TG Loan Waiver : రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందొద్దు, వెరిఫై చేసి రుణమాఫీ చేస్తాం - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
TG Loan Waiver : తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే కొందరు రైతుల రుణాలు మాఫీకాకపోవడంతో.. ఆందోళన చెందుతున్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి తుమ్మల తెలిపారు.
TG Loan Waiver : రైతు రుణమాఫీ అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ అందని రైతుల ఖాతాల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, మేమే వెరిఫై చేసి రుణమాఫీ చెల్లిస్తామన్నారు. అయితే రూ.2 లక్షలకు పైగా అప్పు ఉన్న వాళ్లు మిగతా అప్పు చెల్లిస్తే చాలని, రూ.2 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కటాఫ్ తేదీ వరకు డేట్ వరకు రూ.2 లక్షల వరకు తీసుకున్న రైతు రుణాల జాబితాను అన్ని బ్యాంకుల నుంచి సేకరించామన్నారు. బ్యాంకుల సమాచారం మేరకు రుణమాఫీ చేస్తున్నారు. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే ఆందోళన వద్దని, రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతుల సమాచారం మరోసారి చెక్ చేసి బ్యాంకులకు చెల్లిస్తామన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే కొందరు రైతుల రుణాలు మాఫీకాకపోవడంతో.. ఆందోళన చెందుతున్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి తుమ్మల తెలిపారు. త్వరలోనే రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ అవుతాయన్నారు. కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరన్నారు. గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందన్నారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందన్నారు.
ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ
కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా రుణమాఫీ చేపట్టిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ అంశంతో ముందుకెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మూడు విడతల్లో మాఫీ చేస్తున్నామన్నారు. రైతులకు పాస్‌బుక్ లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణాలు మాఫీ కాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, సాంకేతిక కారణాలతో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. వాటిని వెరిఫై చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. ఆగస్టు 15న మూడో విడతగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
రుణమాఫీ అవాస్తవాలు ప్రచారం
రుణమాఫీపై కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారమని మంత్రి తుమ్మల మండిపడ్డారు. రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలంటూ కొందరు అడుగుతున్నారని, ఆ నేతలు గతంలో అదే వాట్సాప్ ద్వారా రుణమాఫీ వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుండేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండాయని హర్షం వ్యక్తం చేశారు. గోదావరి బేసిన్ లో కొంత లోటు ఉందని, ఇంకా వర్షాలు కురుస్తాయని, ఆ లోటు తీరుతుందన్నారు. వర్షాలు బాగా పడడంతో అన్ని పంటలు వేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు లోటు లేకుండా సరఫరా చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన యూరియా, డీఏపీ కోటా సరిగ్గా అందలేదన్నారు. కేంద్రానికి లేఖ రాశామని, మరోసారి గుర్తుచేసి ఎరువులు తొందరగా పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సంబంధిత కథనం