Backward Walking: ఎప్పుడూ ముందుకే కాదు రోజులో కాసేపు వెనకకు కూడా నడవండి, మెదడుకు ఎంతో మంచిది
Backward Walking: వాకింగ్ చేసేటప్పుడు అందరూ ముందుకే నడుస్తారు. నిజానికి ముందుకు మాత్రమే కాదు వెనక్కి కూడా ఐదు నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Backward Walking: రెట్రో వాకింగ్... దీన్ని వెనుకవైపుగా నడవడం అని పిలుస్తారు. ఎప్పుడూ వాకింగ్ ముందుకే కాదు, వెనక్కి కూడా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఇంట్లోనే వెనక్కి నడవడం అలవాటు చేసుకోండి. ఐదు నిమిషాల పాటు దీన్ని వ్యాయామంగా చేయండి. మీకు మెదడు ఆరోగ్యంతో పాటు గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాయామాల్లో ఇది ఒకటి. సాధారణ నడక కంటే వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వెనకకు నడవడం వల్ల శరీరానికి, మెదడుకు మధ్య సమతుల్యత, సమన్వయం కుదురుతుంది. ముఖ్యంగా శరీరం, మెదడు మధ్య అనుసంధానం ఎక్కువగా ఉంటుంది. మీరు వెనుకకు నడిచినప్పుడు కండరాల పైనా, నాడీ మార్గాల పైనా దృష్టి పెడతారు. దీనివల్ల మెదడు సమన్వయ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. క్రమం తప్పకుండా వెనుకకు నడవడం సాధన చేస్తే మీలో స్థిరత్వం, సమతుల్యత పెరుగుతాయి. పెద్దవారిలో తూగి పడిపోయే ప్రమాదం ఎక్కువ. అలాంటివారు రెట్రో వాకింగ్ చేయడం మంచిది.
ముందుకు నడవడం కంటే, వెనక్కి నడవడం అనేది కాస్త కష్టమైన వ్యాయామం. కానీ ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. వెనక్కి నడవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. మీ గుండెకు వెనక్కి నడవడం అనే వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. దీని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే అన్ని రకాలుగా ఆరోగ్యం సిద్ధిస్తుంది.
వెనుకకు నడవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల్లో ఒకటి. శరీరం మొత్తం దాని సానుకూల ప్రభావం పడుతుంది. కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, గాయాలనుంచి కోలుకుంటున్న వ్యక్తులకు ఇలా వెనక్కి నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. గాయపడిన ప్రాంతాలపై అధిక ఒత్తిడి లేకుండా మెల్లగా వెనక్కి నడవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
మెదడుకు మంచిది
నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు పదునెక్కుతుంది. అభిజ్ఞా పనితీరు చక్కగా పనిచేస్తుంది. వెనుకకు నడవడం వంటి సంక్లిష్టమైన మోటార్ పనులు చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు... కదలికలను సమన్వయం చేయడానికీ, పర్యావరణాన్ని నేవిగేట్ చేయడానికి కాస్త కష్టపడి పనిచేస్తుంది. దీనివల్ల దాని అభిజ్ఞా సామర్ధ్యం పెరుగుతుంది. అలాగే ఇలా వెనక్కి నడవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్లు ఆనంద హార్మోన్ల జాబితాలోకి వస్తాయి. అందుకే వెనక్కి నడిచినప్పుడు మీకు ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ఆందోళనా స్థాయిలు తగ్గుతాయి.
వెనక్కి నడిచే వ్యాయామం చేయడానికి పార్కులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీ గదిలోనే చేయొచ్చు. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు ఇంట్లో ఏవీ అడ్డు లేకుండా చూసుకోండి. లేకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది.