Heart Pain Vs Acidity: గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి ఇలా ఉంటుంది? ఎసిడిటీకి, గుండె నొప్పికి తేడాను తెలుసుకోండి-what is the pain like when having a heart attack know the difference between acidity and heartache ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Pain Vs Acidity: గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి ఇలా ఉంటుంది? ఎసిడిటీకి, గుండె నొప్పికి తేడాను తెలుసుకోండి

Heart Pain Vs Acidity: గుండెపోటు వచ్చినప్పుడు నొప్పి ఇలా ఉంటుంది? ఎసిడిటీకి, గుండె నొప్పికి తేడాను తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Published Jun 12, 2024 02:30 PM IST

Heart Pain Vs Acidity: గుండెపోటు నొప్పిని అప్పుడప్పుడు ఎసిడిటీ అనుకుంటారు. ఒక్కోసారి ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పిని కూడా గుండెపోటు అనుకునే అవకాశం ఉంది. ఈ రెండింటీ మధ్య తేడాను తెలుసుకోవాలి.

గుండె నొప్పి ఎలా ఉంటుంది?
గుండె నొప్పి ఎలా ఉంటుంది? (Pexels)

Heart Pain Vs Acidity: గుండె పోటు ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిని ఇప్పుడు ప్రభావితం చేస్తోంది గుండెనొప్పి. అయితే చాలా మందికి గుండె నొప్పికి, ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పికి తేడా తెలియదు. ఆ తేడా తెలియకే అత్యవసర సమయంలో చికిత్స తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి గుండెపోటు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పి ఎలా ఉంటుందో తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సకాలంలో చికిత్స చేయించుకోగలరు.

ముఖ్యంగా గుండె పోటులో అయినా, ఎసిడిటీతో అయినా ఛాతీలో నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పి రాగానే చాలామంది దేనివల్ల వస్తుందో తెలియక ఇబ్బంది పడతారు. కొంతమంది ఎసిడిటీ నొప్పిని, గుండెపోటు అనుకుంటే... మరికొంతమంది గుండెపోటును కూడా ఎసిడిటీ నొప్పి అని తేలిగ్గా తీసుకుంటారు. ఇలా ఛాతీలో నొప్పి వస్తున్నప్పుడు నీరు తాగితే ఆ నొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తే... అది ఎసిడిటీ కారణంగా వచ్చిందని అర్థం చేసుకోవాలి. లేదా ఎసిడిటీకి సంబంధించిన యాంటాసిడ్లు తీసుకున్న తర్వాత ఉపశమనం లభించినా కూడా ఎసిడిటీ వల్ల వచ్చిన నొప్పి అని అర్థం చేసుకోండి. ఇలా ఛాతీలో నొప్పి తీవ్రంగా వస్తున్నప్పుడు వెంటనే నీటిని తాగండి, లేదా యాంటాసిడ్ తీసుకోండి. ఆ రెండిటి వల్ల ఉపశమనం లభిస్తే అది గుండెకు సంబంధించిన నొప్పి కాదని అర్థం. ఎందుకంటే గుండె కంటే వేగంగా పొట్ట స్పందిస్తుంది. నీరు లేదా యాంటాసిడ్ తాగగానే యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

గుండె నొప్పి ఎలా ఉంటుంది?

శారీరక శ్రమకు, గుండె నొప్పికి మధ్య సంబంధం ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏదైనా పని చేస్తున్నప్పుడు గుండె దగ్గర అసౌకర్యంగా అనిపించినా, ఛాతీలో తీవ్రంగా నొప్పి వచ్చినా అది గుండెపోటుకి సంబంధించినదేమో అని అనుమానించాలి. ఆ నొప్పి వచ్చినప్పుడు చేతులను కదిలించలేరు. అలా కదిలించినా నొప్పి ఎక్కువైపోతుంది. కాబట్టి ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తున్నప్పుడు చేయి కూడా కదల్చలేని పరిస్థితి అనిపిస్తే... అది గుండెపోటు అని అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

గుండెపోటు నొప్పిని, ఎసిడిటీ వల్ల వచ్చే ఛాతీ నొప్పిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. మరికొందరికి ఎడమవైపు భాగంలో నొప్పి మొదలవుతుంది. భుజాలలో, చేతులలో తీవ్రమైన నొప్పి వస్తుంది. మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పితో పాటు ఈ నొప్పులు కూడా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇతర లక్షణాలు ఏవీ కనిపించకుండా నొప్పి వస్తున్నప్పుడు... నీరు లేదా యాంటాసిడ్ తీసుకున్నాక అది తగ్గితే ఎసిడిటీ వల్ల ఆ నొప్పి అని చెప్పుకోవాలి. గుండె పోటు వల్ల వచ్చే నొప్పి మాత్రం తీవ్రంగా ఉంటుంది. ప్రాణం పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇలా అనిపిస్తే మాత్రం అది గుండె పోటేనని అనుమానించాల్సిందే.

గుండె పోటు వచ్చే ముందు మరికొన్ని లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో తీవ్రమైన నొప్పి రావచ్చు. ముఖ్యంగా పొత్తి కడుపు భాగంలో ఈ నొప్పి వస్తుంది. ఛాతీపై ఒత్తిడిగా అనిపిస్తుంది. గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది. తీవ్రంగా అలసిపోతారు. గుండె నుంచి నొప్పి ఇతర భాగాలకు సోకుతున్నట్టు అనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా గుండె పోటుతో మరణించిన వారు ఉంటే వారి వారసులు జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner