Tomato Pulihora: అన్నం మిగిలిపోయిందా? పది నిమిషాల్లో ఇలా టమోటో పులిహోర చేసేయండి, టేస్టీగా ఉంటుంది-tomato pulihora recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Pulihora: అన్నం మిగిలిపోయిందా? పది నిమిషాల్లో ఇలా టమోటో పులిహోర చేసేయండి, టేస్టీగా ఉంటుంది

Tomato Pulihora: అన్నం మిగిలిపోయిందా? పది నిమిషాల్లో ఇలా టమోటో పులిహోర చేసేయండి, టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Mar 09, 2024 06:00 AM IST

Tomato Pulihora: అన్నం మిగిలిపోతే నిమ్మకాయ పులిహోర ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. టమోటా పులిహోరను చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్ ఫాస్ట్ రెసిపీగానే కాదు, లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగపడుతుంది.

టమోటా పులిహోర రెసిపీ
టమోటా పులిహోర రెసిపీ (Youtube)

Tomato Pulihora: ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. ఇలా అన్నం మిగిలిపోయినప్పుడల్లా కొంతమంది పడేస్తూ ఉంటారు. మరి కొంతమంది నిమ్మకాయ పులిహోరను చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఇలా లెమన్ రైస్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి టమోటా రైస్‌ను టమాటో పులిహోరను చేసి చూడండి. కేవలం 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ రెసిపీగానే కాదు... అవసరమైతే లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా మారిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. ఎలా చేయాలో తెలుసుకోండి.

టమోటో పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం - ఒక కప్పు

టమోటోలు - రెండు

కరివేపాకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - మూడు

శెనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

ఆవాలు - పావు స్పూను

పసుపు - పావు స్పూను

నూనె - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

టమోటో పులిహోర రెసిపీ

1. మిగిలిపోయిన అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి ముద్ద కాకుండా పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.

2. ఇప్పుడు టమోటోలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆవాలు వేసి చిటపటలాడించాలి.

5. తర్వాత శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.

6. అవి వేగాక పచ్చిమిర్చి, టమోటో తరుగును వేసి వేయించుకోవాలి.

7. పైన ఉప్పు చల్లి మూత పెడితే టమోటోలు మెత్తగా అయిపోతాయి.

8. ఇప్పుడు కరివేపాకులు, పసుపు వేసుకొని కలుపుకోవాలి.

9. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

10. ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.

11. స్టవ్‌ను చిన్న మంట మీద ఉంచాలి.

12. అన్నం బాగా కలిసాక పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. స్టవ్ కట్టేయాలి. అంతే టమోటా పులిహోర రెడీ అయినట్టే.

13. టమోటా పుల్లగా ఉంటుంది, కాబట్టి నిమ్మకాయ చల్లుకోవాల్సిన అవసరం ఉండదు.

14. టమోటాలు పులుపు తగ్గితేనే నిమ్మరసం కలుపుకోండి.

ప్రతిరోజూ తినాల్సిన కూరగాయల్లో టమోటో ఒకటి. టమోటా ప్రతిరోజూ తినేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా పురుషులు టమోటాలను తినడం వల్ల వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఏ పురుషులైతే వారానికి కనీసం కిలోన్నర టమోటో తింటారో వారికి ప్రొస్టేట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. అలాగే పిల్లలు, పెద్దలు అంతా టమోటాలు తినడం వల్ల వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇక టమోటోకి ఆ రంగుని ఇచ్చేది లైకోపీన్. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. మన శరీరానికి ఈ లైకోపీన్ చాలా అవసరం. హైబీపీని తగ్గించే లక్షణం కూడా టమోటోకి ఉంది. హై బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడేవారు ప్రతిరోజు టమోటాలను తినాలి. ప్రతిరోజూ అర గ్లాసు టమోటో రసాన్ని తాగినా కూడా... ఎంతో మేలు జరుగుతుంది. టమోటో రైస్, టమోటో పచ్చడి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పిన టమోటా పులిహార కూడా రుచి అదిరిపోతుంది. పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గానే కాదు, వారి లంచ్ బాక్స్ రెసిపీగా ఇది ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేసి పిల్లలకు తినిపించండి. వారికి నచ్చడం ఖాయం. స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చిని అధికంగా వేసుకోవాలి. పిల్లలకైతే ఒక పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది.

WhatsApp channel