Chanakya Niti On Couple : కుటుంబంలో సంతోషం ఉండాలంటే భార్యాభర్తలకు ఈ లక్షణాలు ఉండాలి
Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి కుటుంబ జీవితం గురించి చాలా గొప్పగా చెప్పాడు. అయితే భార్యాభర్తలకు ఉండాల్సిన కొన్ని లక్షణాలను వివరించాడు.
భార్యాభర్తలు కలిసి కుటుంబ బండిని నడిపితేనే జీవితం బాగుంటుంది. అన్ని కుటుంబాల్లోనూ ఇలాగే ఉంటుందని అనుకోలేం. కొన్ని చోట్ల పురుషుల ఆధిపత్యం ఎక్కువ. కొన్ని చోట్ల భర్త కంటే ఎక్కువ ఆధిపత్యం భార్య చెలాయిస్తుంది. అందమైన దాంపత్యం జీవితం ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన కొన్ని లక్షణాలు భార్యాభర్తల్లో ఉండాలి. అప్పుడే అందమైన దాంపత్యం సాధ్యమవుతుంది. ప్రతీ విషయంలో కలిసి ముందుకు వెళ్లాలి. స్త్రీలు, పురుషులు కలిగి ఉండవలసిన లక్షణాలు చూద్దాం..
భార్యకు ఉండాల్సిన లక్షణాలు :
పూజలు చేయాలి
చాణక్యుడు ప్రకారం, గృహిణి ఇంటిని బృందావనంలా ఉంచాలి. ఉదయం లేవగానే తలుపు దగ్గర నీళ్లు పెట్టి రంగోలి వెలిగించాలి. అంతే కాదు ఉదయాన్నే ఇంట్లో పూజ కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ఇంట్లో శాంతి ఉంటుంది. పర్వదినాలలో పూజలు కట్టుదిట్టంగా, శ్రద్ధగా నిర్వహించాలి. ఇల్లు మొదటి పాఠశాల కాబట్టి, క్రమంగా పిల్లలు కూడా తల్లి ఆచారాలను నేర్చుకుంటారు.
గొడవలు పెట్టుకోకూడదు
చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్య గయ్యాళిలా ఉండకూడదు. మధురంగా మాట్లాడాలి, భర్త పిల్లలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చిన భర్తతో ప్రేమ మాటలు మాట్లాడితే చాలు, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. భార్య ప్రతి విషయంలో భర్తకు మద్దతు ఇవ్వాలి.
పొదుపు చేయాలి
భార్యకు పొదుపు అలవాటు ఉండాలని చాణక్యుడు చెప్పాడు. గృహిణి దుబారా ఖర్చు చేయరాదు. మీకు వీలైన చోట డబ్బు ఆదా చేసుకోండి. కష్ట సమయాల్లో ఈ డబ్బు తప్పకుండా ఉపయోగపడుతుంది. భర్త పడే కష్టాలను అర్థం చేసుకొని అతడికి తగ్గట్టుగా ఉండగలిగే సత్తా ఉండాలి.
భర్తకు ఉండాల్సిన లక్షణాలు
కుటుంబంలో భార్య మాత్రమే సరిగా ఉంటే సరిపోదు, అందులో భర్తకు కూడా ఉండాలి. సంతోషకరమైన దాంపత్య జీవితానికి పురుషులకు ఉండవలసిన లక్షణాలు చూద్దాం..
ప్రతిదాన్ని తప్పు అనకూడదు
కొన్ని ఇళ్లలో భర్తలను ఏం చేసినా తృప్తి చెందరు. భార్య చేసే ప్రతి పనిలోనూ తప్పులు చూస్తారు. అతను తన ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటాడు. చాణక్యుడి ప్రకారం ఇది సరికాదు, భర్త తన భార్య కష్టాలను గుర్తించి ఆమెతో ప్రేమగా జీవించాలి.
పక్కచూపులు చూడొద్దు
మనిషి ఒకే కుటుంబంతో సంతృప్తి చెందాలి. అలా కాకుండా మరొక స్త్రీతో అనైతిక సంబంధం పెట్టుకోకూడదు. అప్పుడు కుటుంబం నాశనం అవుతుంది. చాణక్య నీతి ప్రకారం, అనైతిక సంబంధం తప్పు. భార్యాపిల్లలతో సంతోషకరమైన కుటుంబాన్ని గడపాలి.
కుటుంబాన్ని కాపాడాలి
భర్త తన భార్య మరియు పిల్లలను శత్రువుల నుండి రక్షించాలి. ఎక్కడికెళ్లినా ఇంటిపై ఓ కన్నేసి ఉండాలి. బయటి వ్యక్తుల నుంచి తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడాలి. భర్త తన భార్యకు లైంగిక సంతృప్తిని ఇవ్వాలి. అప్పుడే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
సర్దుకుపోవాలి
కొన్నిసార్లు కుటుంబంలో సర్దుబాట్లు అవసరం, ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ కూడా సర్దుకుని పోవాలి. ప్రతీ విషయంలో గొడవ పడకూడదు. భార్యాభర్తలు చాణక్య నీతి పాటిస్తే, సంతోషకరమైన దాంపత్యం సాధ్యమవుతుంది.