relationship mistakes: ఈ విషయాల్లో మీ భాగస్వామి మీద ఆధారపడొద్దు..
relationship mistakes: స్వీయ సంరక్షణ నుంచి మీ వ్యక్తిగత, ఉద్యోగ ఎదుగుదల వరకూ ప్రతి దాంట్లో మీ భాగaస్వామే మీకు సహాయం చేయలేరు. కొన్ని విషయాల్లో వాళ్ల మీద ఆధారపడకూడదు కూడా. అవేంటంటే..
చదువుల్లో, ఉద్యోగాల్లో సమానంగా ఉంటున్నారు అమ్మాయిలూ అబ్బాయిలు. పెళ్లయ్యాక కూడా కుటుంబ నిర్వహణలో ఇద్దరి పాత్ర సమానంగా ఉంటోంది. ఎవరిమీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద బతికే నేర్పు దాదాపు చదువుకున్న ప్రతి అమ్మాయిలో వచ్చేసింది. ఆస్తుల మీద ఆధార పడకుండా కష్టపడి సంపాదించే గుణం ప్రతి అబ్బాయికి కూడా ఉంటోంది. ఇంతలా స్వతంత్రంగా బతకగలిగే నేర్పు వచ్చినా కొన్ని విషయాల్లో మాత్రం పూర్తిగా మన భాగస్వామి మీద ఆధారపడిపోతాం. అలాని అసలు ఆధారపడకూడదని కాదు. ప్రేమతో పాటూ ఒకరి మీద నమ్మకం, ఆధారపడటం కూడా అలవాటయిపోతాయి.
“మన భాగస్వామి మనకోసం కొన్ని పనులు చేయాలని ఆశించడం తప్పు కాదు. నిజానికి ఆ ఆశ ఉండాలి కూడా. అదే కదా బంధం అంటే. కానీ ప్రతి విషయంలో ముఖ్యంగా కొన్ని భాగోద్వేగాల విషయంలో ఆధారపడటం సరైంది కాదు. మనం మాత్రంమే సరి చేసుకోగల విషయాలు కొన్ని ఉంటాయి. ” అని సైకోథెరపిస్ట్ ఇజ్రా నాజిర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఏ విషయాల్లో ఆధారపడకూడదో కూడా వివరంగా చెప్పారు.
అర్థం చేసుకోవడం: మీ ఉద్యోగంలోనో, వ్యక్తిగతంగానో ఏదైనా సమస్య వస్తే దాన్ని మొదట అర్థం చేసుకోవాల్సింది మీరే. మీ సమస్య గురించి ముందు మీరే అర్థం చేసుకోవాలి. ఒక స్పష్టత వచ్చాక మీ భాగస్వామికి చెప్పి అప్పుడు సాయం కోరండి. ఒకవేళ వాళ్లు అర్థం చేసుకోకపోయినా.. సహనం కోల్పోవద్దు.
ఎదుగుదల: వ్యక్తిగతంగా, వృత్తి పరంగా మీ ఎదుగుదల పూర్తిగా మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. దానికి మీ భాగస్వామి ఏ సహాయం చేయలేరు. కేవలం మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోగలరు. మీ అభివృద్ధి కోసం మీ వెంట ఉండగలరంతే. సహాయం కోరాలే కానీ వాళ్ల మీద పూర్తిగా ఆధారపడకూడదు.
పరిపూర్ణత: ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ఎన్ని కోరికలు తీర్చినా.. మీ మనసులో సానుకూలత లేకపోతే వీటన్నింటి వల్ల మీకు పరిపూర్ణంగా అనిపించదు. ఇది మీరు మార్చుకోవాల్సిన విషయం.
విశ్వాసం: ప్రతి విషయంలో అనుమానం, వాళ్లు చెప్పిన విషయాలు నమ్మక పోవడం.. ఇదంతా ఎదుటి మనిషి తప్పుకాదు. ఈ విషయంలో మీరే మారాలి. ఎదుటి వ్యక్తి మీద సమ్మకం ఉండటం ఏ బంధంలో అయినా ముఖ్యం.
ప్రేమ: ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడటం ముఖ్యం. అప్పుడే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించగలరు. లేదంటే ఎప్పటికీ మీలో ప్రేమ లేదనే వెలతి ఉంటుంది.
టాపిక్