Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యత? ప్రయోజనాలేంటి?
Karthika Masam Gooseberry Importance : కార్తీక మాసంలో ఉసిరికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. దీనికి సంబంధించిన విషయాలను ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు.
కార్తీక మాసంలో తులసితో సమానంగా ఉసిరిని కొలుస్తారు. దీనికి కారణం ఉసిరిచెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. క్షీరసాగర మధనం తరువాత దేవదానవులు ఘర్షణలో కొన్ని అమృత బిందువులు నేలమీద పడి ఉసిరిచెట్టుగా మారాయట. అందుకే ఉసిరిలో అన్ని సుగుణాలని చెబుతారు. ఆయుర్వేదం కూడా ఉసిరిని గొప్ప ఓషధ మొక్కగా వర్ణిస్తోంది. పైగా చలికాలంలో తప్పక తినాల్సిన కాయ ఉసిరి. ఇలా ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా కూడా ఉసిరిని చెబుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీకమాసంలో పూజలు, దీపజ్యోతులు, నదీస్నానాలు, వనభోజనాలతో పాటుగా ఉసిరిదీపాలు పెట్టడం, ఉసిరి చెట్టుకు పూజలు చేయడం, ఆ చెట్టు నీడలో భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారాలే. ఆధ్యాత్మికంతో పాటు ఆహారంలో కూడా ఉసిరి ముఖ్య భాగం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆవకాయ, చింతకాయ తరువాత ఉసిరి నిలువపచ్చడికి బాగా డిమాండ్. కాస్త పులుపు, కాస్త వగరుతో నోట్లో వేసుకోకుండానే లాలాజలం ఊరుతుంది. అలాగే ఆరోగ్యంతోపాటు కేశ సంరక్షణ, చర్మ రక్షణలో కూడా ఉసిరిపాత్ర కీలకం.
ఉసిరి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ఉసిరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందుంది. తరువాత స్థానాల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. దేశంలో 35 శాతం ఉసిరిని ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే పండిస్తున్నారు. జర్మనీ, అమెరికా, జపాన్, మలేషియా తదితర దేశాలకు మన ఉసిరిని ఎగుమతి చేస్తున్నాం. ఔషధ గుణాలు, పోషక విలువల కారణంగా ఉసిరికి ఆయా దేశాల్లో బాగా డిమాండ్ ఉంది. ఉసిరిని కాయలాగా చూడకుండా తాజా పండుగా సలాడ్స్ లో వినియోగించవచ్చు. ఇంకా జామ్స్, జెల్లీ, పచ్చడి, కూరలు, సిరప్స్‌లో కూడా విరివిగా వాడుతున్నారు. ఉసిరి ఆకులు, కాయలు, పూలపై విశేషంగా జరిపిన పరిశోధనల వల్ల అనేక విషయాలు బయటపడ్డాయి. ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయంటారు వైద్య పరిశోధకులు.
జలుబు దూరం : విటమిన్ సి, డి, ఈ విటమిన్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా విటమిన్ సి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి వ్యవస్థలోని కణాలు మరింత వేగంగా పనిచేస్తాయి. చలికాలంలో జలుబుతో బాధపదేవారు ఉసిరిని వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది : శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనులు, సిరల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా చూస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి రక్షణగా నిలిచి మేలుచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గించడం, నియంత్రణకు తోడ్పడుతుంది. శక్తిని పెంచుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తశుద్ధికి దోహదపడుతుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడం : బరువు తగ్గేందుకు పెద్ద మొత్తంలో కొవ్వును కరిగించే తత్త్వం ఉసిరికి ఉంది. శరీరం లోపల జీవక్రియ చక్కగా జరిగేలా చూస్తుంది. తద్వారా ప్రోటీన్ సింథసిస్ మెరుగుపడి కొవ్వు కరిగేలా చేస్తుంది. ఈ కారణం వల్ల ఉసిరి అందరికీ మంచిది. అందుకే ఊబకాయంపై యుద్ధం చేయడంలో ఉసిరి పాత్ర కీలకం.
చక్కని జీర్ణవ్యవస్థకు : ఉసిరికాయను కొరికినప్పుడు కసుక్కుమనే శబ్దం వస్తుంది. ఈ కాయ నిండా పీచు పదార్ధలే. కాబట్టి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అయ్యేలా చేసే గుణం ఈ కాయకి ఉంది. కడుపు ఉబ్బరం, అసిడిటితో బాధపడుతున్న వారికి ఆమ్ల దివ్యౌషధం. ఉసిరిని ఆహారంలో తీసుకోవడం వల్ల అందులోని బెషధ గుణాలు కాలేయం నుంచి మలినాలను తొలగిస్తాయి.
మధుమేహులకూ మంచిదే : రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే విశిష్టమైన సమ్మేళనాలు ఉసిరికాయలో మెండుగా ఉన్నాయి కాబట్టి మధుమేహం చికిత్సలో ఉసిరిని వినియోగిస్తారు. ఇవేగాక భారతదేశంలో లభించే ఉసిరి రకం యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇలా అనేక ఆరోగ్యపరమైన కారణాల వల్ల ఉసిరి వినియోగం దేశవిదేశాల్లో పెరిగిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కార్తీకమాసంలో ఎక్కువగా దీని వాడకం ఉంటుందనన్నారు.