Book Reading Before Sleep : పడుకునే ముందు పుస్తకం చదివితే ఇంత మంచిదా?-world book day amazing benefits with book reading before sleep ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Book Reading Before Sleep : పడుకునే ముందు పుస్తకం చదివితే ఇంత మంచిదా?

Book Reading Before Sleep : పడుకునే ముందు పుస్తకం చదివితే ఇంత మంచిదా?

Anand Sai HT Telugu
Apr 23, 2023 08:00 PM IST

Book Reading Before Sleep : ఒక వ్యక్తిని బలమైన వ్యక్తిగా మార్చడానికి పుస్తకం సహాయపడుతుంది. పుస్తకాలు చదివి.. మంచి దారిలో నడిచిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక పుస్తకాలు చదివే అలవాటును మరిచిపోయారు. అయితే పడుకునే ముందు పుస్తకం చదివితే ఎన్నో లాభాలు ఉన్నాయి.

పడుకునే ముందు బక్ చదవండి
పడుకునే ముందు బక్ చదవండి (unsplash)

ప్రపంచంలోని అత్యంత సంపన్నులు.. ఎక్కువమంది పుస్తకాలు చదువుతుంటారు. పుస్తకాలు చదివితే.. ఆలోచన విధానం మారడమే కాదు.. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక్కో పుస్తకం.. ఒక్క మార్గదర్శిలా పని చేస్తుంది. అందుకు చినిగిన చొక్కా అయినా వేసుకో ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటారు. ప్రపంచంలోనే బిజీ బిజీగా ఉండే CEOలకు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉంది. పుస్తకాలు చదివితే చాలా మంచిది. రాత్రి పడుకునే(Sleeping) ముందు చదివితే ప్రయోజనాలూ ఉన్నాయి.

పూర్తిగా మీరు పగలు పని చేస్తారు. రాత్రి వరకు ఒత్తిడికి గురవుతారు. మరుసటి రోజు కూడా పని చేయాలని అనిపించదు. ఇలా అనిపిస్తే.. పడుకునే ముందు పుస్తకాన్ని చదవండి. కేవలం ఆరు నిమిషాల పాటు పుస్తకాన్ని చదవడం(Book Reading) వల్ల ఒత్తిడి 68 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మనం ఎంత ఎక్కువ పుస్తకాలు(Books) చదివితే అంత సమాచారం పొందవచ్చు. దీనివల్ల మన జ్ఞానం కూడా పెరుగుతుంది. విభిన్న ఆలోచనల గురించిన సమాచారం తెలుసుకున్న కొద్దీ మన తెలివితేటలు పెరుగుతాయి. మీకు సమాచారం తెలిసేలా వీలైనంత ఎక్కువ నాన్ ఫిక్షన్ చదవండి. ఫిక్షన్, ఫాంటసీ కథనాలు మీ పదజాలాన్ని మెరుగుపరుస్తాయి. గొప్ప గొప్ప పదాలు మీకు తెలుస్తాయి.

మీరు రోజు పనితో పరధ్యానంలో ఉన్నట్లయితే, మీరు ఇంటికి వచ్చినప్పుడు వీలైనంత వరకు మీ దృష్టి మరల్చడానికి ప్రయత్నించండి. పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడు. ఒక మంచి పుస్తకంతో కూర్చోండి. అది మిమ్మల్ని మరొక ప్రపంచానికి తీసుకెళుతుంది. మీ మెదడు(Mind), మనస్సు, శరీరానికి కూడా విశ్రాంతి లభిస్తుంది.

ఈ బిజీ లైఫ్ లోంచి బయట పడాలి అని అనిపిస్తే ఒక్క పుస్తకం చాలు. మీకు ఇష్టమైన పుస్తకంతో కూర్చుంటే ప్రపంచం మొత్తాన్ని మరచిపోవచ్చు. పెద్ద శబ్దాలు, డ్రామాలు, టీవీల్లో, మొబైల్‌లలో హింస అన్నీ అనుభవించాల్సిందే. అదే పుస్తకం అలా కాదు అందులోని కథల నుంచి మన మనసులో ఒక చిత్రాన్ని రూపొందించుకుంటాం. ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. మీకు ఊహించే శక్తి పెరుగుతుంది.

ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, మనం కొన్నిసార్లు కథలోని హీరో నుంచి మంచి లక్షణాలను కూడా తీసుకుంటాం. కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేయాలని భావిస్తాం. తద్వారా మనకు తెలియకుండానే మనం కొన్ని మంచి లక్షణాలను(Good Qualities) అభివృద్ధి చేసుకుంటాం.

చాలా మంది రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా(Social Media)లో ఎక్కువ సమయం గడుపుతారు. ఒక్కోసారి ఫేస్‌బుక్, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఒకదాని నుంచి మరొదానికి వెళ్తాం. దీని వలన కళ్ల మీద ప్రభావం పడుతుంది. అదే పుస్తకం చదివేటప్పుడు అలా కాదు. మన మనస్సు ఒకే ఆలోచనపై కేంద్రీకరిస్తుంది. కొన్ని గంటలపాటు మనం అదే విషయం గురించి ఆలోచిస్తాం. ఈ విధంగా మన ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. కంటికి కూడా మంచిది. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే... ఒత్తిడి కూడా పెరిగి నిద్రపట్టదు. అదే పుస్తకమైతే.. చదువుతుంటేనే.. నిద్ర వచ్చినట్టుగా అవుతుంది.

రాత్రి పడుకునే ముందు మొబైల్, టీవీ చూసే అలవాటు ఉంటే మనకు త్వరగా నిద్ర పట్టదు. మొబైల్‌(Mobile)ను మరింత స్క్రోల్ చేయాలని అనిపిస్తుంది. కానీ పుస్తకం పెట్టుకుని కూర్చుంటే క్షణాల్లో నిద్ర వస్తుంది. పుస్తకం మిమ్మల్ని సృజనాత్మక వ్యక్తిగా చేస్తుంది. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. పుస్తకాలు చదివే అలవాటు ఉంటే.. ఒక సమస్యపై మీ నిర్ణయం గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉంటుంది. పడుకునే ముందు.. మొబైల్, టీవీ, సోషల్ మీడియా అనే పిచ్చి వ్యామోహం నుంచి బయటపడి పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోండి.

Whats_app_banner