తెలుగు న్యూస్ / తెలంగాణ /
Telangana Rains : అసలే భారీ వర్షాలు.. కరెంటుతో జర భద్రం! పాటించాల్సిన జాగ్రత్తలివే
Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాల విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని స్పష్టం చేస్తున్నారు.
జోరు వానలు..కరెంటుతో జర భద్రం!
తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షం దాటికి జనం అవస్థలు పడుతున్నారు. చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో... విద్యుత్ పట్ల జాగ్రత్లగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కరెంట్ తీగల సమీపానికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. విద్యుత్ అత్యవసర పరిస్థితి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయాలని చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు విద్యుత్ వైర్లకు, స్టే వైర్లకు, ట్రాన్సఫార్మర్లకు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి.
- కరెంటు లైన్ క్రింద నిలబడటం, నడవటం, సెల్ ఫోన్ మాట్లాడటం చేయకూడదు.
- విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోవద్దు.
- తడి చేతులతో ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను, ఎఫ్ యం రేడియోను ముట్టుకోరాదు.
- ఇంటి పైకెక్కి కరెంటు తీగల సమీపానికి వెళ్లొద్దు. గాలికి ఎగిరి తీగలపై పడిన చెట్లకొమ్మలను, దుస్తులను కర్రలతో, లోహరాడ్లతో కాని తీయవద్దు.
- చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.
- ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.
- తెగిపడి వున్న విద్యుత్ తీగల, వైర్ల సమీపానికి వెళ్లవద్దు.
- ఇంట్లో ఉన్న వాటర్ హీటర్, రైస్ కుక్కర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతే ముట్టుకోవాలి.
- ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు "డిష్ " కనెక్షన్ తీసివేయాలి.
- రైతులు బావుల వద్ద తడిసిన చేతితో స్టార్టరును తాకవద్దు.
- గాలి వల్ల విద్యుత్ లైను తీగలు తెగిపడటం, పోల్లు పడి పోయే అవకాశం వుంటుంది. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.
- లోతట్టు ప్రాంతాలు, ముంపుకు అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.