Vitamin D Deficiency । జుట్టు రాలడానికి విటమిన్ డి లోపం కూడా ఓ కారణం కావచ్చు, మరెన్నో నష్టాలు!-vitamin d deficiency may cause hair loss and muscle pain know more about it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin D Deficiency । జుట్టు రాలడానికి విటమిన్ డి లోపం కూడా ఓ కారణం కావచ్చు, మరెన్నో నష్టాలు!

Vitamin D Deficiency । జుట్టు రాలడానికి విటమిన్ డి లోపం కూడా ఓ కారణం కావచ్చు, మరెన్నో నష్టాలు!

HT Telugu Desk HT Telugu
Jun 20, 2023 09:47 AM IST

Vitamin D Deficiency: విటమిన్ D అనేది శరీరానికి అవసరమయ్యే ఒక ముఖ్యమైన పోషకం, విటమిన్ డి లోపం లక్షణాలు, తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలించండి.

Vitamin D Deficiency
Vitamin D Deficiency (istock)

Vitamin D Deficiency: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, విటమిన్లు అవసరం. శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. మనకు అనేక రకాలా విటమిన్లు అవసరం, ఇందులో విటమిన్ D కూడా ఒకటి. విటమిన్ D అనేది శరీరానికి అవసరమయ్యే ఒక ముఖ్యమైన పోషకం, అలాగే మన శరీరంలో తయారయ్యే ఒక హార్మోన్ కూడా.

ఇది కొవ్వులో కరిగే విటమిన్, ఇందులోనే విటమిన్లు D1, D2, D3 అనే రకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ డి2 (ఎర్గోకాల్సిఫెరోల్ లేదా ప్రీ-విటమిన్ డి) అలాగే విటమిన్ డి3 (కోలెకాల్సిఫెరోల్) అనేవి మనుషులకు అత్యంత ముఖ్యమైన సమ్మేళనాలు. విటమిన్ D మన శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ వంటి పొషకాల శోషణకు, ఇతర అనేక జీవక్రియ ప్రభావాలకు బాధ్యత వహిస్తుంది.

విటమిన్ల లోపంతో బాధపడుతున్న చాలా మందిలో, ఆశ్చర్యంగా విటమిన్ D లోపంతోనే బాధపడే వారే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలో సరైన స్థాయిలో విటమిన్ డి లేకపోతే మీరు ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి లోపం లక్షణాలు, తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలించండి.

డిప్రెషన్

మీలో డిప్రెషన్‌ భావాలు కలగడం కూడా విటమిన్ డి లోపంతో ముడిపడి ఉంది. తెలియని ఆందోళన కూడా ఉంటుంది. విటమిన్ డి లోపం నిద్రలేమికి దారితీస్తుంది. దీనివల్ల మానసిక స్థిరత్వం లోపిస్తుంది. గర్భిణీలు, వృద్ధులలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే విటమిన్ డి సప్లిమెంట్ల ప్రభావాలు డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచించాయి.

బలహీనమైన ఎముకలు

కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం వలన ఎముకలు సన్నగా, పెళుసుగా తయారవుతాయి. ఎముకల ఆకృతి కూడా మారవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది రికెట్స్ వ్యాధికి దారితీయవచ్చు. వృద్ధులు, స్త్రీలలో కూడా ఎముకలలో పగుళ్లు రావడానికి కారణం విటమిన్ డి లోపం కావచ్చు.

మధుమేహం ముప్పు ఎక్కువ

విటమిన్ డి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత లేదా ఏదైనా గాయం త్వరగా నయం కావడం లేదంటే మీ శరీరంలో మీ విటమిన్ డి స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని సంకేతం కావచ్చు. అంతేకాకుండా బరువు పెరగటంలో, ఊబకాయం రావడంలో విటమిన్ డి లోపం కూడా ఓ కారణం కావచ్చు. ఈ పరిస్థితులు మధుమేహం వ్యాధికి దారితీసే అవకాశం ఉంటుంది.

ఒళ్లు నొప్పులు

వెన్నునొప్పి, కండరాల నొప్పులకు వివిధ కారణాలు ఉండవచ్చు. అందులో విటమిన్ డి లోపం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. అధ్యయనాల ప్రకారం నడుము నొప్పి, కండరాల నొప్పులు కలవారికి విటమిన్ డి సప్లిమెంట్లు అందివ్వడం ద్వారా నొప్పులు నయం అయ్యాయి. అయితే మీకు ఒళ్లు నొప్పులు ఉన్నాయంటే అసలు కారణం తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి.

జుట్టు రాలడం

పోషకాల లోపం జుట్టు పెరుగుదలకు అడ్డంకిగా మారి వెంట్రుకలు రాలిపోవడానికి దారితీయవచ్చు. జుట్టు రాలడానికి విటమిన్ డి స్థాయిలు తక్కువ ఉండటం కూడా ఓ కారణం అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విటమిన్ డి లోపం వలన ఆందోళన భావాలు పెరుగుతాయని మనం చెప్పుకున్నాం. జుట్టు రాలడానికి పోషకాల లోపంతో పాటుగా ఒత్తిడి, ఆందోళనలు కూడా కారణం కావచ్చు.

విటమిన్ డి ఎలా లభిస్తుంది?

విటమిన్ డి మనకు ఆహారం, సప్లిమెంట్ల ద్వారా లభిస్తుంది. అలాగే సూర్యరశ్మిని పొందడం ద్వారా కూడా మీ శరీరం సహజంగా విటమిన్ డిని సృష్టిస్తుంది.

Whats_app_banner