Vankaya Tomato Chutney: కాల్చిన వంకాయ టమోటో పచ్చడి రెసిపీ ఇదిగో, వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది
Vankaya Tomato Chutney: మీకు పచ్చళ్ళు అంటే ఇష్టమా? అయితే ఒకసారి వంకాయ టమాటను కాల్చి పచ్చడి చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో రుచికరంగా ఉంటుంది.
Vankaya Tomato Chutney: తెలుగువారికి సాధారణంగానే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. రకరకాల పచ్చళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కాల్చిన వంకాయ టమాటాలతో చేసే పచ్చడి కూడా రుచిగా ఉంటుంది. దీన్ని స్పైసీగా చేసుకుంటే అదిరిపోతుంది. ఇది కేవలం అన్నంలోకే కాదు దోశె, ఇడ్లీ లోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. వంకాయ టమోటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కాల్చిన వంకాయ టమోటో పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
వంకాయలు - పావు కిలో
టమాటాలు - పావు కిలో
పచ్చిమిర్చి - ఐదు
ఎండుమిర్చి - రెండు
మెంతులు - పావు స్పూను
మినప్పప్పు - రెండు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
నూనె - ఐదు స్పూన్లు
కాల్చిన వంకాయ టమాటో పచ్చడి రెసిపీ
1. వంకాయలను టమోటాలను శుభ్రంగా కడగాలి.
2. గ్యాస్ బర్నర్ పై రోటీలను కాల్చే గ్రిడ్ పెట్టి ఈ వంకాయలను, టమోటాలను అన్ని వైపులా కాల్చుకోవాలి.
3. అవి చల్లారాక పైన నల్లగా మాడిన తొక్కలను తీసి మెత్తగా చేత్తోనో మెదిపి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనె బాగా వేడెక్కాక మెంతి గింజలు, మినప్పప్పు వేసి వేయించాలి. తర్వాత ఆవాలను వేసి చిటపటలాడించాలి.
6. తర్వాత పచ్చిమిర్చిని తరిగి వేయాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇంగువ వేసి కలపాలి.
7. ఇప్పుడు ఎండుమిర్చిని వేసి వేయించాలి.
8. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
9. ఆ మిశ్రమంలోనే టమోటాలను కూడా వేసి పేస్టులా చేసుకోవాలి.
10. కళాయిలో మిగిలిన నూనెలో మెదిపిన వంకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలపాలి.
11. ఇందులో టమోటా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
12. ఇప్పుడు దీనికి తాళింపు పెట్టుకోవాలి. తాలింపు వేసుకున్నాక కొత్తిమీరను పైన చల్లుకుంటే కాల్చిన వంకాయ టమోటో పచ్చడి రెడీ అయినట్టే.
13. ఇది వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.
వంకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వారంలో కనీసం రెండుసార్లు వంకాయలను తినడం చాలా అవసరం. ఇక టమోటోలు ఆరోగ్యానికి మంచిదే. ఇందులో ఉండే లైకోపీన్ మన శరీరానికి అత్యవసరమైనది. ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే పోషకాలను అందిస్తుంది. వంకాయ టమాటో కాంబినేషన్ ఎవర్ గ్రీన్. దీంతో కూరే కాదు ఇలా పచ్చడి చేసుకుంటే రుచిగా ఉంటుంది. స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవాలి. కారం తక్కువ కావాలనుకునే వారు పచ్చిమిర్చి సంఖ్యను తగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో ఒక్కసారి కలుపుకొని చూడండి, మీకు నచ్చడం ఖాయం.
టాపిక్