 డిపోకు 33 బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు చేరుకున్నాయి. ఈ వారంలోనే ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సంస్థ మరింత నష్టాల్లోకి చేరుకుంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం నష్టాలను పూడ్చుకునే పనిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా రాష్ట్రంలోని కొన్ని డిపోలను మెజర్స్ జేబీఎం అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని డిపోలను ప్రైవేట్ పరం చేసే పనిలో నిమగ్నమైంది.

ఇందులో భాగంగా కరీంనగర్- 2 డిపోతో పాటు నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యపేట, హైదరాబాద్-2 డిపోలను ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అద్దెకు ఇచ్చి ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు జేబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈక్రమంలో కరీంనగర్- 2 డిపోకు 33 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకోవడంతో వాటిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యింది.

ఆర్టీసీ 2 డిపో ప్రైవేట్ పరం

రాష్ట్రంలోమొట్టమొదటిసారిగా కరీంనగర్ -2 డిపో ప్రైవేట్ పరం కానుంది. రెండవ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపించేందుకు మేజర్స్ జేబీఎం సంస్థ ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగా ఇప్పటికే డిపోకు 33 ఎలక్ట్రికల్ బస్సులు చేరుకున్నాయి.

రెండవ డిపో నుంచి ప్రస్తుతం ఆర్టీసీ 53 సొంత, 52 అద్దె బస్సులు ఆపరేట్ చేస్తుంది. 360 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిపోను ప్రైవేట్ పరం చేస్తుంటంతో కండక్టర్లు మినహా మిగతా ఉద్యోగులను ఇతర డిపోల్లోకి కేటాయిం చేందుకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. కాగా సదరు డిపోలో పనిచేస్తున్న సిబ్బంది స్థాన చలనంపై అయోమయంలో ఉన్నారు.

14 చార్జింగ్ పాయింట్లు...3 ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు

కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు వస్తుండడంతో అధికారులు మౌలిక వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించారు. డిపోలో ఇప్పటికే 11కేవీ విద్యుత్ లైన్లు, 14 చార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్లు బిగించే పనిలో నిమగ్నమయ్యారు.

కరీంనర్ రీజియన్ పరిధి నుంచి 70 ఎలక్ట్రిక్ బస్సులు వివిధ రూట్లల్లో నడిపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ రూట్లోకి వెళ్లే ఎలక్ట్రిక్ బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ - జేబిఎస్ 33 బస్సులు, కరీంనగర్ -సిబిఎస్ ఆరు, కరీంనగర్ - గోదావరిఖని 9, కరీంనగర్ - మంథని 4, కరీంనగర్ - కామారెడ్డి 6, కరీంనగర్ - జగిత్యాల 6, కరీంనగర్ -సిరిసిల్ల 6 బస్సులు తిప్పనున్నారు. ఈనెల 18న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పాన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రెండవ డిపో నుంచి ప్రస్తుతం ఆర్టీసీ 53 సొంత, 52 అద్దె బస్సులు ఉన్నాయి. రీజియన్ నుంచి 70 బస్సులను వివిధ రూట్లల్లో నడిపించేందుకు సన్నాహాలు చేపట్టామని అందులో కరీంనగర్ -2 డీపో నుంచే 33 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని ఆర్టీసీ ఆర్ఎం సుచరిత తెలిపారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)