Sadhguru Brain Surgery: సద్గురు మెదడుకు ఆపరేషన్ ఎందుకు చేశారు? ఈ సమస్య ఎవరికి వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?
Sadhguru Brain Surgery: సద్గురు జగ్గీ వాసుదేవ్ హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన మెదడుకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు. అసలు ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? దీని లక్షణాలు ఎలా బయటపడ్డాయో తెలుసుకోండి.
Sadhguru Brain Surgery: ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఈయనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. మార్చి 17న ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన మెదడుకు ఆపరేషన్ చేసినట్టు వైద్యులు చెప్పారు. అసలు ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? అది ప్రాణాంతకమైనదా? దాని లక్షణాలు ఎలా బయటపడ్డాయో వివరించారు వైద్యులు.
మెదడులో రక్తస్రావం
జగ్గీ వాసుదేవ్‌కు మెదడులో అంతర్గత రక్తస్రావం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయినా గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఆ తలనొప్పిని ఆయన సాధారణమైనదని అనుకున్నారు. తలనొప్పి వస్తున్న కూడా తన సామాజిక కార్యకలాపాలు, రోజువారీ పనులను చేసుకుంటూ వచ్చారు. మార్చి 8న మహాశివరాత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. శివరాత్రి తరువాత వారం రోజులకి నొప్పి చాలా తీవ్రంగా మారింది. వైద్యులను పిలిచి విషయం చెప్పారు. వైద్యులు MRI స్కాన్ చేశారు. అందులో మెదడులో రక్తస్రావం అవుతున్నట్టు కనబడింది. మూడు నాలుగు వారాల నుంచి రక్తస్రావం అవుతున్నట్టు తేలింది. దీంతో వైద్యులు వెంటనే అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. అతని మెదడులో వాపు, రక్తస్రావం కనిపించింది. ఆ వాపు చాలా డేంజర్ అని వైద్యులు గుర్తించారు. ఆయనకి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం వెంటిలేటర్ లో ఉన్నట్టు వైద్యులు చెప్పారు.
బ్రెయిన్ హేమరేజ్
బ్రెయిన్ లో రక్తస్రావం కావడాన్ని బ్రెయిన్ హేమరేజ్ అని కూడా పిలుస్తారు. మెదడు రక్తనాళాలు పగిలి ఇలా రక్తస్రావం అవుతూ ఉంటాయి. మెదడులో లేదా మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. ఇది మెదడు స్ట్రోక్ కు కారణం అవుతుంది. మెదడులో రక్తస్రావం అవుతున్నప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు ఇలా
తీవ్రమైన తలనొప్పి వస్తుంది. స్పృహ కోల్పోతూ ఉంటారు. రుచి కూడా సరిగా తెలియదు. సరిగా నడవలేరు, మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. రాయడం, చదవడం కూడా సులువుగా ఉండదు. ఇంతకుముందులా చేతులు, కాళ్లు మీరు చెప్పిన మాటను వినవు. మాట్లాడడానికి తడబడతారు. ఎదుటివారు చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వికారం, వాంతులు వస్తాయి. పక్షవాతం, బలహీనత వంటివి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే మీ మెదడులో ఏదో అసాధారణంగా జరుగుతోందని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మెదడులో రక్తస్రావం ఎందుకు అవుతుంది?
దీనికి సరైన కారణం చెప్పడం కష్టమే. ఒక్కో వ్యక్తికి ఒక్కో కారణం వలన మెదడులో రక్తస్రావం కావచ్చు. తలకు గాయాలు తగిలినప్పుడు ఇలా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు, కాలేయ వ్యాధులు ఉన్నవారు కూడా ఇలా మెదడులో రక్తస్రావానికి గురవుతారు. అనూరిజమ్, మెదడులో కణితులు ఏర్పడడం, అమిలాయిడ్ ఆంజియోపతి వంటి సమస్యలు ఉన్నవారు కూడా మెదడులో రక్తస్రావానికి గురవుతూ ఉంటారు.
పైన చెప్పిన ఎలాంటి లక్షణాలు కనబడినా మీరు తేలికగా తీసుకోకండి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించి సకాలంలో చికిత్సను తీసుకోండి. ఇలా అయితే ప్రాణాంతకంగా మారకముందే చేరుకునే అవకాశం ఉంది.
టాపిక్