Women's Day 2024 : చరిత్రలో సమానత్వం కోసం ఫైట్ చేసిన గొప్ప మహిళలు వీరు-womens day 2024 these indian womens fought for equality in history ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women's Day 2024 : చరిత్రలో సమానత్వం కోసం ఫైట్ చేసిన గొప్ప మహిళలు వీరు

Women's Day 2024 : చరిత్రలో సమానత్వం కోసం ఫైట్ చేసిన గొప్ప మహిళలు వీరు

Anand Sai HT Telugu
Mar 05, 2024 12:30 PM IST

Women's Day 2024 : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. చరిత్రలో గొప్ప గొప్ప మహిళలు సమానత్వం కోసం పోరాడారు.

మహిళా దినోత్సవం
మహిళా దినోత్సవం (Unsplash)

మెుదటి నుంచీ స్త్రీలు పితృస్వామ్యం వ్యవస్థలో అణచివేతకు గురవుతున్నారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం కాస్త ఈ పరిస్థితి తగ్గింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. చరిత్రలో చాలా మంది మహిళలు సమానత్వం కోసం ఫైట్ చేశారు. ఎన్నో త్యాగాలు చేశారు. నేడు మహిళలు విజయవంతంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహించే వరకు ఎత్తుకు ఎదుగుతున్నారు. మనకంటే ముందు తరాల్లోని కొంత మంది మహిళలు స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. ఆ వీర భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం..

సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో స్త్రీవాదానికి మార్గదర్శకురాలు అని అనుకోవచ్చేమో. దేశంలోనే అన్ని కులాల బాలికలకు విద్యనందించేందుకు 17 పాఠశాలలను స్థాపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు. కుల, లింగ వివక్షను అంతం చేయడానికి ఆమె తన భర్త, ఇతర మహిళలతో కలిసి పనిచేశారు. ఆమెను ఎంతో మంది అవమానించారు. అయినా పట్టువదలకుండా ముందుకు సాగారు. సావిత్రీబాయి ఫూలే నేడు భారతదేశంలోని స్త్రీవాద ఉద్యమానికి మద్దతుదారులకు మార్గదర్శకురాలిగా ఉన్నారు.

ఫాతిమా షేక్.. ఈమె ఫూలే జంటకు సహోద్యోగి. భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలిగా చెబుతారు. ఫూలే దంపతులు తమ జీవితాన్ని ప్రారంభించినప్పుడు, వారి పనులను నిలిపివేయాలని, ఇంటిని విడిచిపెట్టమని పెద్దల నుంచి వారికి ఒత్తిడి వచ్చింది. వారు నిస్సందేహంగా ఇంటిని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. ఉస్మాన్, ఫాతిమా షేక్‌ ఇంటిలో నివసించారు. సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్ చివరికి ఆమె ఇంటిలో ఒక పాఠశాలను స్థాపించారు. అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు బోధించడం ప్రారంభించారు. దీంతో ఫాతిమా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముస్లిం మహిళగా ఫాతిమా షేక్ పడిన నష్టాలను తక్కువ అంచనా వేయలేం.

తారాభాయ్ షిండే పితృస్వామ్యానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన స్త్రీవాద ఉద్యమకారిణి. హిందూ గ్రంథాలలో కనిపించే స్వాభావిక పితృస్వామ్యాన్ని ధిక్కరించారు. ఆమె అభిప్రాయాలు నేటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. మరాఠీలో ప్రచురించబడిన ఆమె మొదటి రచన 'స్త్రీ పురుష్ ధులానా'. దీనిలో ఆమె స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలను అన్వేషించారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి ఆధునిక స్త్రీవాద గ్రంథాలలో ఒకటిగా అంటారు. తారాభాయ్ షిండే భారతదేశంలో మాత్రమే మహిళలపై దృష్టి పెట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇదే విధంగా అణచివేయబడుతున్నారని నమ్మారు.

భారతదేశపు మొట్టమొదటి మహిళా హక్కుల కార్యకర్తలలో ఒకరైన రమాబాయి రనడే ముంబై, పూణేలలో సేవా సాధన్ వ్యవస్థాపకురాలు. వేలాది మంది మహిళలకు వివిధ నైపుణ్యాలలో శిక్షణనిచ్చిన సంస్థ ఇది. మహిళలు స్వావలంబన, ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. రమాబాయి రనడే చిన్నప్పుడు చదువుకోలేదు. 11 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. ఆమె విద్యను పూర్తి చేయడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడు. ఆమె తన జీవితాంతం మహిళల సంక్షేమం కోసం త్యాగం చేసింది.

మహిళల సంక్షేమం, సమానత్వం కోసం పోరాడిన మొదటి మహిళ డాక్టర్ వినా మజుందార్. భారతదేశం అంతటా పితృస్వామ్య వ్యవస్థలలో స్త్రీల విభిన్న అనుభవాలను అర్థం చేసుకోవడానికి ఆమె ఎక్కువ సమయం గడిపింది. ఆమె పరిశోధన ద్వారా అనేక విషయాలను తెలుసుకున్నారు. ఇది 1980లో సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ (CWDS) స్థాపనకు దారితీసింది. 1982లో డాక్టర్ వినా మజుందార్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ (IAWS)కి వ్యవస్థాపక సభ్యురాలు అయ్యారు. మహిళల అధ్యయనాలను ప్రోత్సహించడానికి జాతీయ సదస్సులను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

Whats_app_banner