Opinion: సంక్షేమం నుంచే సామాజిక సమానత్వం
‘ఇంట్లో పాఠశాలకు వెళ్లలేక ఏదో టీ కొట్టులోనో, హోటల్లోనే పనిచేసే పిల్లాడికి వరల్డ్ క్లాస్ పాఠశాల నిర్మిస్తే ఏం ప్రయోజనం. మొదట ఆ కుటుంబానికి పిల్లాడిని స్కూల్ కు పంపే పరిస్థితి కల్పించాలి..’ - ఏపీలో జగన్ పాలనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అభిప్రాయం, విశ్లేషణ.
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ది రాజకీయాల్లో ఓ నూతన ఒరవడి. సంక్షేమం వైఎస్సార్‌సీపీ పాలనకు మారుపేరు. ఎందరో సీనియర్ రాజకీయ నాయకులకు సాధ్యం కాని సంక్షేమం సామాజిక అభివృద్ధే ప్రధానంగా నమ్మిన సీఎం జగన్‌తోనే సాధ్యమైంది. డిసెంబర్ 21 నాటితో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ 50వ ఏడులోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలను మరోసారి ప్రస్తావించుకోవడం సబబుగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ 2014 లో రాష్ట్ర విభజన తరువాత ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలతో పోటీ పడటం పక్కన పెట్టి కనీసం బతికి బట్ట కడుతుందా.. తన ఉద్యోగులకు జీతాలైనా ఇవ్వగలుగుతుందా.. ఇదీ రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణుల మదిలో మెదిలిన ప్రశ్న. ఈ ప్రశ్నతో మొదలైన ఏపీ ప్రయాణం ఒడ్డుకు చేరే ప్రయత్నంలో మొదటి ఐదేళ్లలోనే రూ. 3.60 లక్షల కోట్ల అప్పు చేసింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను సరైనా దారిలో నడపాలంటే తానొక్కడే ఆప్షన్ అంటూ, విజనరీ ఆలోచనలతో ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచారు. హైదరాబాద్ కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కు అమరావతి కట్టి మహా నగరం నిర్మిస్తానని ప్రతిజ్ణ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రం కోసమేనంటూ బీజేపీతో దోస్తీ చేసి అమరావతి నిర్మాణంపై ఓ క్లారిటీ ఇవ్వలేకపోయారు.
ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే జన్మభూమి కమిటీల పేరుతో పాలనా యంత్రాంగానికి సమాంతరంగా తేవడంతో లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకాల అమలు వరకు అవినీతి మరక అంటింది. దీని ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రూ. 3.60 లక్షల కోట్ల అప్పు పేరుకుపోయింది. ఈ రెండు ప్రధాన విషయాల కొలమానంగా చూసిన ప్రజలు టీడీపీని ఓటుతో గద్దెదించారు. తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్రం అప్పులు చేయడంతో ప్రభుత్వానికి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందనేది ఆర్థిక నిపుణుల వాదన. ఒక వైపు ఈ తంతు జరుగుతుండగానే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ సాగుతూ పాదయాత్ర చేశారు. కష్టం అన్న ప్రతి వర్గానికి అండగా ఉంటానంటూ ఆర్థిక పరమైనా హామీలు ఇచ్చారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మేనిఫెస్టో చూసిన చాలామంది దీనిని అమలు చేయడం దాదాపు అసాధ్యం అంటూ తీర్మానించేశారు. మాట ఇస్తే చేస్తానంతే అన్న హామీతో ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఎన్నికల్లోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఏకంగా 151 సీట్లను గెలిచింది. గెలుపు ఓ యజ్ణమైతే, పరిపాలన మహా యజ్ణం అన్న సంకల్పంతో జగన్ అధికారంలోకి వచ్చారు.
తొలి ఏడాది నుంచే మేనిఫెస్టేలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నారు. నవరత్నాల అమలు నిధుల విడుదల ఆలస్యం కావడంలేదు. నవరత్నాల క్యాలెండర్ లో ప్రకటించిన తేదికి ఠంచనుగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన పసుపు కుంకుమ నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయలేక పోయారు.
మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈ రాష్ట్రంలో వేల కోట్లు ప్రతి నెలా సమకూర్చడం ఎలా సాధ్యమవుతోంది. గత మూడున్నరేళ్లుగా నవరత్నాలను ఎలా అమలు చేయగలుగుతున్నారన్నది చాలా మందికి అంతుపట్టని ఓ చిక్కు ప్రశ్న. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు సాధ్యం కానిది ఒక యువ నాయకుడు కేవలం 49 ఏళ్లు ఉన్న జగన్‌కు ఎలా సాధ్య పడుతోంది. అందులోనూ రాష్ట్ర ఖజానా ఆదాయం ఆశాజనకంగా లేని పరిస్థితిలో లక్షల కోట్లను నవరత్నాల పేరిట లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎలా వేయగలుగుతున్నారు. ఆయా పథకాల అమలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆగలేదు. ఈ ప్రశ్నలకు ప్రతి ఒక్క ఆంధ్రుడు సమాధానం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు వెళ్లనున్న చంద్రబాబు తన హయాంలో వీటిని ఎందుకు అమలు చేయలేకపోయారో కచ్ఛితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వానికి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి బడ్జెట్ లో ఎలాంటి తేడా లేదన్నది వాస్తవం.
సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు ఏపీ పయనం
సంక్షేమం నుంచి సామాజిక సమానత్వం.. తద్వారా అభివృద్ధి.. ఇదే ఏపీలో అధికార పార్టీ అవలంబిస్తున్న ఫార్ములా. సంక్షేమం అంటే డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయడం కాదు బడుగు, బలహీన వర్గాలు సామాజిక సమానత్వం సాధించేలా కృషి చేయడమని అంటారు సీఎం జగన్. ఇదెలా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా సామాజిక విప్లవం మొదలవుతుంది. అదే సమయంలో ఆయా వర్గాల భావి తరాలు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తే అభివృద్ధి సాధ్యపడుతుందనేది జగన్ ఆలోచన.
పథకాల రూపంలో ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు నాడు నేడు అనే పథకం కింద మారు మూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి వరకు ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పూర్వం మన పెద్దవాళ్లు చెప్పినట్లు ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి వేదాంతం చెబితే ఎలా అర్ధమవుతుందన్నది ఇక్కడ అక్షరాలా నిరూపితం అవుతోంది. ఇంట్లో పాఠశాలకు వెళ్లలేక ఏదో టీ కొట్టులోనో, హోటల్లోనే పనిచేసే పిల్లాడికి వరల్డ్ క్లాస్ పాఠశాల నిర్మిస్తే ఏం ప్రయోజనం. మొదట ఆ కుటుంబానికి పిల్లాడిని స్కూల్ కు పంపే పరిస్థితి కల్పించాలి. ఆ తరువాత నాణ్యమైన విద్యను అందించే పాఠశాలను అభివృద్ధి చేయాలి. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే జరుగుతోంది. అమ్మఒడి ద్వారా ఆర్థిక భరోసా ఇస్తూ నాడు నేడుతో ఉత్తమ పాఠశాలల అభివృద్ధి జరుగుతోంది. దీని ఫలితాలు దీర్ఘకాలంలో తప్పకకనిపిస్తాయి. ఇంటర్నేషనల్ రీసెర్చ్ స్టడీస్‌లో కీలకమైన టాపిక్ గా ఇన్వెస్ట్ మెంట్ ఆన్ హ్యూమన్ రిసోర్సెస్ పై జరిగిన ప్రచురణలను పరిశీలిస్తే ఆయా పెట్టుబడుల ఫలితాలు రావడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది. తాను ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయిని ఖర్చుగా కాకుండా మానవ వనరుల కోసం చేస్తున్న పెట్టుబడిగా భావిస్తానన్న సీఎం జగన్ వ్యాఖ్యలు ఈ థీసిస్‌కు సారూప్యంగా ఉంటున్నాయి.
ప్రజలు అర్థం చేసుకుంటున్నారు..
జగన్ పాలనపై వస్తున్న ఈ అభిప్రాయాలకు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రకమైన భావన వినిపిస్తోంది. సంక్షేమ పథకాల అమలును ఉచితాలుగా వర్ణిస్తున్న వాదనలను వాస్తవాలకు దగ్గరగా లేని వాటిగా ఓ వర్గం పరిగణిస్తోంది. ఆర్థిక సమానత్వం కోసం ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు ఏసీ గదుల్లో కూర్చొని ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేక ఉండిపోయిన వారికే బాగా అర్థం అవుతాయన్న వాదన వినిపిస్తోంది. రైతు భరోసా నుంచి మొదలు ఆటో డ్రైవర్లకు ఇస్తున్న రూ. 10 వేల ఆర్థిక సాయం వరకు వాస్తవ ప్రతికూలతలకు చూపుతున్న సమాధానంగా నిలుస్తోంది. కరోనా లాంటి కష్ట కాలంలో ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయకుంటే ఆయా పేద కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితి ఎదుర్కొనేవన్నది అనుభవించే వారికే అర్ధమవుతుంది. రాష్ట్రంలో 68 శాతమైన నిరుపేద కుటుంబాలకు పథకాల పేరిట అందుతున్న ఈ మొత్తం జీవనాధారం అవుతోందన్నది గుర్తించదగ్గ అంశం.
టీడీపీ ప్రభుత్వంలో రూ. 3.60 లక్షల కోట్లు అప్పులు తెస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నవరత్నాల కింద రూ. 3.60 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన అప్పు గతంలో టీడీపీ చేసిన అప్పుకంటే 30 శాతం తక్కువ. మరి టీడీపీ హయాంలో చేసిన రూ. 3.60 లక్షల కోట్లు ఏమైనట్లు, ఎక్కడైనా రాష్ట్రంలో అభివృద్ది చేశారా అంటే శాశ్వతమైన అభివృద్ధి ఒక్కటి కూడా చేయలేదు. కరోనాతో ఆదాయం తగ్గినా, అప్పులు గతంలో తెచ్చిన వాటితో పోల్చితే తగ్గినా రూ. 3.60 లక్షల కోట్ల సంక్షేమం ఎలా సాధ్యపడిందన్నదే జగన్ నిబద్ధతకు నిదర్శనం.
రాజకీయాల్లో ఓ కెరటంలా సాగుతున్న జగన్ ప్రస్థానం యువతకు, రాష్ట్ర రాజకీయాలకు కీలకగా మారింది. ఆర్థిక ఒడిదడుకుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు జగన్ నాయకత్వం జీవరేఖగా మారింది. రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయాలనుకుంటున్న యువతకు జగన్ కల్పిస్తున్న ప్రాతినిధ్యం, నామినేటెడ్ పోస్టులు, సీట్ల భర్తీలో రిజర్వేషన్ల అమలు లాంటి అంశాలు చారిత్రాత్మక నిర్ణయాలు. రాజకీయం, పదవులు అంటే అధికారం అనే స్థాయి నుంచి బాధ్యత అనే సంకేతం ఇచ్చిన జగన్‌ను ఏపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికలకు ముందు ఓటర్ల గడపకు వెళ్లే రాజకీయ నేతలను .. గెలిచిన తరువాత ఎమ్మెల్యే హోదాలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వారి గడపకు వెళ్లేలా చేస్తున్నారు. పారదర్శక రాజకీయ వ్యవస్థను తయారు చేయడంలో జగన్ సాధించిన భారీ విజయంగా దీన్ని చెప్పవచ్చు..’’
- అబ్బయ్య చౌదరి, శాసన సభ్యులు, దెందులూరు నియోజకవర్గం
(గమనిక: ఒపీనియన్ శీర్షికన వచ్చే ఈ వ్యాసాలు వ్యాసకర్తల సొంత అభిప్రాయాలు. అవి హెచ్‌టీ తెలుగు అభిప్రాయంగా పరిగణించరాదు)